మంత్రాలు లేవు.. పురోహితులు లేరు.. అనిరుధ్ – కావ్య వివాహ పద్ధతి ఏంటో తెలుసా?

ABN , Publish Date - Nov 13 , 2026 | 10:07 PM

అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ పెళ్లిలో పురోహితులు, హోమాలు లేకపోవడానికి కారణమేంటి? పెరియార్ ప్రారంభించిన సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్ సంప్రదాయం ప్రత్యేకతలు, చరిత్ర తెలుసుకోండి.

Anirudh Ravichander, Kavya Maran

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకే పేరు మార్మోగిపోతోంది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సన్‌రైజర్స్ హైదరాబాద్ కో-ఓనర్ కావ్య మారన్ (Kavya Maran) వివాహ బంధంతో ఒక్కటైన సంగతి మనందరికీ తెలిసిందే. నవంబర్ 11వ తేదీన గ్రీస్ వేదికగా అత్యంత వైభవంగా వీరి వివాహ వేడుక జరిగింది. నవంబర్ 21న వీరి రిసెప్షన్ చెన్నైలో జరగనుంది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

అయితే, వీరి పెళ్లి ఫొటోలు చూసిన వారందరికీ ఒక సందేహం కలిగింది. అసలు వీరి పెళ్లి ఏ సంప్రదాయం ప్రకారం జరిగింది? అక్కడ పురోహితులు కానీ, హోమాలు కానీ ఎందుకు కనిపించడం లేదు? ఈ ప్రశ్నలన్నింటికీ డీఎంకే నేత డాక్టర్ టీఆర్‌బీ రాజా తన సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు. అనిరుధ్ - కావ్య చేసుకుంది 'సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్' అని ఆయన ప్రకటించడంతో, ఇప్పుడు ఈ పెళ్లి మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

డీఎంకే నేత డాక్టర్ టీఆర్‌బీ రాజా ఎక్స్ వేదికగా స్పందిస్తూ, అనిరుధ్, కావ్య వివాహ వేడుకలో ఎలాంటి ఆచారాలు పాటించారో వివరించారు. వీరిద్దరూ తమిళనాడులో ఎంతో ప్రాచుర్యం పొందిన 'సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్' పద్ధతిలో ఒక్కటయ్యారని ఆయన వెల్లడించారు. ఈ వేడుకలో భాగంగా అనిరుధ్, కావ్య ఒకరికొకరు పూలమాలలు మార్చుకుని, ఆ తర్వాత బంగారు గొలుసులను మార్చుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో, వారి ఆశీర్వాదాలతో ఈ వివాహం ఎంతో నిరాడంబరంగా జరిగిందన్నారు.

ఇంతకీ ఈ 'సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్' లేదా 'స్వాభిమాన వివాహం' అంటే.. తమిళనాడులో ప్రముఖ సామాజిక సంస్కర్త పెరియార్ ఈవీ రామస్వామి ప్రారంభించిన స్వాభిమాన ఉద్యమం నుంచే ఈ వివాహ సంప్రదాయం పుట్టుకొచ్చింది. సమాజంలో ఉన్న కుల వివక్షను, వివాహాల్లో ఉండే ఖర్చుతో కూడిన మతపరమైన ఆచారాలను, మతపెద్దల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ పెరియార్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో పెళ్లి చేసుకోవడానికి వేద మంత్రాలు కానీ, విస్తృతమైన మతపరమైన క్రతువులు కానీ అస్సలు అవసరం లేదు. అంతేకాదు, ఈ పెళ్లికి పురోహితుడు కూడా తప్పనిసరి కాదు.

ఈ వివాహ విధానం చాలా సరళంగా ఉంటుంది. వధూవరులు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి, పరస్పర అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటిస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు సాక్షులుగా ఉండగా.. వధూవరులు పూలమాలలు మార్చుకోవడం లేదా గొలుసులు మార్చుకోవడం ద్వారా పెళ్లి పూర్తవుతుంది. ఈ విధానానికి 1967లో తమిళనాడులో చట్టబద్ధమైన గుర్తింపు కూడా లభించింది.

అప్పటి ప్రభుత్వం హిందూ వివాహ చట్టానికి ప్రత్యేక సవరణ చేయడం ద్వారా, సంప్రదాయ మతపరమైన వేడుకలు లేకుండానే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్‌లను చట్టబద్ధంగా నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించింది. ఇప్పుడు ఇంతటి సెలబ్రిటీ హోదా ఉన్న అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ కూడా తమ పెళ్లి కోసం ఈ సంప్రదాయాన్ని ఎంచుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది.

Updated Date - Nov 13 , 2026 | 10:12 PM