నా లైఫ్‌లో బేర్ బాడీతో చేసినవి మూడే సినిమాలు.. శ్రీకాంత్ చంపేశాడు: మోహన్ బాబు
ABN , Publish Date - Sep 26 , 2026 | 07:29 PM
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం ‘ద ప్యారడైజ్’. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్ రెస్పాన్స్‌తో కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం ‘ద ప్యారడైజ్’ (The Paradise). ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్ రెస్పాన్స్‌తో కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రంలో అత్యంత కీలకమైన, క్రూరమైన విలన్ పాత్రలో కలెక్షన్ కింగ్, డాక్టర్ మోహన్ బాబు (Collection King Mohan Babu) నటించి తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన ‘మీడియా ములాఖత్’ వేదికపై మోహన్ బాబు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
నా 50 ఏళ్ల కెరీర్‌లో ఇంత భయంకరమైన పాత్ర చేయలేదు
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పెట్టిన కష్టాలను ప్రస్తావిస్తూ.. ‘‘నాకు కథ చెప్పాడు కానీ, సెట్‌లోకి వెళ్లాక శ్రీకాంత్ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, నన్ను చంపేశాడు. నా 50 ఏళ్ల సినీ జీవితంలో దాదాపు 500లకు పైగా సినిమాలు చేశాను, ఎన్నో విలన్ వేషాలు వేశాను. కానీ ఇంత భయంకరమైన పాత్రను నా జీవితంలో మొదటిసారి చేశాను. ఇంత భయంకరంగా చూపిస్తాడని ముందే తెలిస్తే కచ్చితంగా ఈ సినిమా ఒప్పుకునేవాడిని కాదు. కానీ రోట్లో తలదూర్చాక రోకటి పోటుకు వెరవకూడదు కదా! ఒప్పుకున్నాం, సెట్‌లోకి వచ్చాం.. ఇప్పుడు నేను చేయనంటే హీరో, నిర్మాత పరిస్థితి ఏమవుతుంది, షెడ్యూల్ ఏమవుతుంది అని ఆలోచించి ఓపికగా చేశాను. నా కెరీర్‌లోనే అత్యధిక టేకులు తీసుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఒక్కడే. కళ్లు ఎర్రగా చేయండి, మధ్యలో చిన్నవి చేయండి, చివర్లో రౌద్రం చూపించండి అంటూ ఒకే సీన్‌కు 10 టేకులు తీసుకునేవాడు. చెరుకును ఒకసారి కాకుండా మళ్లీ మళ్లీ గానుగలో పెట్టి పిప్పి చేసినట్లుగా నా నుంచి నటనను రాబట్టాడు. శ్రీకాంత్ ఏమాత్రం ఆర్డినరీ డైరెక్టర్ కాదు, భవిష్యత్తులో దేశంలోనే నెంబర్ వన్ డైరెక్టర్ అవుతాడు’’ అని ప్రశంసించారు. అలాగే మొదట్లో రెండు మూడు రోజులు ఇంటి నుంచి మటన్ తెచ్చిపెట్టి, ఆ తర్వాత పట్టించుకోవడం మానేశాడని సరదాగా చమత్కరించారు.
బేర్ బాడీ కోసం ఉదయం, సాయంత్రం ఎక్సర్‌సైజ్‌లు
ఈ వయసులో కూడా బేర్ బాడీతో నటించాల్సి వచ్చిందని చెబుతూ.. ‘‘నా జీవితంలో బేర్ బాడీతో (షర్ట్ లేకుండా) చేసినవి కేవలం మూడే సినిమాలు.. ఒకటి మా గురువుగారు దాసరి గారి సినిమా, రెండోది ‘రాయలసీమ రామన్న చౌదరి’, మూడోది ఈ ‘ద ప్యారడైజ్’. ఈ వయసులో షర్ట్ లేకుండా ఫైట్ చేయాలని శ్రీకాంత్ చెప్పగానే.. అతని ధైర్యానికి ఆశ్చర్యపోయాను. దాని కోసం ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్‌లు చేసి ఆ షాట్లు పూర్తి చేశాను’’ అని తెలిపారు.
దర్శకుడి టీమ్‌ను చూసి అసూయపడ్డా
‘‘శ్రీకాంత్ దగ్గరున్న డైరెక్షన్ టీమ్‌ను చూసి నాకు చాలా జెలసీ అనిపించింది. ప్రతి దర్శకుడికీ ఇంత అద్భుతమైన టీమ్ దొరకదు. ‘మీరంతా ఈ సినిమా అయిపోయాక నా దగ్గరకు వచ్చేస్తారా?’ అని సరదాగా కో-డైరెక్టర్ తేజను కూడా అడిగాను. జీవితంలో చదువు లేకపోయినా పర్వాలేదు కానీ క్రమశిక్షణ ఉంటేనే గొప్ప స్థాయికి ఎదుగుతారు. శ్రీకాంత్‌లో ఆ క్రమశిక్షణ, సిన్సియారిటీ ఉన్నాయి’’ అని కొనియాడారు.
ఇవి కూడా చదవండి:
మాట్లాడాలని ఉన్నా.. గిరి గీసుకోవాల్సి వస్తోంది: మోహన్ బాబు
ఈ నిర్మాత ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ సేవా కార్యక్రమాలు
‘కాకా’ రాక ఫిక్స్.. మరి ‘విశ్వంభర’ ఎప్పుడు?