ఆ క్లాసిక్ సాంగ్‌ను రీమిక్స్ చేస్తున్న త్రివిక్రమ్.. ఇక దండాలే
ABN , Publish Date - Aug 30 , 2026 | 11:04 PM
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో సినిమా వస్తుందంటే చాలు.. టాలీవుడ్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. తాజాగా వారిద్దరి కాంబోలో రూపుదిద్దుకుంటోన్న మూవీ నుంచి ఓ వార్త వైరల్ అవుతోంది.
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో సినిమా వస్తుందంటే చాలు.. టాలీవుడ్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ సినిమాలకు త్రివిక్రమ్ రచయితగా అద్భుతమైన డైలాగ్స్ ఇచ్చారు. అయితే, ఇప్పుడు మొదటిసారి వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక డైరెక్టర్‌గా త్రివిక్రమ్ పూర్తిస్థాయి సినిమాను తెరకెక్కిస్తున్నారు అదే ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాత్రల పరిచయ గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వెంకీ మామ నటన, త్రివిక్రమ్ మార్క్ కామెడీ మిక్స్ అవ్వడంతో ఈ మూవీపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో యంగ్ హీరో నారా రోహిత్ కూడా ఒక అత్యంత కీలక పాత్రలో కనిపిస్తుండగా, ఎస్.ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
తాజాగా, ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక సంచలన వార్త తెగ చక్కర్లు కొడుతోంది. వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయినటువంటి పాత పాటను ఈ సినిమాలో రీసౌండ్ లేదా రీమిక్స్ చేయబోతున్నారట. ఈ వార్త నిజమేనంటూ తాజాగా చిత్ర నిర్మాత నాగవంశీ కూడా ధృవీకరించినట్లు సమాచారం. ఇంతకీ ఆ పాట ఏదో తెలుసా? విక్టరీ వెంకటేష్ క్లాసిక్ హిట్ మూవీ ‘కూలీ నెం. 1’ లోని ‘దండాలయ్యా ఉండ్రాలయ్యా’ పాట. అవును, ఈ సూపర్‌హిట్ డివోషనల్ కమ్ మాస్ సాంగ్‌ను ‘ఆదర్శ కుటుంబం’ కోసం తమన్ స్పెషల్‌గా రీమిక్స్ చేస్తున్నారట.
ఇప్పటికీ ఈ ‘దండాలయ్యా ఉండ్రాలయ్యా’ పాటకు తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా వినాయక చవితి వేడుకలు వచ్చాయంటే చాలు.. ప్రతి గణేష్ మండపం దగ్గర ఈ పాట మోగాల్సిందే. తరాలకతీతంగా ఎంతో ప్రజాదరణ పొందిన ఈ క్లాసిక్ సాంగ్‌కి, ఇప్పుడు తమన్ - త్రివిక్రమ్ కలయికతో కొత్త ఊపిరి పోయనున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో పాత పాటల రీమిక్స్ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి, ఒరిజినల్ పండుగ వైబ్ చెడిపోకుండా, నేటి యంగ్ ఆడియెన్స్‌కి తగినంత జోష్ ఇచ్చేలా తమన్ ఈ పాటను రీవర్క్ చేస్తున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే.. ‘ఆదర్శ కుటుంబం AK47’ సినిమా విడుదల తేదీలో మార్పులు జరగబోతున్నట్లుగా టాక్ మొదలైంది. ఇప్పటికే ప్రకటించిన ప్రకారం అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా రావలసిన ఈ సినిమాను, దసరా పండుగ అడ్వాంటేజ్ కోసం అక్టోబర్ 9వ తేదీకి లేదా అక్టోబర్ 16వ తేదీకి వాయిదా వేసే యోచనలో మేకర్స్ ఉన్నారట. దసరా సెలవుల్లో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టవచ్చనే ఉద్దేశంతోనే ఈ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి విక్టరీ వెంకటేష్ - త్రివిక్రమ్ లక్కీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
తప్పు చేస్తే గల్లా పట్టి బయటకు గెంటండి: డ్యాన్స్ మాస్టర్ రఘు
జానీ, సుమలత మాస్టర్స్‌కు షాక్.. డ్యాన్సర్స్ యూనియన్ సంచలన నిర్ణయం
రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ ఫస్ట్ లుక్ పోస్టర్.. ఇంట్రెస్టింగ్