ఎన్‌టిఆర్ జయంతి.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్
ABN, Publish Date - May 29 , 2026 | 12:35 AM
మనిషి దేవుడిగా మారడం అంటే ఏంటో తన జీవితంతో ప్రపంచానికి చూపించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని అన్నారు రాకింగ్ మంచు మనోజ్. ఎక్స్ వేదికగా ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
మనిషి దేవుడిగా మారడం అంటే ఏంటో తన జీవితంతో ప్రపంచానికి చూపించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని అన్నారు రాకింగ్ మంచు మనోజ్ (RawKing Manchu Manoj). నందమూరి తారక రామారావు 103వ జయంతి (NTR 103rd Birth Anniversary) సందర్భంగా అమీర్‌పేట్ మైత్రివనం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంచు మనోజ్ పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం ఎక్స్ వేదికగా మంచు మనోజ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో..
‘‘మనిషి దేవుడిగా మారడం అంటే ఏంటో తన జీవితంతో ప్రపంచానికి చూపించారు నటవిఖ్యాత, నటసార్వభౌమ, నందమూరి తారక రామారావు. తెరపై శ్రీరాముడిగా కనిపిస్తే ప్రజలు చేతులు జోడించారు. శ్రీకృష్ణుడిగా పలికితే భక్తితో పరవశించారు. నాయకుడిగా ముందుకు నడిస్తే తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతిరూపంగా నిలిచారు. ఆయన ఒక వ్యక్తి కాదు.. ఒక శకం. తెలుగు గర్వానికి ప్రతీక. ప్రజల విశ్వాసానికి ప్రతిబింబం. కోట్ల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహాశిఖరం. నటన, నాయకత్వం, క్రమశిక్షణ, ప్రజలపై ప్రేమ.. ఏ రంగాన్ని తాకినా తనదైన ముద్ర వేసిన అసామాన్య వ్యక్తిత్వం ఆయనది. 24 క్రాఫ్ట్స్‌లో ఆయన చేయనిది లేదనిపించే మహోన్నత ప్రస్థానం.
నటుడిగా అలరించారు.. నాయకుడిగా నడిపించారు.. మహానాయకుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం, ఆయన సాన్నిధ్యాన్ని దగ్గరగా అనుభవించడం నా జీవితంలో ఎన్నటికీ మరువలేని గౌరవం. ఆయనలో చేయలేని పాత్ర లేదు, చేరలేని శిఖరం లేదు అనిపించేది. NTR జయంతి సందర్భంగా నిర్వహించిన విగ్రహావిష్కరణ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో భావోద్వేగాన్నిచ్చింది. తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా వెలిగే మహానుభావుడికి ఇలాంటి ఘన నివాళులు అర్పించడం నిజంగా గర్వకారణం.
ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు ఉన్నంత వరకు ఎన్టీఆర్.. చిరంజీవిగానే ఉంటారు. తెలుగు జాతి ఆత్మగౌరవం నిలిచినంత వరకు ఆయన మహోన్నత కీర్తి యుగయుగాల పాటు వెలుగుతూనే ఉంటుంది. ఆ మహానుభావునికి శతకోటి వందనాలు’’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
ఆడియో జ్యూక్ బాక్స్ విడుదల.. ‘పెద్ది’ టీమ్ తప్పు చేసిందా?
యూపీలో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?
‘అమ్మ’కు ఏమైంది? మరో సీనియర్ నటి సంచలన ఆరోపణలు!