Kommuri: 'తెలుగు సినిమా' సంపాదకుని శతజయంతి!
ABN , Publish Date - Oct 26 , 2026 | 05:09 PM
ప్రముఖ రచయిత, సంపాదకుడు కొమ్మూరి సాంబశివరావు శతజయంతి సందర్భంగా ఆయన సాహితీ ప్రస్థానం, ‘తెలుగు సినిమా’ మాసపత్రిక విశేషాలు, డిటెక్టివ్ నవలలు, వెండితెర ప్రయాణంపై ప్రత్యేక కథనం.
ప్రముఖ రచయిత, సంపాదకులు కొమ్మూరి సాంబశివరావు శతజయంతి పూర్తయ్యింది. తెనాలి పట్టణంలో 1926 అక్టోబర్ 26న జన్మించారాయన. కొమ్మూరి సాంబశివరావు తండ్రి వెంకట్రామయ్యకు ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటాచలం స్వయాన అన్నయ్య. ఆయన దత్తతు వెళ్ళడంతో ఇంటిపేరు మారింది. కొమ్మూరి సాంబశివరావు సోదరి వరూధుని భర్త కొడవటిగంటి కుటుంబరావు. అంటే సాంబశివరావుకు ఆయన సొంత బావ. కొమ్మూరి సాంబశివరావు తెలుగు సాహిత్యంలోనే కాదు, తెలుగు సినిమా రంగంలోనూ తనదైన ముద్రను వేశారు.
కొమ్మూరి వెంకట్రామయ్య తెనాలిలో 1928-30 ప్రాంతంలో ప్రింటింగ్ ప్రెస్ నడిపారు. చలం, దేవులపల్లి కృష్ణశాస్త్రితో పాటు పలువురి కవితలు, కథల పుస్తకాలు అందులో ప్రచురితమౌతుండేవి. ఆ తర్వాత మద్రాస్ వెళ్ళిన ఆయన 'తెలుగు సినిమా' పేరుతో సినిమా మాసపత్రికను ప్రారంభించారు. దానికి ఆయనే పబ్లిషర్ కమ్ ఎడిటర్. అయితే అది కొద్ది కాలానికి ఆగిపోయింది. రెండో ప్రపంచ యుద్థం అయిపోయిన తర్వాత 'తెలుగు సినిమా' పత్రికను వెంకట్రామయ్య పునరుద్ధరించారు. ఈసారి ఆయనకు చేదోడు వాదోడుగా కొడుకు కొమ్మూరి సాంబశివరావు నిలిచారు. రెండేళ్ళ పాటు ఆంధ్రప్రభలో పొలిటికల్ కరస్పాండెంట్‌గా పనిచేసిన సమయంలో సాంబశివరావు 'తెలుగు సినిమా'కు వ్యాసాలు రాస్తుండేవారు. 1947లో తండ్రి నుంచి 'తెలుగు సినిమా' పూర్తి బాధ్యతలను కొమ్మూరి సాంబశివరావు భుజానికెత్తుకున్నారు. సినిమా పత్రికలలో సరికొత్త సంచలనాలకు 'తెలుగు సినిమా' నెలవైంది. కలర్ కవర్ పేజీని ప్రచురించడమే కాకుండా స్టూడియో కవరేజ్, నటీనటులతో స్పెషల్ ఇంటర్వ్యూస్, ప్రత్యేక ఛాయాచిత్రాలు ప్రచురిస్తూ, సినిమా రంగంలో ఓ సంచలన మాసపత్రికగా నిలిచింది. కమర్షియల్‌గా అప్పట్లో 'తెలుగు సినిమా' పెద్ద సక్సెస్ ను సాధించింది. అయితే ఆ తర్వాత అనేకానేక సినిమా పత్రికలు మొదలు కావడంతో 1953 ప్రాంతంలో కొమ్మూరి సాంబశివరావు 'తెలుగు సినిమా' పత్రికను మూసివేశారు.

'తెలుగు సినిమా' మాసపత్రికను మూసివేసిన తర్వాత కొమ్మూరి డిటెక్టివ్ సాహిత్యంపై తన దృష్టిని నిలిపారు. 1956లో ఆయన రాసిన 'లక్షాధికారి హత్య' నవల సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి వరుసగా డిటెక్టివ్, హారర్, సోషల్ నవలలు దాదాపు వంద వరకూ రాశారు. తాను రాసిన నవలలు అన్నీ సొంత పబ్లికేషన్ ఆధునిక గ్రంధమాల ద్వారానే వెలువరించారు. ఈ పుస్తకాలన్ని ధనికొండ హనుమంతరావు క్రాంతి ప్రెస్ లో ప్రింట్ అవుతుండేవి. కొమ్మూరి చేతికి ఆరు వేళ్ళు ఉండటం వల్ల ఆయన రైటింగ్ అంత గుండ్రంగా ఉండేది కాదు. అయితే ఆయన రాసిన రాతను అర్థం చేసుకుని భార్య శ్యామలాదేవి తిరిగి రాస్తుండేవారు. కొమ్మూరి సాంబశివరావు 1960లో రాసిన 'చావు తప్పితే చాలు' తెలుగు సాహిత్యంలో తొలి హారర్ నవలగా గుర్తింపు తెచ్చుకుంది. తన డిటెక్టివ్ పుస్తకాల కవర్ పేజీకి కొమ్మూరి చాలా ప్రాధాన్యం ఇస్తూ ఉండేవారు. పలు పౌరాణిక చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా చేసిన టి.వి.ఎస్. శర్మతో కవర్ పేజీలను వేయించేవారు. ఈ నవలన్నీ వెస్ట్రన్ స్టైల్లో పాఠకులను బాగా ఆకట్టుకునేవి.
వెండితెర యుగంధర్ గా నాగభూషణం!
కొమ్మూరి సాంబశివరావు డిటెక్టివ్ పుస్తకాలలో నాయకుడు యుగంధర్. అయితే ఆ యుగంధర్ పాత్రను వెండితెరపై ప్రెజెంట్ చేయడం చాలా కష్టమని కొమ్మూరి భావించేవారు. ఆయన రాసిన 'పట్టుకుంటే లక్ష' డిటెక్టివ్ నవల అదే పేరుతో సినిమాగా వచ్చింది. కృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో డిటెక్టివ్ యుగంధర్ పాత్రను నాగభూషణం పోషించారు. అలానే కొమ్మూరి రాసిన 'నేను చావను' అనే నవలను చిరంజీవి హీరోగా 'నకిలీ మనిషి' పేరుతో తెరకెక్కించారు. కొమ్మూరి రాసిన సాంఘిక నవల 'ఒక చల్లని రాత్రి'ని డి. రామానాయుడు అదే పేరుతో చంద్రమోహన్ హీరోగా తెరకెక్కించారు.
విడుదలకు నోచుకోని 'మళ్ళీ ఎప్పుడో ఎక్కడో'!
కొమ్మూరి రాసిన మూడు నవలలు సినిమాలుగా రాగా... 1975లో కొమ్మూరి నిర్మాతగా మారారు. జయంతి నాయికగా తెలుగు, తమిళ భాషల్లో ఆయన 'మళ్ళీ ఎప్పుడో ఎక్కడో' అనే సినిమాకు శ్రీకారం చుట్టారు. నిజానికి వేరే నిర్మాత ఆయన నవలను సినిమాగా తీస్తానని ముందుకొచ్చారు. కానీ చివరి నిమిషంలో ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో నిర్మాత బాధ్యతలను కొమ్మూరి స్వీకరించారు. ఈ సినిమాకు మ్యూజిక్ పెండ్యాల కాగా, శ్రీశ్రీ పాటలు రాశారు. ఆదుర్తి శిష్యుడు కాసుల గురుదేవ్ దీనికి దర్శకుడు. బ్లాక్ అండ్ వైట్‌లో తీసిన ఈ ద్విభాషా చిత్రం మూడేళ్ళ తర్వాత పూర్తై తొలికాపీ సిద్థమైంది. కానీ విడుదలకు మాత్రం నోచుకోలేదు. ఆధునిక మూవీస్ బ్యానర్ పై కొమ్మూరి నిర్మించిన ఈ సినిమా అలా ఆగిపోయింది. అయితే కొమ్మూరికి డిటెక్టివ్ సాహిత్యంపై ఉన్న పట్టు కారణంగా ఆ తరహా కథలను తెరకెక్కించాలని అనుకున్న చాలామంది దర్శక నిర్మాతలు ఆయన్ని కలిసి సలహాలు తీసుకుంటూ ఉండేవారు. కొమ్మూరి రాసిన పలు నవలలు తమిళ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి. 'కొమ్మూరి తన అభిమాన రచయిత' అని మల్లాది వెంకట కృష్ణమూర్తి చెబుతుంటారు. కొమ్మూరికి మంచి పేరు తీసుకొచ్చిన 'ప్రాక్టికల్ జోకర్' నవలను మల్లాది కొన్నేళ్ళ క్రిందట 'కథ కొమ్మూరి, కథనం మల్లాది' అంటూ తిరిగి రాశారు. కొమ్మూరి రాసిన అనేకానేక నవలలు పునర్ముద్రణకు నోచుకున్నాయి. ప్రముఖ దర్శకుడు వంశీ తాను తీయలేకపోయిన 'గాలికొండపురం రైల్వే గేట్' సినిమా స్క్రిప్ట్ కి కొమ్మూరి వర్క్ చేశారని చెప్పారు.
తెలుగులో కేవలం రచయిత ఉంటూ విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వారిలో అప్పట్లో కొమ్మూరి తప్పితే మరొకరు కనిపించరు. నవలలు రాయడంతో పాటు వాటిని ప్రచురించి, విజయవంతంగా మార్కెటింగ్ చేయడంలో ఆయన దిట్ట. అందుకనే అమెరికన్ ఇంపోర్డెట్ కారులో తిరిగేంత వైభవాన్ని పొందారు. ఎస్వీఆర్, సావిత్రి, అల్లు రామలింగయ్య వంటి సినీ ప్రముఖులు నివసించే టి. నగర్ హబిబుల్లా రోడ్లో ఆరు వేల చదరపు అడుగుల్లో మూడు అంతస్తుల భవంతిలో నివసించారు. 1975 నుంచి రచనా వ్యాసాంగాన్ని తగ్గించేసిన కొమ్మూరి సాంబశివరావు 'అపన' కోసం 'ప్రపంచానికి 10 గంటల ప్రమాదం', 1983లో విజయ మాస పత్రిక కోసం 'అర్థరాత్రి పిలుపు', 1986లో తరంగిణి పక్ష పత్రిక కోసం 'నేను నేను కాను' నవలలు రాశారు. రచయితగా, సంపాదకునిగా, ప్రచురణ కర్తగా ఎందరికో మార్గదర్శిగా నిలిచిన కొమ్మూరి సాంబశివరావు 1994 మే 17న కన్నుమూశారు.
ఇవి కూడా చదవండి:
సౌందర్య అంత అందంగా ఉండేది కాబట్టే.. దేవుడు తీసుకెళ్లిపోయాడు: ఆమని
రజనీతో రజనీకే పోటీ.. టాప్-3లో ఒకడే కింగ్
సూర్యకు ఈ ఏడాది త్రిపుల్ ధమాకా.. అదే జరిగితే హిస్టరీనే