వరుస సూపర్ హిట్స్.. అయినా ఈ భామకు తెలుగులో నో ఛాన్స్
ABN, Publish Date - Sep 26 , 2026 | 09:10 PM
సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఏమాత్రం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి, కేవలం తన సహజమైన నటనతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించుకున్న నటి మమితా బైజు.
సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఏమాత్రం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి, కేవలం తన సహజమైన నటనతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించుకున్న నటి మమితా బైజు (Mamitha Baiju). 2024లో వచ్చిన మలయాళ రొమాంటిక్ కామెడీ బ్లాక్‌బస్టర్ ‘ప్రేమలు’ (Premalu) ఆమె కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పేసింది. కేవలం మలయాళంలోనే కాకుండా, తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా ఘన విజయం సాధించి, మమితాకి గుర్తింపు తెచ్చిపెట్టింది. రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడు సైతం ఈ అమ్మడి యాక్టింగ్, క్యూట్‌నెస్‌కి ఫిదా అయిపోయారంటే ఆమె మ్యాజిక్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. చిన్న వయసులోనే నటనపై ఉన్న ఆసక్తితో కెరీర్ ప్రారంభించిన మమితా, ప్రతి పాత్రలోనూ తనదైన ముద్ర వేసింది. కేవలం అందం మాత్రమే కాకుండా, ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో ఒదిగిపోయే నైపుణ్యం మమితా ప్రత్యేకత. ‘ప్రేమలు’లో ఆమె చూపించిన అల్లరి, ఆన్-స్క్రీన్ ప్రెజెన్స్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి.
ఈ ఏడాది వరుసగా నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మమితా, అందులో రెండు భారీ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons), అలాగే మలయాళంలో చేసిన ‘బెత్లహాం కుటుంబ యూనిట్’ (Bethlehem Kudumba Unit) బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ రెండు సినిమాలు కూడా ‘ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీస్’ కావడం విశేషం. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో హీరో సూర్యకు, మమితాకు మధ్య దాదాపు 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంటే, ‘బెత్లహాం కుటుంబ యూనిట్’లో హీరో హీరోయిన్ల పాత్రల మధ్య 12 ఏళ్ల గ్యాప్ ఉంటుంది. ఇలాంటి విభిన్నమైన కాన్సెప్ట్‌లలో కూడా ఆమె లీడ్ రోల్‌ని చాలా చక్కగా పోషించి మెప్పించింది. ప్రస్తుతం సంగీత్ ప్రతాప్‌తో ‘హలో డియర్’, తమిళంలో ఆరుగురు దర్శకులు తెరకెక్కిస్తున్న ఓ చిత్రంతో పాటు ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా రూపొందుతున్న ఓ సినిమాలో మమితా నటిస్తోంది.
ఇక అసలు విషయానికి వస్తే.. చేతిలో సినిమాలు ఉన్నప్పటికీ, మమితా మెయిన్ టార్గెట్ మాత్రం తెలుగు ఇండస్ట్రీయే అన్నట్లు తెలుస్తోంది. ‘ప్రేమలు’ డబ్బింగ్ వర్షన్‌తో టాలీవుడ్ ఆడియన్స్‌కి బాగా రీచ్ అయినప్పటికీ, ఇప్పటివరకు ఆమె చేతిలో నేరుగా చేసే ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. వరుస హిట్లు కొడుతున్న ఈ టాప్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్‌ని తెలుగు మేకర్స్ ఎందుకు పట్టించుకోవడం లేదనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చగా మారింది. పెద్ద స్టార్ హీరోల పక్కన మమితా సెట్ అవుతుందా లేదా? అనే చిన్న డౌట్ మన టాలీవుడ్ దర్శకుల్లో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు మలయాళంలో సినిమాలు చేస్తే వచ్చే రెమ్యునరేషన్ కోటి రూపాయల లోపే ఉంటుందనే టాక్ ఉంది. కానీ, టాలీవుడ్‌లో గనుక అవకాశం వస్తే ఏకంగా రెండు కోట్లకు పైగా డిమాండ్ చేయాలనే ప్లాన్‌లో ఈ భామ ఉందట. అయితే ఆఫర్ వస్తేనే కదా తన డిమాండ్ చూపేది. భవిష్యత్తులో మన తెలుగు దర్శకులు ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ రాసుకున్నా లేదా ఒక ఫ్రెష్ రోల్ అనుకున్నా మొదటి ఆప్షన్ మమితా బైజునే కావచ్చు. మరి ఈ నేచురల్ బ్యూటీకి టాలీవుడ్ బిగ్ ఆఫర్ ఎప్పుడు దక్కుతుందో వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
‘ద ప్యారడైజ్’.. ఇలాంటి రెస్పాన్స్ నేనెక్కడా చూడలేదు: నాని
నా లైఫ్‌లో బేర్ బాడీతో చేసినవి మూడే సినిమాలు.. శ్రీకాంత్ చంపేశాడు: మోహన్ బాబు
మాట్లాడాలని ఉన్నా.. గిరి గీసుకోవాల్సి వస్తోంది: మోహన్ బాబు