ఇఫీలో 235 సినిమాల ప్రదర్శన.. తెలుగు చిత్రాలకూ చోటు!
ABN, Publish Date - Nov 14 , 2026 | 01:36 PM
నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో 86 దేశాల నుంచి 159 అంతర్జాతీయ, 76 భారతీయ చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి. అశుతోష్ గోవారికర్ ఫెస్టివల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, ఈసారి కొత్తగా యానిమేషన్, ఫిల్మ్స్ ఫర్ ఫిల్మ్స్ విభాగాలను ప్రవేశపెట్టారు. తెలుగు సినిమాలకూ వివిధ విభాగాల్లో చోటు దక్కింది.
ఎప్పటిలానే ఈ యేడాది కూడా నవంబర్ 20 నుంచి 28 వరకూ గోవాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరుగబోతోంది. దీనికి ఫెస్టివల్ డైరెక్టర్ గా ప్రముఖ దర్శక నిర్మాత అశుతోష్ గోవారికర్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన ఈ చిత్రోత్సవానికి సంబంధించిన విశేషాలను తెలియచేశారు. ఈ సారి 86 దేశాల నుంచి 159 అంతర్జాతీయ, 76 భారతీ చిత్రాలు ప్రదర్శితం కాబోతున్నాయి. ఈ యేడాది 'సరిహద్దులు లేని కథలు' అనే అంశాన్ని థీమ్‌గా వేడుకలను నిర్వహించబోతున్నారు. ప్రముఖ పోలిష్ దర్శకుడు పావెల్ పావికోవ్స్కీ రూపొందించిన 'ఫాదర్ ల్యాండ్' మూవీని ప్రారంభ చిత్రంగా ఇందులో ప్రదర్శిస్తారు.
అలానే ఇండియన్ పనోరమా విభాగంలో 18 భాషలకు చెందిన 76 చిత్రాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. ఫీచర్ ఫిల్మ్ విభాగాన్ని 'ధురంధర్' మూవీతోనూ నాన్ ఫీచర్ విభాగాన్ని లదాఖీ భాషా సినిమా 'బికమింగ్'తో మొదలు పెడతారు. ఈసారి అంతర్జాతీయ విభాగంలో 15 చిత్రాలు పోటీపడుతుండగా, ఏడు చిత్రాలు ఉత్తమ తొలి ఫీచర్ చిత్రం టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. ఐసీఎఫ్- యునెస్కో గాంధీ పతకం కోసం పది చిత్రాలు పోటీపడనున్నాయి. బ్రిక్స్ కూటమిలో ఉన్న 11 సభ్య దేశాల సినిమాలను కూడా ఇందులో ప్రదర్శించబోతున్నారు. ఈ విభాగాన్ని నితీష్ తివారి దర్శకత్వం వహించిన 'రామయణం' సినిమాతో ప్రారంభిస్తారు. ఈసారి భాగస్వామ్య దేశంగా ఉన్న రష్యా నుంచి నాలుగు చిత్రాలు ప్రదర్శితం కాబోతున్నాయి. అలానే గౌరవ దేశంగా స్పెయిన్ నుంచి 4 చిత్రాలను ప్రదర్శనలకు ఎంపిక చేశారు. 52 మంది మహిళా దర్శకులు, 62 మంది తొలి చిత్ర దర్శకులు ఈ ఉత్సవంలో పాల్గొనబోతున్నారు.
ఈ సంవత్సరం కొత్తగా యానిమేషన్, ఫిల్మ్స్ ఫర్ ఫిల్మ్స్ అనే రెండు విభాగాలను చేర్చి చెరో ఐదు చిత్రాలను ప్రదర్శించబోతున్నట్టుగా అశుతోష్ గోవారికర్ తెలిపారు. సింగపూర్ దర్శకుడు ఆంథోని చెన్ రూపొందించిన 'వీ ఆల్ ఆర్ స్ట్రేంజర్స్' సినిమా ప్రదర్శనతో ఉత్సవాలు ముగియబోతున్నాయి. విశేషం ఏమంటే... ఈసారి పలు తెలుగు సినిమాలు వివిధ విభాగాలలో తమ సత్తా చాటబోతున్నాయి.
ఇవి కూడా చదవండి:
మంత్రాలు లేవు.. పురోహితులు లేరు.. అనిరుధ్ – కావ్య వివాహ పద్ధతి ఏంటో తెలుసా?
ఎన్టీఆర్ సినిమాకు ముందే.. చిరంజీవితో త్రివిక్రమ్ మూవీ?
మోక్షజ్ఞ కంటే ముందే.. నందమూరి కుటుంబం నుంచి మరో సినీ ఎంట్రీ!