జర్నలిస్ట్ ప్రభు పుస్తకం తొలి ప్రతికి రూ.5 లక్షలు.. ఛారిటబుల్ ట్రస్ట్‌కు రూ.11 లక్షల విరాళం
ABN, Publish Date - Oct 29 , 2026 | 02:03 PM
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు జన్మదినం సందర్భంగా ‘శూన్యం నుంచి శిఖరాగ్రాలకు -2’ పుస్తకావిష్కరణ జరిగింది. తొలి ప్రతిని నిర్మాత ఆదిత్య రామ్ రూ.5 లక్షలకు కొనుగోలు చేశారు. ప్రభు ఛారిటబుల్ ట్రస్ట్‌కు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు రూ.11,11,111 విరాళం ప్రకటించారు.
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు రాసిన 'శూన్యం నుంచి శిఖరాగ్రాలకు -2' పుస్తకావిష్కరణ ఆయన జన్మదినం సందర్భంగా అక్టోబర్ 28వ తేదీ ఎఫ్.ఎన్.సి.సి.లో జరిగింది. సీనియర్ నటుడు సుమన్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి, తొలి ప్రతిని ప్రముఖ నిర్మాత, రియాల్టర్ ఆదిత్య రామ్‌కు అందించారు. ఆయన తొలి కాపీని రూ. 5 లక్షలకు కొనుగోలు చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, కాట్రగడ్డ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, జేడీ చక్రవర్తి, రేలంగి నరసింహారావు, ఉత్తేజ్, సుచిత్ర చంద్రబోస్, రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రభు రాసిన 'శూన్యం నుంచి శిఖరాగ్రాలకు -2' పుస్తకం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గద్దర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది.
ఇదే వేదికపై జర్నలిస్ట్ గా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రభు... తన భార్య జ్ఞాపకార్థం ఆడెపు దుర్గా మాధవీ ప్రభు ఛారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించారు. దీని ద్వారా ఆపన్నులకు విద్య, ఆరోగ్యం అందించే కార్యక్రమాలు చేపడతామని ప్రభు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాత ఆదిత్య రామ్ మాట్లాడుతూ, 'ప్రభు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రోజు ఆయన శూన్యం నుండి శిఖరాగ్రాలకు పార్ట్ 2 పుస్తకం ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉంది. సినిమా జర్నలిజం పట్ల ఆయనకున్న ప్యాషన్ ఈ పుస్తకం సైజ్ చూస్తే తెలుస్తోంది. ఈ పుస్తకాన్ని మూడు పుస్తకాల కింద తీసుకురావొచ్చు. అంత సమాచారం చేర్చారు. ప్రభు గారు జర్నలిజంలో ఇలాగే ఎనర్జిటిక్ గా కొనసాగాలని కోరుకుంటున్నా' అని అన్నారు. నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ, 'సినీ పాత్రికేయుల్లో ప్రభు ప్రత్యేకంగా నిలుస్తారు. ప్రజలకు ఎలాంటి సమాచారం అందించాలో ఆ సమాచారాన్ని అందించి అందరి ప్రశంసలు పొందారు. ఆయన మరెన్నో ఏళ్లు ఇలాగే పరిశ్రమాలో మనందరితో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
నటుడు సుమన్ మాట్లాడుతూ, 'నాకు ప్రభు అంటే ప్రత్యేకమైన గౌరవం, అభిమానం. ఈ నలభై ఏళ్లలో ఎన్నో మెమొరీస్ ఆయనతో మాకు ఉన్నాయి. ప్రభు మరింత సక్సెస్ ఫుల్ గా తన ప్రయాణం కొనసాగించాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అని చెప్పారు.
జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ, 'సినీ పాత్రికేయుడిగా నా ప్రస్థానం 1986 నుంచి 2026 వరకు 40 ఏళ్లకు చేరుకుంది. ఇది నా కెరీర్ లో గొప్ప సందర్భంగా భావిస్తున్నా. ఈ నాలుగు దశాబ్దాల ప్రయాణంలో చిత్ర పరిశ్రమలోని ఎంతోమంది గొప్పవారితో పరిచయం, అనుబంధం ఏర్పడటం, నేను వారి ప్రశంసలు, ప్రేమ పొందడం నా అదృష్టం. పాత్రికేయుడిగా మనం ఏం రాసినా అది చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగపడాలని భావించిన పాత్రికేయుడిని నేను. ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే ప్రయత్నం ఏనాడూ చేయలేదు. ఆ నియమాన్ని పాటిస్తూ వచ్చాను. ప్రొఫెషనలిజాన్ని నమ్ముకున్నాను. నన్ను స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది కొత్తవాళ్లు జర్నలిజంలోకి వచ్చారు. దాసరి గారిని, నిర్మాత వడ్డే రమేష్ గారిని నా జీవితంలో మర్చిపోలేను. స్వర్గస్తులైన నా భార్య దుర్గా మాధవి సేవా గుణాన్ని కొనసాగిస్తూ ఆడెపు దుర్గా మాధవీ ప్రభు ఛారిటబుల్ ట్రస్ట్ ప్రారంభిస్తున్నాను' అని అన్నారు.
నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, 'జర్నలిస్ట్ గా ప్రభు ఎంత ప్రతిభావంతుడో, వ్యక్తిత్వంలో అంత గొప్పవాడు. ఎంతోమందికి సహాయం చేయించారు. ఆయన వందో పుట్టినరోజు కూడా మనం జరపాలని కోరుకుంటున్నాను. ప్రభుగారు ఏర్పాటు చేసిన ఛారిటబుల్ ట్రస్ట్ కు నా వంతుగా రూ.11,11, 111 లను విరాళంగా ఇస్తున్నాను ' అని అన్నారు.
అనంతరం తోటి పాత్రికేయులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జర్నలిస్ట్ ప్రభు బర్త్ డే కేక్‌ను కట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సీనియర్ నిర్మాత కన్నుమూత
‘ఆదర్శకుటుంబం’లో టెన్షన్.. అసలు విషయం ఏంటంటే
‘కిల్లర్’ సినిమా ట్విస్ట్ చెబితే రూ. కోటి.. కాంటెస్ట్ రూల్స్ ఇవే