‘ద ప్యారడైజ్’.. ఇలాంటి రెస్పాన్స్ నేనెక్కడా చూడలేదు: నాని

ABN , Publish Date - Sep 26 , 2026 | 08:41 PM

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కలయికలో రూపొందిన క్రేజీ మాసివ్ చిత్రం ‘ద ప్యారడైజ్’. తాజాగా ఈ మూవీ టీమ్ ‘మీడియా ములాఖత్’ పేరిట ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Natural Star Nani

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కలయికలో రూపొందిన క్రేజీ మాసివ్ చిత్రం ‘ద ప్యారడైజ్’ (The Paradise). చిత్రం విడుదలైన అనంతరం టీమ్ ఏర్పాటు చేసిన ‘మీడియా ములాఖత్’ వేదికపై హీరో నాని సుదీర్ఘంగా, మనసు విప్పి మాట్లాడారు. సినిమా మేకింగ్, రిలీజ్ నాటి సవాళ్లు, ఆడియన్స్ రెస్పాన్స్, టెక్నీషియన్ల శ్రమ, మోహన్ బాబుతో అనుబంధం, కీర్తి సురేష్, సత్యరాజ్ పాత్రల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ..

‘ద ప్యారడైజ్’కి విచిత్రంగా రివర్స్ జరిగింది

‘‘ఈ సినిమా విషయంలో మొదటి నుంచీ అన్నీ కొత్తగానే జరిగాయి. ఫిలిం మేకింగ్ ప్రాసెస్, లొకేషన్లలో ఎదురైన పరిస్థితులు, ట్రైలర్ రిలీజ్ చేయకపోవడం, విడుదల వేళ ఏర్పడిన వాతావరణం.. అన్నీ కొత్తే. ఒక కొత్త సినిమా తీస్తున్నాం, కొత్త అనుభూతిని ఇస్తున్నాం అనుకున్నాం కానీ రెస్పాన్స్ కూడా ఇంత కొత్తగా ఉంటుందని అనుకోలేదు. నా సినీ కెరీర్‌లోనే ఇదొక సరికొత్త ఎక్స్‌పీరియన్స్. సాధారణంగా ఈ మధ్యకాలంలో సినిమాలు రిలీజ్ అయిన ఉదయం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి, సాయంత్రానికి మిక్స్‌డ్ టాక్‌గా మారిపోతుండటం చూస్తున్నాం. కానీ ‘ద ప్యారడైజ్’కి విచిత్రంగా పూర్తిగా రివర్స్‌లో జరిగింది. ప్రీమియర్స్ నైట్ ఒకలా మొదలైంది.. ఆ తర్వాత ప్రతి షోకి, షో షోకీ పాజిటివిటీ పెరుగుతూ సినిమా ఇంకా బెటర్‌గా ఎదుగుతోంది. ఇటీవలి కాలంలో ఇలాంటి రెస్పాన్స్ నేను ఎక్కడా చూడలేదు.


తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉంటా!

మేము చాలా హంబుల్ టీమ్. ఏదో గర్వంతో ఉన్న టీమ్ కాదు.. ప్రతి రోజూ కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటాం. మొదట్లో వచ్చిన రకరకాల రియాక్షన్స్‌ను ఎలాగైతే స్వీకరించామో, ఇప్పుడు ప్రేక్షకులు ఇంతలా ఓన్ చేసుకుని చూపిస్తున్న ప్రేమాదరణలను కూడా యాక్సెప్ట్ చేయాల్సిన సమయం వచ్చింది. సోషల్ మీడియాలో చిన్న చిన్న సీన్లను, మూమెంట్స్‌ను రీల్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెలుగు ప్రేక్షకులు ఎలాంటి ఫిల్టర్ లేకుండా తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెబుతారు. అలాంటి నిజాయితీ గల ప్రేక్షకులు ఉన్నంతవరకు తెలుగు సినిమా ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది.

ఇది హీరో సినిమా కాదు.. ప్రతి ఒక్కరూ రియల్ హీరోలే!

సాధారణంగా సినిమాల్లో హీరోలే ఎక్కువ రోజులు షూటింగ్ చేస్తారు, ఎక్కువ కష్టపడతారు. మిగతా వారు వచ్చి వెళ్లిపోతుంటారు. కానీ ‘ద ప్యారడైజ్’ హీరో సినిమా కాదు. ఇందులో హీరో ఒక్కడే ఎక్కువ కష్టపడ్డాడని ఎవరూ చెప్పలేరు. చిన్న చిన్న పాత్రలు వేసిన వాళ్లతో సహా అందరూ ఎంత ప్రాణం పెట్టి పనిచేశారో నేను కళ్లారా చూశాను. షాట్ అవ్వగానే నాకు గొడుగు కిందకో, కారవాన్‌కో వెళ్లే అవకాశం ఉండేది. కానీ ఎలాంటి అసిస్టెంట్లు, కంఫర్ట్స్ లేకుండా రోజులు తరబడి ఆ వర్షంలో, నెత్తుటి మరకల్లో తడుస్తూ నిద్ర లేకుండా పనిచేసిన ప్రతి నటుడు, టెక్నీషియన్, అసిస్టెంట్ డైరెక్టరే ఈ సినిమాకి రియల్ హీరోస్. తేజ, వినయ్, యశ్వంత్ సహా శ్రీకాంత్ డైరెక్షన్ టీమ్, రైటర్స్ ప్రాణం పెట్టి పనిచేశారు. సుకుమార్ స్కూల్ నుంచి శ్రీకాంత్, బుచ్చిబాబు ఎలా వచ్చారో.. శ్రీకాంత్ స్కూల్ నుంచి కూడా రేపు పెద్ద దర్శకులు రావాలి.


అనిరుధ్ మ్యూజిక్ వల్లే జనం థియేటర్లకు పోటెత్తారు!

అనిరుధ్‌తో ఇది నాకు మూడో సినిమా. ఆయా షేర్, యేసు నాగులు, సమ్మక్క.. పాటలు థియేటర్లలో మోత మోగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు దండోపదండాలుగా థియేటర్లకు తరలివచ్చారంటే దానికి ప్రధాన కారణం అనిరుధ్ ఇచ్చిన అద్భుతమైన మ్యూజిక్కే. కెమెరామెన్ సాయి సినిమా కోసం ఎంతగానో శ్రమించాడు. ఎండ, హార్ష్ లైటింగ్ ఉండకూడదని ఆకాశానికి నాలుగు క్రేన్లతో గొడుగులు పట్టి లొకేషన్లలో షాడో క్రియేట్ చేస్తూ షూట్ చేశాడు. అవినాష్ వేసిన డిటెయిలింగ్ సెట్స్, ఎడిటర్ నవీన్ పడిన కష్టం వెలకట్టలేనివి.

సంపూ చాలా మంచోడు.. సవారి గ్యాంగ్ అదరగొట్టింది!

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు (సంపూ) అంత మంచి వ్యక్తిని నేను చూడలేదు. ఆయనొక బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. సెట్‌లోకి రాగానే ఆయన నవ్వు చూస్తే రోజంతా హ్యాపీగా గడిచిపోయేది. ప్రీ-క్లైమాక్స్‌లో విషిక యాక్టింగ్ అదిరిపోయింది. సవారి గ్యాంగ్‌లో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారు. ఫైట్ మాస్టర్ సతీష్ మాస్టర్‌తో పాటు రామ్ లక్ష్మణ్, నభాకాంత్, సింహా మాస్టర్స్ అద్భుతమైన యాక్షన్ అందించారు. కొరియోగ్రాఫర్లు సుదన్, సందీప్ మాస్టర్స్ అందించిన డ్యాన్స్ మూమెంట్స్ మరో పదేళ్ల పాటు మోగుతూనే ఉంటాయి. కాస్ట్యూమ్ డిజైనర్ అజయ్ పనితనం మెచ్చుకోదగినది.

కాసర్ల శ్యామ్ ఈ సినిమాకు అసలైన హీరో!

శ్రీకాంత్ మనసులో ఉన్న పెర్ఫార్మెన్స్‌ను నేను ఎంతవరకు క్యాచ్ చేశానో తెలీదు కానీ.. ఆయన మనసులోని ఎమోషన్‌ను లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ గారు తన పెన్నుతో అద్భుతంగా ఆవిష్కరించారు. ఆయన కేవలం టాలెంటెడ్ మాత్రమే కాదు, దేవుడిచ్చిన ఒక గిఫ్టెడ్ రైటర్. సింగర్స్ జంగిరెడ్డి గారు, అశ్విని గారు స్టేజ్ మీద కూడా సింగిల్ టేక్‌లో పాడి మంత్రముగ్ధులను చేశారు. డిస్ట్రిబ్యూటర్లు శశి గారు, నవీన్ గారు, రవి గారు చెబుతున్న మాటలు వింటుంటే కడుపు నిండిపోతోంది..’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

నా లైఫ్‌లో బేర్ బాడీతో చేసినవి మూడే సినిమాలు.. శ్రీకాంత్ చంపేశాడు: మోహన్ బాబు

మాట్లాడాలని ఉన్నా.. గిరి గీసుకోవాల్సి వస్తోంది: మోహన్ బాబు

ఈ నిర్మాత ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ సేవా కార్యక్రమాలు

Updated Date - Sep 26 , 2026 | 08:42 PM