దాసరి లేని లోటు నాకు బాగా తెలుస్తోంది - మంచు మనోజ్
ABN , Publish Date - May 31 , 2026 | 04:21 PM
దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా శనివారం తన భార్యతో కలిసి మంచు మనోజ్ దాసరి ఘాట్‌ను సందర్శించారు. అనంతరం మీడియాకు దాసరిపై తనకున్న ప్రేమను తెలియజేశారు.
‘తండ్రి సమానులైన దాసరిని, పద్మ ఆంటీని బాగా మిస్ అవుతున్నాము. వాళ్లు లేని లోటు మాకు.. ముఖ్యంగా నాకు బాగా తెలుస్తోంది’ అని అన్నారు రాకింగ్ మనోజ్ మంచు (RawKing Manchu Manoj). దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) వర్ధంతి సందర్భంగా శనివారం ఆయన.. తన భార్యతో కలిసి దాసరి ఘాట్‌ను సందర్శించారు. దాసరి విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనిక మంచు (Mounika Bhuma Manchu) మీడియాతో మాట్లాడారు.
‘‘నిజంగా గురువుగారు దాసరి నారాయణరావు వర్ధంతి అనే విషయం నాకు గుర్తు లేదు. నాలుగు రోజుల క్రితం చిత్రపురి కాలనీ వైపు వెళుతుంటే.., గురువుగారి విగ్రహం చూసి ఫ్యామిలీని గుర్తు చేసుకున్నాను. వెంటనే అరుణ్ అన్నకు ఫోన్ చేసి.. వారితో మాట్లాడాను. ఎందుకనో గురువుగారు గుర్తుకు వస్తున్నారని కూడా చెప్పాను. ఈలోగా వేరే పనిలో పడి విషయం మరచిపోయాను. అది జరిగి నాలుగు రోజులు కూడా కాలేదు.. నిన్న సాయంత్రం ఘాట్‌కు సంబంధించిన వీడియో చూడగానే చాలా బాధేసింది. వెంటనే నా టీమ్‌కు చెప్పాను. నేను ఆలస్యంగా చెప్పినా కూడా.. కార్మిక సిబ్బంది వెంటనే రియాక్ట్ అయ్యారు. యాదగిరి అన్నకు ఫోన్ చేస్తే.. తెల్లవారు జామునే స్పందించారు. అలాగే ఎమ్మెల్యేగారు కూడా వెంటనే స్పందించారు. నేను కాల్ చేసిన 20 నిమిషాల్లోనే స్పందించి జెసీబీని ఏర్పాటు చేశారు. మొత్తం 20 నుంచి 25 మంది పని చేశాం. నేను చెప్పగానే ఇక్కడకు వచ్చి అంతా క్లీన్ చేసిన వారందరికీ, అలాగే వారికి వసతులను ఏర్పాటు చేసిన అందరికీ థాంక్స్.
ఇక గురువుగారి గురించి చెప్పాలంటే ఆయన గొప్ప డైరెక్టర్, యాక్టర్, స్క్రీన్‌ప్లే రైటర్, డైలాగ్స్, ఎడిటింగ్.. ఇలా 24 శాఖలపై ఆయన రాణించారు. నాకు తండ్రి సమానులు. మా గురువుగారు, ఆయన సతీమణి పద్మ అంటీని ఎప్పుడూ మిస్ అవుతుంటాను. వాళ్లు లేని లోటు మాకు.. ముఖ్యంగా నాకు బాగా తెలుస్తోంది. ఆయనతో కలిసి నటించే భాగ్యం నాకు దక్కింది. నాకు కూడా సినీ క్రాఫ్ట్ మీద ఇంత పిచ్చి, ఆసక్తి, ప్రాణం ఉందంటే.. అందుకు మా నాన్నతో పాటు గురువుగారు కూడా కారణం. ఆయనొక ఇన్‌స్టిట్యూట్.
ఈరోజు మనం థియేటర్స్ సమస్యలంటూ ఇబ్బంది పడుతున్నాం. కానీ నాకు తెలిసి గురువుగారు ఎప్పుడో దీనికి సంబంధించి మార్గం చూపించారు. ఏడాదికి పది నుంచి పదిహేను సినిమాలు చేస్తూ.. ఎంతో మందికి ఉపాధి లభించేలా చేశారు. ఎప్పుడో ఓ సినిమా చేయటం కాదు.. ఎప్పుడూ సినిమా చేయాలని దారి చూపించారు. ఇకపై అందరం వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని హీరోలందరినీ కోరుతున్నాను. ఆ బాధ్యత అందరిపై ఉంది. నా చేతుల మీదుగా ఇలా జరగటం ఆయన ఆశీస్సులుగా భావిస్తున్నాను. దాసరి ఘాట్‌ను పార్క్‌లా కాకుండా చుట్టు పక్కల పిల్లలు ఆడుకునేలా ఏదైనా యాక్టివేషన్ చేస్తే బావుంటుందనేది నా కోరిక. అది జరగాలని కోరుకుంటున్నారు. గురువుగారు, పద్మ ఆంటీ ఆత్మలు ఎక్కడున్నా శాంతించాలని కోరుకుంటున్నాను’’ అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.
భూమా మౌనిక మంచు మాట్లాడుతూ.. ఈరోజు పెద్దలు దాసరి నారాయణరావు వర్దంతికి ఇక్కడకు వచ్చాం. పెద్దాయన ఆత్మ ఎక్కడున్నా శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాసరి అంటే సినీ ఇండస్ట్రీకి, పబ్లిక్ సర్వీస్‌కు బాగా తెలిసిన వ్యక్తి. వారు తీసిన ఎన్నో సినిమాల ద్వారా.. ఎన్నో సోషల్ మెసేజ్‌లు ఇచ్చారు. ఆయన వర్ధంతికి ఇక్కడకు రావటం మా బాధ్యత. మనోజ్‌ను పిలిపించుకుని పెద్దాయన ఈ పని చేయించుకున్నారనిపిస్తోంది. మనోజ్ ప్రతీ సందర్భంలో ఆయనని గుర్తు చేసుకుంటూ ఉంటారని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
రకుల్‌ని మోసం చేసిన అక్షయ్ కుమార్.. వీడియో చూశారా!
చీరకట్టులో ‘బిగ్‌బాస్’ బ్యూటీ శోభా శెట్టి.. సోషల్ మీడియా షేక్!
అరుదైన పిక్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కండక్టర్’ ఐడీ కార్డ్!