సినిమాలతో నవ్వించిన అనుదీప్‌.. ఇప్పుడు ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌’ పుస్తకంతో!

ABN , Publish Date - Nov 09 , 2026 | 06:34 PM

‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్‌ ఇప్పుడు పుస్తక రచయితగా మారారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌’ పేరుతో ఆహారం, నిద్ర, డోపమైన్ నియంత్రణ, మంచి అలవాట్లు, ప్రశాంతమైన జీవనం గురించి పుస్తకం రాశారు. ఆన్విక్షికి పబ్లిషర్స్ ఈ పుస్తకాన్ని త్వరలో ప్రచురించనుంది.

KV Anudeep

దర్శకుడు అనుదీప్‌ తనలోని రచయితను మరోసారి వెలుగులోకి తీసుకొస్తున్నాడు. అయితే ఈసారి సినిమా రచయితగా కాదు... పుస్తక రచయిత. షార్ట్ ఫిల్మ్ మేకర్‌గా, రైటర్‌గా కెరీర్‌ ప్రారంభించిన అనుదీప్‌ తాను తెరకెక్కించిన 'పిట్టగోట, జాతిరత్నాలు, ప్రిన్స్, ఫంకీ' చిత్రాలకు అతనే రచన చేశారు. అలానే 'ఫస్ట్ డే ఫస్ట్ షో' మూవీకి అతనే కథను అందించారు. అనుదీప్‌ తొలి చిత్రం 'పిట్టగోడ' సక్సెస్ కాకపోయినా... 'జాతిరత్నాలు'తో ఓవర్ నైట్ క్రేజీ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో శివ కార్తికేయన్‌తో తమిళ చిత్రం 'ప్రిన్స్' చేసే ఆస్కారం లభించింది. ఆ సినిమా కమర్షియల్‌గా చెప్పకోదగ్గ విజయాన్ని అందుకోలేదు. దానితో పాటు తాజాగా విడుదలైన 'ఫంకీ' సినిమా సైతం అతన్ని నిరాశకు గురిచేసింది. తన చిత్రాలతో పాటు, మిత్రుల సినిమాలలోనూ అతిథి పాత్రలను పోషించే అనుదీప్ ఇప్పుడు 'లైఫ్‌ ఈజ్ బ్యూటిఫుల్‌' పేరుతో ఓ పుస్తకాన్ని రాశాడు.


'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' పుస్తకాన్ని ఆన్విక్షికి పబ్లిషర్స్‌ సంస్థ ప్రచురిస్తోంది. ఈ విషయాన్ని వెంకట్‌ సిద్ధారెడ్డి తెలియచేస్తూ, 'అనుదీప్ నాకు ఎప్పట్నుంచో తెలుసు. పుస్తకాలు బాగా చదువుతాడు. ఏది రాసినా బాగా రాస్తాడనే నమ్మకం. నెల రోజుల క్రితం వచ్చి అనుదీప్‌ తన పుస్తకం మాన్యుస్క్రిప్ట్ చేతిలో పెట్టగానే ఆశ్చర్యపోయాను. ఏవో కథలో, నవలో రాసుంటాడని అనుకున్నాను. కానీ, ప్రస్తుతం మనమందరం ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని సూచించే పుస్తకం రాస్తాడని మాత్రం అనుకోలేదు. సినిమా ద్వారా మనందరినీ నవ్వించి మన స్ట్రెస్ లెవల్స్ ని తగ్గించిన అనుదీప్, ఇప్పుడు మన రోజువారీ జీవితంలో ఆనందాన్ని, ప్రశాంతతను శాశ్వతంగా ఎలా నిలుపుకోవాలో చెప్పడానికి రాసిన పుస్తకమే ఈ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' (ఆహారం, నిద్ర, డోపమైన్లను అదుపు చేసి ఆనందంగా బతికే కళ). ఆన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా త్వరలో వస్తున్న ఈ పుస్తకంలో అనుదీప్ ఒక ఎక్స్‌పర్ట్ లా కాకుండా, మన మంచికోరే ఒక క్లోజ్ ఫ్రెండ్ లా సరదాగా మాట్లాడతారు. అసలు మనం మంచి అలవాట్లను ఎందుకు వాయిదా వేస్తాం, ఫోన్ స్క్రోలింగ్ ఇచ్చే 'చీప్ డోపమైన్' ఉచ్చులో ఎలా పడిపోతున్నాం, మనం తినే ఆహారం, మన నిద్ర మన మెదడును ఎలా శాసిస్తున్నాయి అనే విషయాలను ఎంతో సులభంగా, ప్రాక్టికల్ గా వివరించారు. ఆటోపైలట్ మోడ్ నుండి బయటపడి, జీవితాన్ని నిజంగా ఆస్వాదించాలనుకునే ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది' అని తెలిపారు. మరి బేసికల్‌గా రచయిత అయిన అనుదీప్‌ పుస్తకం పాఠకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’కు బ్రేకులు? కారణమిదేనా..

‘రాయవలస’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ విడుదల

పాన్ ఇండియా సినిమాల్లో ఆ మూడు బ్యానర్స్‌దే హవా

Updated Date - Nov 09 , 2026 | 06:44 PM