మోహన్ బాబు చాలా స్ట్రిక్ట్ అనుకుంటారు కానీ.. అంత లేదు: నాని
ABN , Publish Date - Sep 26 , 2026 | 10:07 PM
నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘ద ప్యారడైజ్’. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.
నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘ద ప్యారడైజ్’ (The Paradise). కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) కీలక పాత్ర పోషించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్లతో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా శనివారం మేకర్స్ మీడియా ములాఖాత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ..
‘‘నిర్మాత సుధాకర్ గారిని మేమందరం చాలా ఇబ్బంది పెట్టాం. ఆయన చాలా మొహమాటస్తుడు, సైలెంట్ పర్సన్. ఇంత పిచ్చితనం ఉన్న సినిమాను ఈయన హ్యాండిల్ చేయగలరా అనిపించేది. కానీ ఆయన సైలెన్సే ఆయనకు బిగ్గెస్ట్ వెపన్ అయింది. వర్షాలు పడి సెట్స్ పాడైనా, డేట్స్ సమస్యలొచ్చినా రాక్ సాలిడ్‌గా మా వెనుక నిలబడ్డారు. ఆయన కెరీర్‌లో ‘ద ప్యారడైజ్’ ఎప్పటికీ చాలా స్పెషల్ ఫిల్మ్‌గా నిలిచిపోతుంది.
దర్శి, సోనాలి, కాయదు, రాఘవ్..
దర్శి చేసిన శంకరన్న పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సరైన పాత్ర పడితే కమల్ హాసన్ గారి టాలెంట్ ఎలా కనిపిస్తుందో, మంచి రోల్ దక్కిన ప్రతిసారీ దర్శి అలాగే చెలరేగిపోతాడు. రాఘవ్ నా తమ్ముడిలా మారిపోయాడు, తక్కువ నిడివిలోనే చోటా మాలిక్‌గా అందరి మనసులు గెలుచుకున్నాడు. సోనాలి మేడమ్ సమ్మక్క పాత్రతో సినిమాకు గుండెకాయలా నిలిచారు. ఇక కాయదు లోహర్ కెరీర్ ప్రారంభంలోనే ఇంతటి బోల్డ్, రిస్కీ పాత్రను ఒప్పుకుని ఆ ఎమోషన్‌ను చాలా సహజంగా పండించింది.
మోహన్ బాబు గారు.. హీరో పైన ఉన్న హీరో!
నాకు చిన్నప్పటి నుంచే మోహన్ బాబు గారి నటన, ఆయన డైలాగ్ డెలివరీ అంటే పిచ్చి. ‘అసెంబ్లీ రౌడీ’, ‘పెదరాయుడు’ చిత్రాలకు నేను బిగ్ ఫ్యాన్‌ని. రఫ్ ఎడిట్ చూస్తున్నప్పుడు ఆయన సీన్లకు వేరే వాళ్ల వాయిస్‌తో డబ్బింగ్ చెబితే స్క్రీన్ వైపు చూడాలనిపించలేదు. ఆయన గొంతు పడితేనే ఆ కిక్ వస్తుంది. బయట ఆయన చాలా స్ట్రిక్ట్ అని అనుకుంటారు కానీ.. దగ్గరగా చూస్తే ఆయన ఎంత స్వీట్ పర్సనో, ఎంత గొప్ప మనసున్న వ్యక్తియో అర్థమవుతుంది. తనలోని ఆ మంచితనాన్ని చూస్తే అందరూ ప్రేమలో పడిపోతారని ఆయన దాన్ని దాచిపెట్టుకుని గంభీరంగా కనిపిస్తారేమో! సినిమా రిలీజ్‌కు ముందు ఫోన్ చేశారు, రిలీజ్ తర్వాత ఇంటికి పండ్ల బుట్టలు, గిఫ్ట్స్ పంపించారు. ఒకసారి ఆయన మనల్ని ఓన్ చేసుకుంటే ఆ ప్రేమను తట్టుకోలేం. ఈ సినిమాకి హీరో ఉన్నాడు కానీ.. ఆ హీరో పైన ఉన్న హీరో డాక్టర్ మోహన్ బాబు గారే. ఆయనతో నా ఈ బంధం జీవితాంతం ఇలాగే కొనసాగాలి.
కీర్తి సురేష్, సత్యరాజ్, ఈశ్వరి రావు..
కీర్తి సురేష్ నా కుటుంబ సభ్యురాలి లాంటిది. తను స్వీట్‌గా ఒప్పుకుని వచ్చి ‘యేసు నాగుల’ పాటలో నాతో కలిసి మెరిసింది. అలాగే ప్రీ-క్లైమాక్స్ సీన్‌లో ఈశ్వరి రావు గారి నటన థియేటర్లలో ఒక హై ఇచ్చింది. ‘జెర్సీ’ తర్వాత సత్యరాజ్ గారితో నాకు సీన్లు లేకపోయినా, ఆయన చేసిన చిన్న పాత్రకు కూడా థియేటర్లలో విశేష స్పందన లభిస్తోంది.
శ్రీకాంత్ ఒరిజినల్ పీస్.. 2026లో బిగ్గెస్ట్ నాయిస్ ఇదే!
శ్రీకాంత్ ఓదెల చాలా ఒరిజినల్ పీస్. ఏది చేసినా కన్విక్షన్‌తో ప్రాణం పెట్టి చేస్తాడు. నేనతన్ని గారాబం చేస్తానని చాలామంది అనుకుంటారు కానీ.. మా నాన్న నాతో ఎంత స్ట్రిక్ట్‌గా ఉండేవారో, నేను శ్రీకాంత్‌తో అంత స్ట్రిక్ట్‌గా ఉంటాను. గత వారం రోజులుగా టీవీ పెట్టినా, ఇంటర్నెట్ చూసినా, ఏ మనిషిని కలిసినా ఒకే ఒక్క టాపిక్ నడుస్తోంది.. అదే ‘ప్యారడైజ్’ గెలుపు. 2026లో అత్యధికంగా నాయిస్ క్రియేట్ చేసిన సినిమా ‘ద ప్యారడైజ్’ మాత్రమే. ఈ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’’.. అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
Mohan Babu: నాని నువ్వు గొప్ప నటుడివి.. నూరేళ్లు చల్లగా ఉండాలి
వరుస సూపర్ హిట్స్.. అయినా ఈ భామకు తెలుగులో నో ఛాన్స్
‘ద ప్యారడైజ్’.. ఇలాంటి రెస్పాన్స్ నేనెక్కడా చూడలేదు: నాని