ఇది చాలు సార్.. కన్నీళ్లు తెప్పిస్తోన్న నిరంజన్ తండ్రి మాటలు
ABN, Publish Date - Jul 09 , 2026 | 06:46 PM
కన్నబిడ్డను కోల్పోయిన కడుపుకోతను వర్ణించడానికి ఏ భాషలోనూ పదాలు సరిపోవు. ఆ బాధ వర్ణనాతీతం, శోకం అనంతం. కానీ, అంతటి మహా శోకంలోనూ ఆ తండ్రి కనబరిచిన స్థితప్రజ్ఞత, గుండె నిబ్బరం చూస్తుంటే.. కన్నీళ్లు రాక మానవు.
కన్నబిడ్డను కోల్పోయిన కడుపుకోతను వర్ణించడానికి ఏ భాషలోనూ పదాలు సరిపోవు. ఆ బాధ వర్ణనాతీతం, శోకం అనంతం. కానీ, అంతటి మహా శోకంలోనూ ఆ తండ్రి కనబరిచిన స్థితప్రజ్ఞత, గుండె నిబ్బరం చూస్తుంటే.. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన జీవిత పరమార్థం గుర్తొస్తోంది. జన్యపరమైన వ్యాధితో పోరాడుతూ, లోకాన్ని విడిచివెళ్లిన పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ (Pawan Kalyan Fan Niranjan) మరణం అందరినీ కలచివేసింది. చనిపోయే ముందు తన ఆరాధ్య దైవమైన పవన్ కళ్యాణ్‌ను చూడాలనే నిరంజన్ చివరి కోరికను పవన్ తీర్చిన సంగతి తెలిసిందే. ఆ కుర్రాడి మరణానంతరం అతని తండ్రి (Niranjan Father) మాట్లాడిన మాటలు, కన్నీళ్లు ఆపుకుంటూ ఆయన వ్యక్తపరిచిన భావోద్వేగాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని మెలిపెడుతున్నాయి.
‘‘వాడు అనుకున్న చివరి కోరిక నెరవేరింది.. ఆ దేవుడు వచ్చిండు.. ఆ దేవుడు వచ్చి ‘చాల్లేరా నీ కష్టం.. చాలు’ అని వాడిని తీసుకెళ్లిపోయాడు. వానికి ఇది చాలు సార్’’ అంటూ ఆ తండ్రి మాట్లాడిన మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌ను దేవుడిగా భావించిన ఆ తండ్రి, తన కొడుకు పడుతున్న నరకయాతనను చూసి తట్టుకోలేక, ఆ భగవంతుడే పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చి వాడి కష్టాలకు ముగింపు పలికాడని అన్నాడు. ‘‘పవన్ కళ్యాణ్ అనే ఆ దేవుడు కనబడేసరికి నా కొడుకు నిమ్మలమయ్యాడు.. చాల్లేరా నువ్వు ఇక ఈ కష్టాలు పడకు నాన్న అని దీవించి పంపించాడు నా దేవుడు’’ అంటూ కన్నీటి పర్యంతమవుతూనే, తన కొడుకు ఆఖరి క్షణాల్లో ప్రశాంతంగా కన్నుమూశాడనే తృప్తి ఆ తండ్రి మాటల్లో కనిపించింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు, అభిమానులు ఆ తండ్రి ధైర్యాన్ని చూసి భావోద్వేగానికి లోనవుతున్నారు. ఎంత బాధ ఉన్నా కూడా కొడుకు చివరి కోరిక తీరిందనే తృప్తితో, పవన్ కళ్యాణ్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్న ఆ తండ్రి గొప్పతనాన్ని కొనియాడుతున్నారు. భౌతికంగా నిరంజన్ ఈ లోకంలో లేకపోయినా.. అంతటి బాధలోనూ కొండంత ధైర్యాన్ని నింపుకున్న తన తండ్రి స్థితప్రజ్ఞతను చూసి ఆ బిడ్డ ఆత్మ ఏ లోకంలో ఉన్నా కచ్చితంగా సాంత్వన పొందుతుంది. కన్నీళ్లు తెప్పిస్తూనే.. జీవిత సారాంశాన్ని, ఒక తండ్రి ప్రేమలోని లోతును.. ఆయన మాటలు ఈ సమాజానికి సాక్ష్యంగా తెలియజేస్తున్నాయని చెప్పుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
బాలయ్య సినిమాలో రోల్‌పై కాజల్ షాకింగ్ కామెంట్స్!
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్ - ఒక బ్యాడ్ న్యూస్
బాలీవుడ్ కంటే టాలీవుడ్ చాలా బెటర్: సోనాలి బింద్రే