తెలుగులో థియేటర్లకు.. కీర్తి సురేశ్, సనంత్ లెస్బియన్ మూవీ
ABN , Publish Date - Sep 27 , 2026 | 11:03 AM
నటనా ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో ప్రేక్షకులను పలకరించే హీరోయిన్ కీర్తి సురేశ్ నటించిన తాజా చిత్రం ‘డోరతీ’.
నటనా ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో ప్రేక్షకులను పలకరించే హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh)నటించిన తాజా చిత్రం ‘డోరతీ’ (Dorothy). తాజాగా తమిళంలో విడుదలైంది. ఓ బోల్డ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ‘డోరతీ’లోని ముగింపు సన్నివేశాలకు ప్రస్తుతం సోషల్‌మీడియాలో విపరీతమైన విమర్శలు వస్తున్నాయి.
సనంత్ (Sananth), రిషికాంత్ (Rishikanth) ప్రధాన పాత్రధారులుగా కార్తిక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులోనూ విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను తన నిర్మాణ సంస్థ ‘స్పిరిట్ మీడియా’ సమర్పణలో అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు రానా దగ్గుబాటి (Rana Daggubati). జ్యోతి దేశ్‌పాండే, గునీత్ మోంగా, అచిన్ జైన్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.
ఇందులోని కొన్ని సన్నివేశాలకు ఎల్‌జీబీటీక్యూ(లెస్బియన్, గే, ట్రాన్స్‌జెండర్ అండ్ క్వీర్) నేపథ్యం ఉండడంతో మలేషియాలోని చిత్రనిబంధనల ప్రకారం ‘డోరతీ’ని అక్కడి సెన్సార్ బోర్డు ప్రదర్శనకు అనుమతించకపోవడం గమనార్హం. కాగా, ఇటీవలే టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన ఈ సినిమా అక్కడ స్టాండింగ్ ఒవేషన్ దక్కించుకుంది. అలాగే దశాబ్దం తర్వాత అక్కడ ప్రదర్శితమైన తమిళ సినిమాగా ఘనత సాధించింది.
నెటిజన్లు సీరియస్!
అయితే.. టాలీవుడ్‌లో గుర్తింపు కథలు ఎక్కువ వస్తున్నట్లు.. కోలీవుడ్‌లో స్వలింగ సంపర్కాన్ని చూపించే కథలు ఎక్కువ వస్తున్నాయి. ఇప్పటికే బ్యాడ్ గర్ల్, ఈ మధ్యే వచ్చిన వదంతి వెబ్ సిరీస్ ఈ తరహా కథలే కావడం విశేషం. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ద ప్యారడైజ్ టాక్ గురించి డిబేట్స్ పెట్టి దండయాత్రలు చేస్తున్నందు వలన అదే రోజు తమిళ్ ఇండస్ట్రీలో వచ్చిన ఒక సినిమా ‘డోరోతి’ గురించి మర్చిపోయారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ లో కానీ, ట్రైలర్ లో కానీ.. ఇలాంటి ఒక కాన్సెప్ట్ తో సినిమా తీస్తున్నామని తెలియకుండా జాగ్రత్త పడ్డారు. సెప్టెంబర్ 25 న తమిల నాట రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అంతేగాక కార్తీక్ సుబ్బరాజ్, కీర్తి సురేశ్, రిషి కాంత్‌ల మీద నమ్మకంతో కథా నేపథ్యం తెలుసుకు కోకుండా సినిమాకు వెళ్లిన, వెళుతున్న ప్రేక్షకులు అసలు కథ తెలిశాక, చూశాక ఖంగు తింటున్నారు. అసలేం సినిమా చూస్తున్నాం రా ఇలా చేశావేంటయ్యా సుబ్బరాజు అంటూ విమర్శలు చేస్తున్నారు.
1990ల నాటి గ్రామీణ తమిళనాడు నేపథ్యంతో, కుల వివక్ష, హింస, పురుషాధిక్య భావజాల వంటి అంశాల చుట్టూ ఈ కథ సాగుతుంది. సినిమా ప్రథమార్ధం ఒక చక్కని విలేజ్ డ్రామాగా, గ్రామీణ వాతావరణం, అక్కడి మనుషుల సంబంధాలు, కుల రాజకీయాల చుట్టూ చాలా ఆసక్తికరంగా సాగుతుందట. అయితే ద్వితీయార్థంలో కథ పూర్తిగా ఊహించని మలుపు తిరుగుతుందని ఊరిలోని పరిస్థితుల వల్ల పాత్రలు రోడ్డు పైకి రావడంతో ఇది ఒక రోడ్ మూవీగా మారి చివర్లో ఈ కథలోకి LGBTQ+, ఐడెంటిటీ థీమ్‌లు ఉంటాయని.. ఇద్దరు మగాళ్లు ప్రేమించుకోవడం.. వారిమధ్య ఇంటిమేటెడ్ సీన్స్ ని కూడా డైరెక్టర్ చూపించినట్లు తమిళ తంబీలు చెప్పుకొస్తున్నారు.
అంతేకాకుండా ఈ సినిమాను బ్యాన్ చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ చిత్రం క్లైమాక్స్ లో ఒక హీరో ట్రాన్స్ జెండర్ గా మారి.. మరొక హీరోని పెళ్లి చేసుకునే సీన్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ సినిమా తరువాత కార్తీక్ సుబ్బరాజ్ లాంటి మాస్ అండ్ కల్ట్ డైరెక్టర్ నుంచి ఇలాంటి ఒక కాన్సెప్ట్ రావడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. LGBTQ+ అంశాల గురించి మాట్లాడటం, అవగాహన కల్పించడం మంచిదే, కానీ ఇలాంటి ఆలోచనలను బలవంతంగా ప్రేక్షకులపై రుద్దడం ఎంతవరకు సమంజసం? ఇది ఏమాత్రం సరైన దిశ కాదు అని కొందరు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ నుంచి మేము ఇలాంటి సినిమాను అస్సలు ఊహించలేదని సోషల్ మీడియా కామెంట్లు పెడుతున్నారు.
అయితే మరికొందరు మాత్రం దర్శకుడి ధైర్యాన్ని అభినందిస్తున్నారు. కుల వ్యవస్థను, సమాజంలోని మూస ధోరణులను ప్రశ్నిస్తూనే, సున్నితమైన అంశాన్ని ప్రధాన స్రవంతి సినిమాలో చూపించడానికి ప్రయత్నించారని మద్దతుగా నిలుస్తున్నారు. కీర్తి సురేష్ తో పాటు సనంత్, రిషికాంత్ తమ పాత్రలకు ప్రాణం పోశారని, కథలోని టోన్ మారినప్పటికీ నటీనటుల పెర్ఫార్మెన్స్ సినిమాను నిలబెట్టిందని చెప్తున్నారు. ఏది ఏమైనా డోరోతి సినిమా కోలీవుడ్‌లోనే కాక నెట్టింట తీవ్రమైన చర్చలకు వేదికగా మారింది. ఇక ఈ కథ విన్న కొందరు ఏం దిక్కుమాలిన కథలురా ఇవి.. తెలుగులో ఇంకా ఈ సినిమా రిలీజ్ కాలేదు.. ఇక్కడ రిలీజ్ చేస్తే ప్రేక్షకులు బ్యాన్ చేసేవరకు వదిలిపెట్టరు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.