‘రణబాలి’ విడుదలకు ముందే ఓటీటీలోకి.. అసలు విషయమిదే
ABN, Publish Date - Sep 27 , 2026 | 12:32 PM
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రశ్మిక మందన్న కాంబినేషన్‌లో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తోన్న మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రశ్మిక మందన్న (Rashmika Mandanna) కాంబినేషన్‌లో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తోన్న మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’ (Ranabaali). టీ-సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా అక్టోబర్ 16న విజయదశమి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఓటీటీలోకి అడుగుపెడుతోందన్న వార్త సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించగా.. దీని వెనుక ఉన్న అసలు నిజాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
సినిమా విడుదలకు ముందే ‘రణబాలి’ నేపథ్యంపై అంతర్జాతీయ దిగ్గజ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) వేదికగా 4 ఎపిసోడ్ల ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్‌ను తీసుకువస్తున్నట్లు చిత్ర యూనిట్ సంచలన ప్రకటన చేసింది. ‘రణబాలి: నెవర్ ఫర్‌గెట్ ది ట్రూత్’ (Ranabaali: Never Forget The Truth) పేరుతో ఈ డాక్యుమెంటరీ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. 19వ శతాబ్దపు బ్రిటీష్ పాలన నాటి యథార్థ చారిత్రక అంశాలు, సినిమా ప్రపంచం తాలూకు ఎక్స్‌క్లూజివ్ బిహైండ్ ది సీన్స్ కంటెంట్‌తో ఈ సిరీస్ ప్రేక్షకులను పలకరించనుంది.
ఈ డాక్యుమెంటరీ సిరీస్‌కు సంబంధించిన ఎపిసోడ్ల స్ట్రీమింగ్ షెడ్యూల్ వివరాలు:
మొదటి ఎపిసోడ్ (‘ది ఫెమైన్ వి ఫర్‌గాట్’ - The Famine We Forgot): సెప్టెంబర్ 28న ప్రీమియర్
రెండో ఎపిసోడ్ (‘ది హిస్టరీ వి ఫర్‌గాట్’ - The History We Forgot): సెప్టెంబర్ 30న ప్రీమియర్
మూడో ఎపిసోడ్ (‘ది మెన్ వి ఫర్‌గాట్’ - The Men We Forgot): అక్టోబర్ 2న ప్రీమియర్
నాలుగో ఎపిసోడ్ (‘ది లాస్ట్ లోడ్’ - The Last Load): విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.
సాధారణంగా చరిత్రకు రెండు కోణాలు ఉంటాయి.. ఒకటి మనకు పుస్తకాల్లో చెప్పింది, మరొకటి ఎవరికీ తెలియకుండా సమాధి చేయబడింది. అలా ఎవరికీ తెలియకుండా కాలగర్భంలో కలిసిపోయిన కఠిన వాస్తవాలను, సమాజం విస్మరించిన చీకటి నిజాలను ఈ 4 ఎపిసోడ్ల ‘రణబాలి ట్రూత్ సిరీస్’ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌లో ఆవిష్కరించబోతున్నారు. థియేటర్లలో భారీ యాక్షన్ యుద్ధం మొదలయ్యే ముందే, కథ నేపథ్యాన్ని ప్రపంచ స్థాయి ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఓటీటీ వేదికగా డాక్యుమెంటరీని విడుదల చేయడం భారతీయ సినీ పరిశ్రమలోనే ఒక వినూత్నమైన, ధైర్యవంతమైన ప్రయోగంగా ట్రేడ్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. చూద్దాం మరి.. ఈ సిరీస్, సినిమాకు ఏ విధంగా యూజ్ అవుతుందో..
ఇవి కూడా చదవండి:
తెలుగులో థియేటర్లకు.. కీర్తి సురేశ్, సనంత్ లెస్బియన్ మూవీ
దర్శకుడు ప్రదీప్ అద్వైతంకు భార్యావియోగం
మోహన్ బాబు చాలా స్ట్రిక్ట్ అనుకుంటారు కానీ.. అంత లేదు: నాని