విడదీయాలని చూస్తే రోడ్డుపైనే కొడతాం..: జానీ మాస్టర్ వైఫ్
ABN , Publish Date - Aug 31 , 2026 | 04:28 PM
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో కొనసాగుతున్న సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చింది. తాజాగా సుమలత మాస్టర్ నిర్వహించిన మీడియా సమావేశం వైరల్ అవుతోంది.
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో కొనసాగుతున్న సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చింది. నిన్న (ఆదివారం) కృష్ణా నగర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో కొందరు డ్యాన్సర్లు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని, సుమలత కార్యవర్గాన్ని కాదని రఘు మాస్టర్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై సోమవారం అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షురాలు, జానీ మాస్టర్ వైఫ్ సుమలత (Jani Master wife Sumalatha) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆమె మాట్లాడుతూ.. ప్రత్యర్థి వర్గానికి, ఫిల్మ్ ఫెడరేషన్ వైఖరికి గట్టి కౌంటర్ ఇస్తూ.. హెచ్చరికలు జారీ చేశారు.
నిన్న జరిగిన సమావేశంపై సుమలత స్పందిస్తూ.. ‘‘నిన్న కృష్ణా నగర్‌లో కొందరు నిర్వహించింది పూర్తిగా అన్‌అఫీషియల్ మీటింగ్. దానికి అసోసియేషన్ పరంగా, చట్టపరంగా ఎలాంటి విలువ లేదు,. ప్రెసిడెంట్ అయిన నాకు కానీ, సెక్రటరీ, క్యాషియర్‌లకు ఎలాంటి సమాచారం లేకుండా ఆ మీటింగ్ పెట్టారు. అక్కడ ఏదో అడ్‌హాక్ కమిటీ అని వేశారు. ఆ కమిటీలో ఉన్నవారిలో సగం మందికి పైగా గతంలో ఫ్రాడ్ చేసినవాళ్లు, మేం సస్పెండ్ చేసినవాళ్లే ఉన్నారు. ఏ తప్పు చేయని మా కార్యవర్గాన్ని పక్కనపెట్టి, తప్పు చేసిన వారికే ఫెడరేషన్ కొమ్ముకాయడం దారుణం. ఐదేళ్ల క్రితం యూనియన్‌లో రూ. 36 లక్షల అవినీతి జరిగితే కమిటీ వేస్తామన్న ఫెడరేషన్ ఇంతవరకు దాని లెక్కలు తేల్చలేదు. డ్యాన్సర్స్ ఇన్‌చార్జ్‌ల వల్లే ఈ అవినీతి అంతా జరిగింది’’ అని సుమలత ఆరోపణలు చేశారు.
ఫెడరేషన్ సహాయ నిరాకరణపై మండిపడుతూ.. ‘‘మా కార్యవర్గానికి సహాయ నిరాకరణ చేస్తున్నట్లు 23 క్రాఫ్ట్స్‌కు, చాంబర్‌కు లెటర్లు పంపించారు కానీ, అసోసియేషన్ అధ్యక్షురాలైన నాకు ఇప్పటివరకు ఒక్క అధికారిక నోటీసు కూడా ఇవ్వలేదు. ఒక ఆడపిల్ల ప్రెసిడెంట్‌గా ఉండి అన్యాయాలను, అకౌంట్లను ప్రశ్నిస్తుంటే తొక్కేయాలని చూస్తున్నారు. మేం ప్రజాస్వామ్యబద్ధంగా, ఎలక్షన్ ఆఫీసర్ సమక్షంలో ఎన్నికలు నిర్వహించుకున్నాం. మాకు ఫెడరేషన్‌తో సఖ్యతగా కలిసి వెళ్లాలనే ఉంది. మాతో పాటు ఇతర సమస్యలున్న యూనియన్లను కలుపుకుని ఫెడరేషన్‌కు వ్యతిరేకంగా నిలబడటం మాకూ వచ్చు. చిరంజీవి గారు మొదటి నుంచీ మాకు అండగా ఉన్నారు.. అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకోమని చెప్పారు. ఆయనే ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించాలని కోరుతున్నాం. బాలకృష్ణ గారు మాతో ఏమీ మాట్లాడలేదు, ఎవరితోనో మాట్లాడారట.. దానిపై మాకు స్పష్టత లేదు’’ అని వివరించారు.
రఘు మాస్టర్ (Raghu Master) వ్యాఖ్యలపై సుమలత తీవ్రంగా స్పందిస్తూ.. ‘‘రఘు మాస్టర్ ఏదో పదవి కోసం ప్రాకులాడటం లేదంటున్నారు.. తప్పు చేసిన వారిని గల్లా పట్టి గుంజాలని ఆయన మాట్లాడారు. కానీ నేను స్పష్టంగా హెచ్చరిస్తున్నా.. 35 ఏళ్ల చరిత్ర ఉన్న మా డ్యాన్సర్స్ యూనియన్‌ను ఎవరైనా విభజించాలని కుట్రలు చేస్తే వారిని నడిరోడ్డు మీదే కొడతాం. న్యాయపరంగా కూడా కోర్టుల్లో తేల్చుకుంటాం, లీగల్ పోరాటం చేస్తాం’’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సుమలత చేసిన ఈ సంచలన వ్యాఖ్యలతో డ్యాన్సర్స్ యూనియన్ వివాదం టాలీవుడ్‌లో మరింత ముదిరి పీక్ స్టేజ్‌కు చేరింది.
ఇవి కూడా చదవండి:
సందీప్ పిలిస్తే రాకపోతే బతికి దండగ..: విజయ్ దేవరకొండ
ఆ క్లాసిక్ సాంగ్‌ను రీమిక్స్ చేస్తున్న త్రివిక్రమ్.. ఇక దండాలే
తప్పు చేస్తే గల్లా పట్టి బయటకు గెంటండి: డ్యాన్స్ మాస్టర్ రఘు