సినీ కార్మికులకు పెరిగిన వేతనాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే?
ABN, Publish Date - Nov 09 , 2026 | 02:57 PM
తెలుగు సినీ కార్మికుల వేతనాల సవరణకు ఫిల్మ్ ఛాంబర్, కో-ఆర్డినేషన్ కమిటీ మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. పెరిగిన వేతనాలు అక్టోబర్ 21 నుంచి అమల్లోకి రానున్నాయి. సాధారణ పని పరిస్థితులు, క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు, రేట్ కార్డుల అమలుపై కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
జీతాలను పెంచాలని కోరుతూ సినీ కార్మికులు చేసిన సమ్మెకు పూర్తి స్థాయిలో సార్థకత చేకూరింది. అప్పట్లో లేబర్ కమీషనర్‌తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం ఈ విషయంపై దృష్టి నిలిపి, ఫెడరేషన్ నాయకులతో మాట్లాడి సమ్మెను విరమింప చేశారు. ఆ సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగానే ఇప్పుడు రెండవ సంవత్సరానికి సంబంధించిన వేతనాల సవరణ నిమిత్తమై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గత నెల 27, ఈ నెల 4వ తేదీన 'కో-ఆర్డినేషన్ కమిటీ'తో సమావేశమైంది. ఇరు పక్షాల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం వారు అనేక అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చి. దానిని రికార్డ్ చేశారు. ఈ విషయమై తాజాగా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు డి. సురేశ్ బాబు ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. దాని ప్రకారం ఈ రెండు రోజుల్లో జరిగిన సమావేశాల అనంతరం సవరించిన వేతనాలను ఆమోదించడం జరిగింది. దీనికి అనుగణంగా సరివరించిన వేతనాలను అక్టోబర్ 21 నుంచి అమలులోకి తీసుకు రావడానికి అంగీకారం కుదిరింది. ఈ అంశాలను ఫెడరేషన్‌లోని అనుబంధ సంఘాలకు తెలియచేసి, వెంటనే దీనిని అమలులోకి తీసుకురాబోతున్నారు.
దీనిపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొన్ని వివరణలను తెలియచేసింది.
2022లో కుదుర్చుకున్న ఒప్పందాలలో పేర్కొన్న పని పరిస్థితులు (working conditions), గౌరవ లేబర్ కమిషనర్ సమక్షంలో అంగీకరించి, 21-08-2025 నాటి అవగాహన ఒప్పందంలో పొందుపరిచిన అన్ని నిబంధనలు, షరతులను యథాతథంగా, కచ్చితంగా పాటించాలి.
సమావేశంలో చర్చించిన విధంగా, ప్రస్తుతం అమల్లో ఉన్న పని పరిస్థితులను, అనుబంధ సంఘాలు, ఫెడరేషన్లతో కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలను సమీక్షించి, వీలైనంత త్వరగా తుది నిర్ణయానికి రావాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు, పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారమై, 'సాధారణ పని పరిస్థితుల' (General Working Conditions) పత్రంపై అన్ని పక్షాలు సంతకాలు చేసే వరకు — సంబంధిత సంఘాలు, ఛాంబర్, ఫెడరేషన్ల మధ్య సమావేశాలు కొనసాగుతాయి. సాధారణ పని పరిస్థితులు సంతకాలు పూర్తయిన వెంటనే అమలులోకి వస్తాయి. అంతకుముందు అన్ని పక్షాల మధ్య కుదిరిన ఒప్పందాలు, అవగాహన ఒప్పందాల స్థానంలో ఇవి అమలవుతాయి. ఈ ప్రక్రియ 15 నవంబర్ 2026 లోపు పూర్తి కావాలి.
అన్ని పక్షాల అంగీకారం మేరకు, ఫెడరేషన్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సభ్యులతో కూడిన ఒక క్రమశిక్షణ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ పనితీరుకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణ మార్గదర్శకాలను కూడా రూపొందించాలి. అలానే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, సంబంధిత యూనియన్లు సంయుక్తంగా సంతకం చేసిన రేట్ కార్డులను మాత్రమే ఖచ్చితంగా పాటించాలి. ఈ అంశాలను, పెరిగిన వేతనాల సవరింపు వివరాలను ఫిల్మ్ ఛాంబర్, కో-ఆర్డినేషన్ కమిటీ ఫెడరేషన్ నాయకులకు లేఖలను అందించాయి.
ఇవి కూడా చదవండి!
అందరికీ రాపో స్వాగతం.. ధర్మన్ గట్టిగానే ప్లాన్ చేసిందిగా
‘కింగ్ 100’లో కర్ణగా వెర్సటైల్ యాక్టర్.. ఫస్ట్ లుక్ అదిరింది
కూతురితో.. రేణూ దేశాయ్ దీపావళి సంబరాలు