Dasari Narayana Rao : దాసరి వ్యక్తి కాదు వ్యవస్థ

ABN , Publish Date - May 04 , 2024 | 06:04 AM

సినిమా అనేది ఒక కళ. ఈ రంగంలో రాణించాలంటే ముందుగా అవకాశాలు రావాలి. కానీ అతి సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారికి అవకాశాలు దొరకడం చాలా కష్టం. అయినా మనిషికి సంకల్పం ఉంటే...

Dasari Narayana Rao : దాసరి వ్యక్తి కాదు వ్యవస్థ

  • నేడు దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి

  • డైరెక్టర్స్‌ డేగా పాటిస్తున్న తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం

సినిమా అనేది ఒక కళ. ఈ రంగంలో రాణించాలంటే ముందుగా అవకాశాలు రావాలి. కానీ అతి సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారికి అవకాశాలు దొరకడం చాలా కష్టం. అయినా మనిషికి సంకల్పం ఉంటే అదేమీ అసాధ్యం కాదని తెలుగు సినీ రంగంలో అనేకమంది నిరూపించారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు, దర్శక దిగ్గజం, దర్శకరత్న డాక్టర్‌ దాసరి నారాయణరావు. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, పత్రికాధిపతిగా ఇలా అన్నింట్లోనూ తనదైన ముద్ర వేశారు.

జీవితంలో ఫలానా స్థాయిలో ఉండాలనీ, లేదంటే ఒక గోల్‌ పెట్టుకొని దాన్ని సాధించాలని గానీ దాసరి నారాయణరావు ఎప్పుడూ అనుకోలేదు. పదో ఏటనే ఆయనకు నాటకరంగపై ఆసక్తి ఏర్పడింది. రంగస్థలంలో ఉద్యోగం చేయడానికి 60వ దశకంలోనే హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఆయన రవీంద్రభారతి, గాంధీభవన్‌లో నాటకాలు వే స్తుండేవారు. అక్కడ దాసరిని చూసిన వైవీ కృష్ణయ్య అనే దర్శకుడు తన సినిమాలో కమెడియన్‌ వేషం ఆఫర్‌ చేయగా, దానికి దాసరి ఇష్టపడలేదట. ‘నేను స్టేజ్‌ డైరెక్టర్‌ను, రైటర్‌ను, గోల్డ్‌మెడలిస్టును ఈ పాత్ర ఎందుకు చేయాలి’ అనుకున్నారట. కానీ ఆయన స్నేహితులు మాత్రం ఇది చాలా మంచి అవకాశం అన్నారట. చివరికి మద్రాసు, వాహినీ స్టూడియోలో అడుగుపెట్టిన తొలిరోజునే మేకప్‌ వేసుకుని షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇలా సినిమా రంగంలో ఎవరికీ జరగలేదని, తనకు మాత్రమే ఆ అవకాశం వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.


కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా వాళ్ల తండ్రి పిల్లలను బాగా చదివించారట. స్కూల్‌ అయిపోయిన తర్వాత తన ఖర్చుల కోసం అరటిపళ్లు అమ్మానని ఆయన చెప్పారు. అలా పేదరికం, ఆకలి తెలిసిన దాసరి తర్వాత సినిమా రంగంలో పనిచేసే కార్మికులు, చిన్న నటీనటుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. భారీ బడ్జెట్‌ సినిమాలు అవసరమే కానీ అదే సమయంలో చిన్న సినిమాలు బతికితే వాటి ద్వారా ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుందని చాలా సందర్భాల్లో చెప్పారు.

తెలుగు సినిమా అంటే రాంగోపాల్‌ వర్మకు ముందు తర్వాత అంటారు. అలాంటిది ఒక సందర్భంలో దాసరి, ఆయన దర్శకత్వం వహించిన ‘శివరంజని’ సినిమా లు దర్శకుడిగా తనను ఎంతగానో ప్రభావితం చేశాయని రామ్‌గోపాల్‌ వర్మ స్వయంగా చెప్పారు. ఆ సినిమాలో మోహన్‌బాబు, జయసుధ పాత్రలను మలిచిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. దాసరి గారి క్యారెక్టరైజేషన్స్‌ బాగా స్టడీ చేయడం వల్లే రియలిస్టిక్‌ పాత్రలను సృష్టించగలిగాను అని వర్మ చెప్పారు. అందుకే దాసరి అంటే వ్యక్తి కాదు వ్యవస్థ, సినిమా పాఠశాల.

చాలామంది సినీ నటులను దాసరి తయారుచేశారు. చాలామంది టెక్నీషీయన్స్‌ ఆయన స్కూల్‌నుంచి వచ్చారు. అందుకే హీరో, హీరోయిన్ల వల్లే సినిమా ఆడుతుందంటే ఆయన అంగీకరించలేదు. దర్శకులు, ప్రొడక్ట్‌, ప్రొడ్యూసర్‌, ఆ సినిమాకు పనిచేసిన మొత్తం టీం వల్లే సినిమా విజయవంతం అవుతుందని అని అనేక సందర్భాల్లో కుండబద్దలు కొట్టారు. సినిమాలకు ఇచ్చే రాయితీలు లాంటివి చిన్న నిర్మాతలకు, చిన్న సినిమాకు ఎప్పటికీ అందుబాటులో ఉండాలనేవారు. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో చిన్న సినిమాలను ప్రోత్సహించడానికి రాయితీలు ఇస్తున్నారనీ, అలాంటి ప్రోత్సాహకాలు మన దగ్గర కూడా కావాలన్నారు. సినిమాకు కెప్టెన్‌ దర్శకుడే. సినిమాలోని పాత్రలు, సన్ని వేశాలు, పాటల చిత్రీకరణ, కామెడీ ఇలా అన్నీ దర్శకుడి విజన్‌ నుంచే పుట్టుకొస్తాయి. దర్శకుడికి ఉండే అభిరుచితోనే మంచి సాహిత్యం, సంగీతంతో పాటు విజువల్‌గానూ సినిమా బాగున్నదనే ప్రశంసలు వస్తాయి. దాని వెనుక దర్శకుడి కృషి ఎంతో ఉంటుంది. దర్శకుడు ఒక ప్రేక్షకుడిగా మారి, తన హీరో ఎలా ఉండాలి, తన సినిమాలో పాత్రలు ఎలా ఉంటే అవి ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతాయి అన్న అంశాలపై చాలా ఆలోచించి రాసుకొని, వాటిని చిత్రీకరిస్తాడు. అందుకే దర్శకత్వం అనేది చాలా బాధ్యతతో కూడుకున్న పని.


మనం ఇవాళ గొప్పగా చెప్పుకుంటున్న మలయాళ సినిమాల కంటే దశాబ్దాల ముందే దాసరి మధ్య తరగతి సినిమాను తీసుకొచ్చి తన మార్క్‌ను చూపెట్టారు. కమర్షియల్‌ సినిమాతో పాటు దాసరి నారాయణరావు అందించిన స్ఫూర్తితో చిన్న సినిమాలతో జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు మంచి కథలు రాసి, సినిమాలు చేయాలి. అదే దాసరి గారికి మనం ఇచ్చే నిజమైన నివాళి.

44 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమలో కొనసాగి ఎంతోమందికి సినీ జీవితాన్ని ప్రసాదించడంతో పాటు పరిశ్రమకు పెద్దదిక్కుగా కొనసాగిన దాసరి నారాయణరావు జయంతి (మే - 04)ని డైరెక్టర్స్‌డేగా తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం నిర్ణయించి, సెలబ్రేట్‌ చేస్తోంది.

కుమారస్వామి (అక్షర),

సెన్సార్‌ బోర్డ్‌ సభ్యులు

Updated Date - May 04 , 2024 | 06:04 AM