సినిమా రివ్యూ: రామాయణం

ABN , Publish Date - Nov 05 , 2026 | 02:18 PM

'ఆదిపురుష్‌' పేరుతో ఓం రౌత్‌ తెరకెక్కించిన విధానం చూసిన తర్వాత అందరికీ రామాయణం మీద సినిమా అంటే భయం మొదలైంది. అలా ఉండకుండా ఉంటే చాలు అనే పరిస్థితి వచ్చింది. తాజాగా వచ్చిన నితీశ్‌ తివారీ 'రామాయణం' అలా పోల్చడానికి ఆస్కారం లేని విధంగానే ఉంది.

Ramayanam Movie review

వాల్మీకి రామాయణాన్ని ఎందరెందరో తమ అనుభూతులను జోడించి, వేల గ్రంథాలుగా తీసుకొచ్చారు. అలాగే 'రామాయణ' గాథను ఎందరెందరో దర్శకులు వెండితెరపై ఆవిష్కరించారు. ఇక రామానందసాగర్‌ వంటి వారు బుల్లితెర ధారావాహికగానూ రూపొందించారు. దేశవ్యాప్తంగా జనాలు టీవీలకు అతుక్కుపోయి దానిని వీక్షించారు. తెలుగులో అయితే రామాయణం ఎన్నిసార్లు సినిమాగా వచ్చిందో లెక్కేలేదు. ఇలాంటి అద్భుత గాథను 'ఆదిపురుష్‌' పేరుతో ఓం రౌత్‌ తెరకెక్కించిన విధానం చూసిన తర్వాత అందరికీ రామాయణం మీద సినిమా అంటే భయం మొదలైంది. అలా ఉండకుండా ఉంటే చాలు అనే పరిస్థితి వచ్చింది. తాజాగా వచ్చిన నితీశ్‌ తివారీ 'రామాయణం' అలా పోల్చడానికి ఆస్కారం లేని విధంగానే ఉంది. నిజానికి ఇదో విజువల్ వండర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ నితీశ్‌ 'రామాయణం' కాకుండా 'రావణాయణం' చూపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు విడుదలైన ప్రథమభాగం చూస్తే అందరికీ అదే భావన కలగటం ఖాయం. (Ramayanam Review)

నితీశ్‌ (nitesh Tiwari) రామాయణం ఎలా సాగిందంటే... దేవదానవుల సంగ్రామంలో ఓటమి పాలైన అసురులు పాతాళంలో దుర్బర జీవితాన్ని గడుపుతుంటారు. దేవతల అండతో కుబేరుడు లంకను పరిపాలిస్తుంటాడు. దీనిని సహించలేని కైకసి (శోభన) తన కొడుకు రావణుడు (యశ్‌)కి కర్తవ్య బోధ చేస్తుంది. అసుర జాతికి పూర్వ వైభవాన్ని తీసుకు రాగల శక్తియుక్తులు అతనికే ఉన్నాయని చెబుతుంది. దాంతో బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసిన రావణుడు ముల్లోకాలను జయించగల వరం పొందుతాడు. ఆ వరంతో దేవేంద్రుడితో సహా అందరినీ పరాజయులను చేస్తాడు. ఘోర అవమానం పాలైన దేవేంద్రుడి కోరిక మేరకు మహా విష్ణువు... తన ఏడవ అవతారమైన రాముడిగా భూలోకంలో జన్మిస్తాడు. అది రావణ సంహారం కోసమేనని మునులు దేవేంద్రుడికి చెబుతారు. ముల్లోకాలను జయించి లంకను స్వర్ణలంకగా మార్చిన రావణుడికి అడ్డు అనేది ఉండదు. అదే సమయంలో అయోధ్యలో దశరథ తనయుడిగా విష్ణువు అవతరిస్తాడు. శస్త్ర విద్యలలో ఆరితేరిన రామలక్ష్మణులను విశ్వామిత్రుడు తనతో తీసుకెళ్ళి తపస్సుకు ఆటంకాన్ని కలిగిస్తున్న రాక్షసులను సంహరింప చేస్తాడు. ఆపైన సీతాస్వయంవరానికి తీసుకెళతాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహానంతరం కైకేయి షరతు మేరకు రాముడు అరణ్య వాసానికి బయలు దేరతాడు.

అక్కడ లంకలో శూర్పణఖ (రకుల్‌ ప్రీత్‌ సింగ్‌) భర్త విద్యుజ్జిహ్వడు (వివేక్‌ ఓబెరాయ్‌) అహంకార పూరిత ప్రవర్తన కారణంగా బావ రావణుడి చేతిలో మరణిస్తాడు. రావణుడిని శరణుజొచ్చినా, అతను తన భర్తను చంపడాన్ని శూర్పణఖ తట్టుకోలేకపోతుంది. మనసు కుదుట పడటం కోసం దండకారణ్యంకు వచ్చిన శూర్పణఖ రాముడిని చూసి మోహిస్తుంది. సీత రూపంలో వచ్చి రాముడిని ఏమార్చడం తట్టుకోలేక లక్షణుడు ఆమె ముక్కు కోస్తాడు. చెల్లికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి రావణుడు మారీచుడి సాయంతో సీతాపహరణం చేస్తాడు. దశరథుడి స్నేహితుడైన జటాయువు రావణాసుడితో తలపడి ప్రాణాలు కోల్పోతాడు. తుదిశ్వాస విడిచే ముందు తన దగ్గరకు వచ్చిన రాముడికి సీతను అపహరించింది లంకలో ఉండే రావణుడని చెప్పి కన్నుమూస్తాడు. దాంతో రావణాసుడిని హతమార్చుతానని రాముడు ప్రతిజ్ఞ చేయడంతో 'రామాయణం' తొలి భాగం పూర్తయ్యింది. సుగ్రీవ హనుమంతుల పరిచయం, సీతాన్వేషణ, రామరావణ సంగ్రామం, శ్రీరామ పట్టాభిషేకం వీటన్నింటినీ రెండో భాగంలో చూడాల్సి ఉంది.

అయితే ప్రథమ భాగం చూసిన తర్వాత అందరికీ కలిగే సందేహం ఒక్కటే. రాముడి గాథను కాకుండా నితీశ్‌ తివారి రావణ గాథగా ఈ కథను ఎందుకు చెప్పాడు అని!? రావణాసుడితో మొదలైన సినిమా, రాముడి ప్రతిజ్ఞతో ముగిసింది. అందరూ ఎదురుచూసిన రాముడి ఆగమనం సినిమా మొదలైన అరగంటకు కానీ జరగదు. అక్కడ కూడా బాలకాండకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకుండా... సీతారాముల వివాహఘట్టానికి, ఆపైన అరణ్యవాసానికి తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా రావణుడు, శూర్పణఖ కథకు ప్రాధాన్యం ఇచ్చాడు తప్ప... సీతారాముల అనుబంధానికి పెద్దంత చోటు దక్కనివ్వలేదు. దాంతో వెండితెరపై రామాయణాన్ని చూద్దామని వచ్చిన వారికి కాస్తంత నిరాశ ఎదురయ్యే ఆస్కారం ఉంది. యశ్‌ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి కావడం కూడా అతని పాత్రను ఎలివేట్ చేయడానికి కారణం కావచ్చు.


నటీనటుల విషయానికి వస్తే సీతారాములుగా రణబీర్‌ కపూర్, సాయిపల్లవి ఆ పాత్రల్లో ఒదిగిపోయే ప్రయత్నం చేశారు. రణబీర్‌ కపూర్‌ ఫర్వాలేదు కానీ సాయిపల్లవిని సీతాదేవిగా చూడటం ఇబ్బందికరమే. ఇక ఆమెతో కత్తిసాము చేయించి, ఝాన్సీ లక్ష్మీ బాయి తరహాలో ఓ యోధురాలిగా చూపించే వ్యర్ధ ప్రయత్నాన్ని నితీష్‌ చేశాడు. వనవాస సమయంలోనూ సీతాదేవిని ఓ యోధురాలిగానే చూపించాడు. యశ్ రావణాసుడిగా మెప్పించాడు. ఇంతవరకూ రాముడిగా ప్రేక్షకుల హృదయాలలో నిలిచిన అరుణ్ గోవిల్... ఇందులో దశరథుడిగానూ బాగా చేశారు. కైకేయి పాత్రను లారా దత్తా సమర్థవంతంగానే పోషించింది. లక్ష్మణుడిగా నటించిన రవి దుబే కాస్తంత సరళమైన సంభాషణలతో వినోదాన్ని పంచే ప్రయత్నం చేశాడు. కైకసిగా శోభన కీలకమైన పాత్రను పోషించారు. మంధరగా షీబా ఛద్దాకు ఉన్న స్క్రీన్ స్పేస్‌ తక్కువే అయినా ఆమె తన అభినయంతో ఆకట్టుకుంది. కాజల్‌ అగర్వాల్‌ మండోదరి పాత్ర ఎందుకు ఒప్పుకుందో తనకే తెలియాలి. మిగిలిన పాత్రలన్నీ అలా వచ్చి ఇలా వెళ్ళేవే. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే సినిమాకు అతి పెద్ద మైనస్ ఎ.ఆర్. రెహమాన్‌ మ్యూజిక్. నేపథ్య సంగీతం అక్కడక్కడా బాగున్నా ఒక్క పాట కూడా ఆకట్టుకునేలా లేదు. తెలుగు వెర్షన్ కు ఆకెళ్ళ శివప్రసాద్ రాసిన సంభాషణలు ఎస్సెట్. ఇక విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు ఆయువుపట్టు. ప్రథమార్ధంతో పోల్చితే ద్వితీయార్థంలో సినిమా నత్త నడకన సాగింది. వి.ఎఫ్.ఎక్స్.తో ప్రేక్షకులను మెస్మరైజ్‌ అయినా భావోద్వేగాలను పండించడంలో దర్శకనిర్మాతలు విఫలమయ్యారు. మరో భాగం రావాల్సి ఉంది కాబట్టి... కనీసం అందులో అయినా ఈ లోపాలను సరిదిద్దుకుంటారేమో చూడాలి. తెలుగువారిని ఈ సినిమా ఏ స్థాయిలో మెప్పిస్తుందన్నది పక్కన పెడితే ఉత్తరాది వారికి మాత్రం నచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా... సర్వజనులకు తెలిసిన రామాయణాన్ని ధైర్యంగా మరోసారి వెండితెరపై భారీ బడ్జెట్‌తో ఆవిష్కరించాలనే సాహసం చేసిన దర్శక నిర్మాతలను అభినందించి తీరాలి.

రేటింగ్‌: 2.5/5

ట్యాగ్‌ లైన్‌: విజువల్ వండర్‌ రావణాయణం!

ALSO READ
చిరంజీవి అమెరికా టూర్.. ‘కాకా’ ఫస్ట్ సాంగ్‌పై థమన్ అదిరిపోయే అప్‌డేట్!

Meenakshi Chaudhary: మీనాక్షికి మరో ఆఫర్... ఎవరితో అంటే..

DADA: క్రిస్మస్ రేస్ నుంచి.. బాలయ్య ఔట్?



Updated Date - Nov 05 , 2026 | 03:35 PM