మాట్లాడాలని ఉన్నా.. గిరి గీసుకోవాల్సి వస్తోంది: మోహన్ బాబు
ABN , Publish Date - Sep 26 , 2026 | 07:07 PM
‘ద ప్యారడైజ్’ చిత్రంలో అత్యంత కీలకమైన, క్రూరమైన విలన్ పాత్రలో కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు నటించి తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన ‘మీడియా ములాఖత్’ వేదికపై మోహన్ బాబు చేసిన సుదీర్ఘ ప్రసంగం సంచలనంగా మారింది.
నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం ‘ద ప్యారడైజ్’ (The Paradise).. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అత్యంత కీలకమైన, క్రూరమైన విలన్ పాత్రలో కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు నటించి తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన ‘మీడియా ములాఖత్’ వేదికపై మోహన్ బాబు (Mohan Babu) చేసిన సుదీర్ఘ ప్రసంగం సంచలనంగా మారింది. సినీ పరిశ్రమ, సమాజ పోకడలు, రాజకీయ పరిస్థితులు, దర్శకుడి పనితీరు, నాని కష్టం.. ఇలా అన్ని విషయాలపై ఆయన కుండబద్దలు కొట్టారు.
మాట్లాడాలని ఉన్నా.. గిరి గీసుకోవాల్సి వస్తోంది
వేదికపై తన మనసులోని ఆవేదనను వ్యక్తం చేస్తూ.. ‘‘నాకు ఎన్నో విషయాలు మాట్లాడాలని ఉంటుంది. కానీ ఈరోజు ప్రజాస్వామ్యంలో ఏదీ మాట్లాడలేకపోతున్నాం. సమాజంలో ఉన్న నీతి, న్యాయం, ధర్మం, అవినీతి, అక్రమాల గురించి సినిమాల్లో డైలాగులు చెబుతుంటాం కానీ, నిజ జీవితంలోకి వచ్చేసరికి ఎన్నో పరిమితులు ఉంటున్నాయి. ఎంతో ఆవేదన ఉంది. నా విద్యాలయాల్లో దాదాపు 20 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. నేను ఏదైనా మాట్లాడితే నా బిడ్డల్లాంటి ఆ విద్యార్థులకు చెడ్డపేరు వస్తుందేమో, వారు ఇబ్బంది పడతారేమోనని ఒక గిరి గీసుకుని బతకాల్సి వస్తోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
నాని పర్మిషన్ అనగానే ఈగో హర్ట్ అయింది!
ఈ ప్రాజెక్ట్‌లోకి తాను ఎలా వచ్చారో వివరిస్తూ.. ‘‘రాజా రవీంద్ర ద్వారా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మా యూనివర్సిటీకి వచ్చి నన్ను కలిశాడు. కథ లైన్ చెబుతుంటే.. ‘ఈ సినిమాలో హీరో నాని కదా, నానిని అడిగావా?’ అని నేను అన్నాను. దానికి శ్రీకాంత్ ఏమాత్రం తడబడకుండా ‘మా అన్న నాని పర్మిషన్ తీసుకునే మీ దగ్గరికి వచ్చాను’ అన్నాడు. ఆ మాట వినగానే నాకు కాస్త ఈగో హర్ట్ అయింది. ‘నన్ను సినిమాలో పెట్టుకోవడానికి నాని రెకమండేషన్ తీసుకుని వచ్చావా?’ అని మనసులో అనిపించింది. అయితే ఈ తరం దర్శకుల్లో అంత ధైర్యంగా నిలబడి మాట్లాడటం, అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు కథను క్లియర్‌గా వివరించడం నాకు బాగా నచ్చింది’’ అని గుర్తుచేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
ఈ నిర్మాత ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ సేవా కార్యక్రమాలు
‘కాకా’ రాక ఫిక్స్.. మరి ‘విశ్వంభర’ ఎప్పుడు?
‘సిగ్మా’ అంటే ఏంటో గూగుల్ చేశా.. ఫస్ట్ కాపీ నాకే చూపించాలి: చిరంజీవి