అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్ - ఒక బ్యాడ్ న్యూస్
ABN , Publish Date - Jul 09 , 2026 | 05:03 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ది రూల్’సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ‘రాకా’ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో వారికో గుడ్ న్యూస్, మరో బ్యాడ్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) నటించిన ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa 2: The Rule) సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ‘రాకా’ (Raaka) కోసం ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. అలా వేచి చూసే వారందరికీ ఓ బ్యాడ్ న్యూస్. అదే టైమ్‌లో ఒక గుడ్ న్యూస్ కూడా వారి కోసం ఎక్స్‌క్లూజివ్‌గా. మరి ఆ బ్యాడ్, గుడ్ న్యూస్‌లు ఏంటనే వివరాల్లోకి వెళితే..
వీఎఫ్ఎక్స్... కారణమా!?
అల్లు అర్జున్- అట్లీ (Atlee) కాంబోలో తెరకెక్కుతోన్న ‘రాకా’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మరో చిత్రం రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. ‘రాకా’ చిత్రాన్ని నిర్మిస్తోన్న సన్ పిక్చర్స్ సంస్థ 2027 డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసింది. అయితే వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా ఈ సినిమా మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోందని ఇన్ సైడ్ టాక్. వాస్తవానికి ‘రాకా’కు సంబంధించిన అల్లు అర్జున్ వర్క్ వచ్చే సంవత్సరం మార్చికే పూర్తవుతుందని తెలుస్తోంది. అందుకే, లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) సినిమాను ఆయన అంగీకరించారు. ఒకవేళ బన్నీ వర్క్ పూర్తయినా, వీఎఫ్ఎక్స్ పని పూర్తి కావడానికి చాలా సమయం తీసుకుంటుందని తెలుస్తోంది. అందువల్ల ‘రాకా’ కంటే ముందే లోకేశ్ కనగరాజ్ సినిమా వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదనేది తాజా సమాచారం. అదే నిజమైతే మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఇది గుడ్ న్యూసే అవుతుంది.
2028 లోనేనా...!?
కేవలం వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం ఏళ్ళ తరబడి సమయం కావాలా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ‘రాకా’ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ అట్లీ. అందువల్లే ఈ చిత్రం కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్‌ను ఎంచుకున్నారు. ఎక్కడా వీఎఫ్ఎక్స్ వర్క్ అని తెలియకుండా అతి సహజంగా ఉండేలా ‘రాకా’ సీన్స్ ను రూపొందిస్తున్నారట. ముందుగా వేసుకున్న అంచనా ప్రకారం 2027 మార్చి నెలకు షూటింగ్ పార్ట్ పూర్తవ్వాలి. ఆ తర్వాత నుంచీ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మొదలవుతుంది. ఇప్పటికే సమాంతరంగా కొంత వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోందని సమాచారం. అయినప్పటికీ ‘రాకా’ను 2027 డిసెంబర్‌కు రిలీజ్ చేయడం కష్టతరమే అని ఇన్ సైడ్ టాక్. అందుకే 2028లోనే ‘రాకా’ రానుందని తెలుస్తోంది. నిజంగా ఇది ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూసే అని చెప్పుకోవచ్చు.
ముందు అదేనా...!?
‘రాకా’ షూటింగ్ నుంచి అల్లు అర్జున్ బయటకు రాగానే లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే భారీ చిత్రంలో నటిస్తారు. ఈ మూవీలో పాలిటిక్స్ ప్రధానాంశంగా ఉంటుందని తెలుస్తోంది. అందువల్ల ఇందులో వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండదు. ఈ మూవీని ఈ యేడాదే పట్టాలెక్కిస్తే.. బన్నీ జాయిన్ అయ్యాక చకచకా షూటింగ్ పూర్తి చేసేలా లోకేష్ పక్కా ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే ‘రాకా’ కంటే ముందుగా బన్నీ-లోకేశ్ కాంబో మూవీ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నారని అంటున్నారు. 2027లో బన్నీ-లోకేశ్ కనగరాజ్ మూవీ ముందుగా వస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ మాటలు ఎలా ఉన్నా, బన్నీ ఏ సినిమాతో ముందుగా వస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. చూద్దాం- ఏమవుతుందో?
ఇవి కూడా చదవండి:
బాలీవుడ్ కంటే టాలీవుడ్ చాలా బెటర్: సోనాలి బింద్రే
Rajesh Sharma: ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌లో తీవ్ర విషాదం.. విష పురుగు కాటుతో ఐసీయూలో నటుడు
ఆ దర్శకుడితో రెండో పెళ్లి.. షాకిచ్చిన కలర్స్ స్వాతి