రాధికా ఆప్టే వ్యాఖ్యలపై రెజీనా ఫైర్
ABN, Publish Date - Nov 05 , 2026 | 06:05 PM
టాలీవుడ్ కల్చర్, సీనియర్ హీరోలపై రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా నటి రెజీనా కసండ్రా, పాయల్ రాజ్‌పుత్ ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు.
టాలీవుడ్ కల్చర్ గురించి, సీనియర్ హీరోల ప్రవర్తన గురించి కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో విశేష ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య జాన్వీ కపూర్, తాజాగా రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలను సమర్థించే వారు కొందరున్నట్టుగానే విమర్శించే వారూ ఎంతో మంది ఉన్నారు. చిత్రం ఏమంటే ఇటు జాన్వీ, అటు రాధికా ఆప్టే ఇద్దరి మాటలు గురివింద గింజను గుర్తు చేస్తున్నాయని అందరూ అంటున్నారు. ఉత్తరాది చిత్రాలలో అసభ్యకర సన్నివేశాలు, పాటలలో నటించినప్పుడులేని అభ్యంతరం 'పెద్ది' సినిమాలోని సన్నివేశాలలో నటించినప్పుడు వచ్చిందా? అని కొందరు విమర్శిస్తున్నారు. ఇక రాధికా ఆప్టేను అయితే... విమర్శిస్తున్న వాళ్ళు కోకొల్లలు. నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్గా నటించాలని ఎంతో మంది కోరుకుంటారని, పైగా 'లెజెండ్' లాంటి సూపర్ హిట్ మూవీలో అవకాశం రావడం అనేది అదృష్టంగా భావిస్తారు. అందులో రాధికా ఆప్టే పాత్రకు ఎంతో గౌరవం కూడా ఉంటుంది. అలాంటి పాత్రను పోషించి కూడా 'పెద్ద వయసు హీరోతో రొమాన్స్ చేయడం ఇబ్బంది కరం' అని ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. చిత్రం ఏమంటే 'లెజెండ్'లో బాలకృష్ణతో రొమాన్స్ చేయడానికి ఇబ్బందులు పడిన రాధికా ఆప్టే ఆ తర్వాత అదే బాలకృష్ణ సరసన తర్వాత సంవత్సరంలో 'లయన్' మూవీలో ఎలా నటించిందని బాలకృష్ణ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే... ఉత్తరాది భామలు తెలుగు దర్శకులను, సినిమాలను విమర్శించడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో తాప్సీ పన్ను సైతం తన తొలి చిత్ర దర్శకుడు కె. రాఘవేంద్రరావును విమర్శించింది. అయితే... వీళ్ళంతా ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే రకాలని కొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు. అలానే ప్రముఖ నటి రెజీనా కసండ్రా సైతం ఉత్తరాది భామలు చేసిన వ్యాఖ్యలపై స్పందించింది. తాను మహిళా పక్షపాతినని చెబుతూనే, 'ఎవరికైనా ఏదైనా సినిమాలో నటిస్తున్న సమయంలో అభ్యంతరంగా అనిపిస్తే, వెంటనే ఆ ప్రాజెక్ట్ నుంచి వాకౌట్ చేయవచ్చని, అలా చేయకుండా ఆ తర్వాత విమర్శించడం సబబు కాద'ని తెలిపింది. నయనతార నటించిన 'మూకుత్తి అమ్మన్ 2' సినిమాలో రెజీనా కీలక పాత్రను పోషించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె ఉత్తరాది భామల వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించింది. ఉత్తరాది, దక్షిణాది అంటూ సినిమా రంగాన్ని రెండుగా చీల్చడం కూడా సబబు కాదని తెలిపింది. తాను నటించిన హిందీ సినిమా ప్రమోషన్స్ లో కరణ్ జోహార్ తనకు ప్రాధాన్యం ఇవ్వలేదని, తనను అస్సలు పట్టించుకోలేదని వాపోయింది. ఆ సమయంలో తాను ఉత్తరాది దర్శకుల ప్రవర్తనపై విమర్శలు గుప్పించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించమని కోరింది. సినిమా రంగాన్ని ఇలా విడగొట్టి మాట్లాడటం కరెక్ట్ కాదని రెజీనా స్పష్టం చేసింది.
రాధికా ఆప్టే వ్యాఖ్యలను పాయల్ రాజ్ పుత్ సైతం తీవ్రంగా ఖండించింది. 'ఏ ఇండస్ట్రీ అయితే మనకు పేరు, ప్రఖ్యాతులను అందించిందో కొన్నేళ్ళ తర్వాత దానినే విమర్శించడం సరైనది కాద'ని పాయల్ తెలిపింది. మొత్తానికి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు కొరివితో తల గోక్కున్న చందంగా మారాయి.
ఇవి కూడా చదవండి:
‘ఫలక్‌నుమా దాస్’, ‘కల్ట్’ యాక్టర్‌కు హీరోగా ఛాన్స్
భాగ్యశ్రీ బోర్సే సీక్రెట్ టాలెంట్.. నెట్టింట వైరల్
ఇంతింతై వటుడింతై.. నెల్సన్ గ్రాఫ్ చూశారా