Manchu Manoj: ఇక్కడ అంతా దేకాల్సిందే.. మంచు మనోజ్ కామెంట్స్ వైరల్
ABN , Publish Date - Jul 09 , 2025 | 11:54 AM
తాజాగా నెపోటిజంపై హీరో మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చకు దారి తీస్తున్నాయి.
టాలీవుడ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా నెపోటిజం మీద చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సినీ కుటుంబాలకు, వారి అండదండలు ఉన్న వారికే అవకాశాలు సులభంగా లభిస్తాయని చాలామంది తరుచూ అభిప్రాయ పడుతుంటారు. కాగా తాజాగా హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈ చర్చకు దారి తీశాయి. సుహాస్ (Suhas), మాళవికా మనోజ్ (Malavika Manoj) జంటగా రూపొందిన ఓ భామ అయ్యో రామ (Oh Bhama Ayyo Rama) చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య తిథిగా హాజరైన మంచు మనోజ్, సినిమాల్లో సక్సెస్ అనేది కేవలం ఫ్యామిలీ నేపథ్యం ఉంటేనే రావని, ఎంత ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా అది గ్యారెంటీ కాదని కుండ బద్దలు కొట్టారు.
ఉదాహారణకు.. నన్నే చూడండి.. ఇండస్ట్రీలో చాలాకాలంగా ఉన్నా, విజయాలు చాలా కష్టం. ప్రతి ఒక్కరికి కష్టం తప్పదు. ఒక్కో మెట్టు ఎక్కాలంటే ప్రయాస తప్పదని పేర్కొన్నారు. ఓ నెప్టో కిడ్‌గా చెబుతున్నా.. తన తండ్రి మోహన్ బాబు వంటి స్టార్ ఉన్నా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం ఎంత కష్టం అయిందో వెల్లడించారు. ఏదీ సింపుల్‌గా రాదని, ఇజీగా వచ్చింది.. ఇజీగానే పోతుందని అన్నారు.
అలాగే సుహాస్ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ.. సుహాస్ లాంటి వారు ఈ తరం యూత్‌కి స్ఫూర్తి అని ఇంత పైకి వచ్చినా 'నేనొక్కడినే వచ్చాను', 'నేనింత కష్టపడ్డాను' అనలేదని అన్నారు. విజయ్ సేతుపతి తరహాలోనే, సుహాస్ కూడా వేభిన్న పాత్రల్లో నటిస్తూ హీరోగా మరియు ఆర్టిస్ట్‌గా తన స్థానం ఏర్పరుచు కుంటున్నాడని మంచు మనోజ్ (Manchu Manoj) కొనియాడారు. అతని దగ్గరనుండి చాలామంది నేర్చుకోవాలి అని అన్నారు. అయితే.. మంచు మనోజ్ చేసిన వ్యాక్యలకు అన్ని వైపుల నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. తను ఉన్న పరిశ్రమపై ఇంత నిర్భయంగా తన భావం వ్యక్త పరచడం మనోజ్‌కే చెల్లిందంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
ఇక సుహాస్ విషయానికి వస్తే.. ఇటీవల వరుసబెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ, థియేట్రికల్ గా ఇంకా పెద్ద విజయాన్ని అందుకోలేదు. చివరగా వచ్చిన జనక అయితేగనక, గొర్రె పురాణం ఫర్వాలేదనిపించాయి. ఇటీవలే ఆయన నటించిన ఉప్పు కప్పురంబు ఓటీటీలో విడుదలై మంచి రెప్సాన్స్ దక్కించుకుంది. ఇక జూలై 11న విడుదల కానున్న ‘ఓ భామ అయ్యో రామ’ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇదిలాఉంటే నాన్ థియేట్రికల్‌గా సుహాస్ చిత్రాలకు డిమాండ్ మాత్రం అధికంగా ఉంది. థియేటర్‌లో ఓ మంచి కమర్షియల్ హిట్ పడితే మాత్రం ఒక్కసారిగా సుహాస్ స్థాయి మారే అవకాశం ఉంది.