The Traitors 2: అగ్నికి ఆజ్యం పోస్తున్న కరణ్ జోహార్!
ABN, Publish Date - Jul 27 , 2026 | 04:20 PM
కరన్ జోహార్ హోస్ట్ చేయబోతున్న 'ట్రెయిటర్స్ -2 ' ఆగస్ట్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందులో మల్లికా షెరావత్, మనవర్ ఫరూఖీ పాల్గొన బోతున్నారని కరణ్ జోహార్ తెలిపారు.
ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించ బోతున్న 'ట్రెయిటర్స్ -2 ' సీజన్ 2 ఆగస్ట్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సీజన్ మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ పాల్గొనబోతున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ తో స్ట్రీమింగ్ డేట్‌తో పాటు కరణ్ జోహర్ ఈ సీజన్ లో పాల్గొన బోతున్న ఇద్దరి పేర్లను అధికారికంగా ప్రకటించాడు. అందులో ఒకరు బాలీవుడ్ కథానాయిక మల్లికా షెరావత్ కాగా మరొకరు వివాదాస్పద స్టాండప్ కమెడియన్ మనవర్ ఫరూఖీ.
మోసం, వ్యూహం, ద్రోహం వంటి అంశాలు ప్రధానంగా ఈ రియాలిటీ షో సాగుతుంది. దీని గురించి కరణ్ జోహార్ తెలియచేస్తూ, 'మొదటి సీజన్ పూర్తయ్యి యేడాది పూర్తయ్యింది. కానీ అప్పటి ద్రోహాలు మాత్రం తాజాగానే ఉన్నాయి. అందులోని స్నేహాలు తాత్కాలికం. గానీ గందర గోళం మాత్రం శాశ్వతం. ఇతర రియాలిటీ షోస్ కు ఇవి రియాలిటీ చెక్ ఇచ్చాయి. ఈసారి ప్యాలెస్ లోకి 21 మంది ఆటగాళ్ళు వస్తున్నారు. వాళ్ళు కేవలం గేమ్ ఆడరు. మనోభావాలతో ఆటలాడుకుంటారు. ఆగస్ట్ 13న వీరి ధోఖా టైమ్ మొదలు కాబోతోంది' అని అన్నారు. మల్లికా షెరావత్, మనవర్ ఫరూఖీ తో పాటు క్రిస్టిల్ డిసౌజా, షాలినీ పస్సి, సంజయ్ కపూర్, అభిషేక్ మల్హాన్ కూడా ఈ సీజన్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. అలానే రుబినా దిలైక్, దలీప్ తాహిల్, శ్వేతా తివారి, రియా చక్రవర్తి, ఆదిత్య ఖుష్రేష్ఠ్ పేర్లు కూడా వినబడుతున్నాయి. మరి వీరిలో ఎవరెవరు ప్యాలెస్ లోకి ప్రవేశిస్తారో చూడాలి. అయితే వివాదాస్పద స్టాండప్ కమెడియన్ మనవర్ ఫరూఖీని ఇందులో ప్రవేశ పెట్టడంపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. మరి వాటిపై కరణ్ జోహార్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
ఇవి కూడా చదవండి:
‘టాక్సిక్’ వన్ మంత్ కౌంట్‌డౌన్ పోస్టర్.. అరాచకం
200 మిలియన్ వ్యూస్.. ‘ఆయా షేర్’ ఆల్ టైమ్ రికార్డ్
మహేష్ బాబు తర్వాత మళ్లీ జై కృష్ణలోనే చూశా: వీకే నరేష్