సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘సెక్యూరిటీ’.. లక్షలు, కోట్లు వెచ్చిస్తోన్న స్టార్స్

ABN, Publish Date - Nov 29 , 2026 | 09:04 PM

‘రక్షణవలయంలో తారలు’ - వింటూంటేనే ఆసక్తి కలుగుతోంది కదూ!.. కొంతమందికి స్టార్‌డమ్ పెరిగే కొద్దీ చుట్టూ బాడీగార్డ్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. కొందరు సెక్యూరిటీ పెట్టుకోవడం స్టేటస్ సింబల్ గానూ భావిస్తున్నారు. ఈ రక్షకుల కోసం స్టార్స్ చేస్తున్న ఖర్చు ఎంత?

Celebrity Bodyguards Salaries

ఏ సినిమా వేడుకలోనైనా - తారల పర్సనల్ ఫంక్షన్స్‌లోనూ, స్టార్స్ ఎక్కడకు వెళ్ళినా వారి చుట్టూ బాడీగార్డ్స్ కనిపిస్తున్నారు. ముంబైలో అంటే కొందరు స్టార్స్‌ను బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసి ఎటాక్స్ సాగిస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ వంటి చోట్ల ఆ పరిస్థితి లేదు.. అయినా వేడుకల్లో జనం బారి నుంచి తమను తాము కాపాడుకోవడానికి బౌన్సర్స్‌ (Bouncers)ను, బాడీగార్డ్స్‌ (Bodyguards)ను నియమించుకుంటున్నారు స్టార్స్. ఈ సెక్యూరిటీ కోసం లక్షల్లో, కోట్లల్లో వెచ్చిస్తున్నారట.. వింటూంటే ఆశ్చర్యం కలగవచ్చు. కానీ, ఇది నూటికి నూరు పాళ్ళు నిజం!. ఈ బాడీగార్డ్స్ చుట్టూ ఉండడం వల్ల కొందరికి తాము బందీలుగా ఉన్నట్టు అనిపిస్తోందని బాలీవుడ్ బాబులు కొంతమంది వాపోతున్నారు.. అయినా తప్పడం లేదని స్టార్స్ చెబుతున్నారు. తనపై కాల్పులు జరిపినా టైగర్ ష్రాఫ్‌ (Tiger Shroff) మాత్రం ఎప్పటిలాగే తిరుగుతున్నారు.. ఆయనకు చుట్టూ మిత్రులే రక్షణ కవచంలా ఉండడం విశేషం.


సెలబ్రిటీస్ బయటకు అడుగుపెడితే చాలు ‘పాపరాజీ’ (సెలబ్రిటీల అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు తీసే వారు) తాకిడి ఉంటోంది. ఒకప్పటి కంటే ఇప్పుడు జనాల చేతుల్లోనే సెల్‌ ఫోన్స్ ఉన్న కారణంగా ఎవరైనా సెలబ్రిటీ కనిపిస్తే చాలు వెంటనే క్లిక్ మనిపించేసి, క్షణాల్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ పిక్ కానీ, వీడియో కానీ చూసిన వెంటనే ఆ పరిసర ప్రాంతంలో ఉన్న ఇతరులు సెలబ్రిటీస్‌ను తమ సెల్ ఫోన్స్‌తోనూ క్యాప్చర్ చేయడానికి పరుగులు తీస్తున్నారు. దీంతో తారలు షూటింగ్స్ కోసమే కాదు, తమ కుటుంబసభ్యులతో కలసి పార్టీలకు వెళ్ళాలన్నా, ఈ తరహా ‘క్లిక్స్’ దాడి జరుగుతోంది. వీటి బారినుంచి బయట పడటానికి కూడా సెలబ్రిటీస్ బాడీగార్డ్స్‌ను నియమించుకుంటున్నారు.

ఇక స్టార్స్ తాము నటించిన సినిమా ఫంక్షన్స్‌లో పాల్గొనడానికి వెళ్తూంటే తప్పకుండా పర్సనల్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ వేడుకల్లో అభిమానుల బారి నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఈ ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇక ఆ ఈవెంట్‌ను నిర్వహించేవారు, లేదా చిత్ర నిర్మాతలు కూడా తారలను అభిమానుల బారి నుంచి రక్షించడానికి అన్నట్టు స్పెషల్ బౌన్సర్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. ఇలా మొత్తానికి తారలకు బాడీగార్డ్స్ అవసరం ఏదో ఒక సమయంలో అనివార్యమవుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ముంబైలో కొంతమంది బాలీవుడ్ బాబులే సొంతగా సెక్యూరిటీ ఏజెన్సీస్ నడుపుతున్నారు. అలాంటివారిలో పలు హిందీ సినిమాల్లో నటించిన రోనిత్ రాయ్ ప్రధానంగా కనిపిస్తున్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని కొందరు మేకప్ మెన్, ఫైటర్స్ కూడా చిన్నపాటి సెక్యూరిటీ ఏజెన్సీస్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ కోణంలో చూస్తే కొందరు బాడీ బిల్డర్స్‌కు సెలబ్రిటీస్ కారణంగా ఉపాధి లభిస్తున్నట్టే కదా!


ఏమైతేనేం స్టార్స్‌కు బాడీగార్డ్స్‌గా ఉండడం వల్ల కూడా కొందరు కోట్లు సంపాదిస్తున్నారు.. వింటూంటేనే ఆశ్చర్యం కలుగుతోంది కదూ! కానీ ఇది అక్షరసత్యం! కొందరు తారలు నెలకు ఒక్కో బాడీగార్డ్‌కు రెండు, మూడు లక్షలు చెల్లిస్తున్నారు. మరికొందరు ఒకేసారి నాలుగు నుంచి పది మంది వరకు మెయింటెయిన్ చేస్తున్నారు. అంటే, నెలకు ఇరవై లక్షల వరకు బాడీగార్డ్స్‌కే వెచ్చిస్తున్నారు. సంవత్సరానికి కోటి రూపాయల పైమాటే అన్న మాట! షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) సెక్యూరిటీ హెడ్ రవి నేతృత్వంలోని టీమ్‌కు ఏడాదికి 2 కోట్ల 70 లక్షలు చెల్లిస్తున్నారట. సల్మాన్ ఖాన్ (Salman Khan) బాడీ గార్డ్ షేరా టీమ్‌కు రెండు కోట్ల రూపాయలట.. వింటూంటేనే కళ్ళింతలు అవుతున్నాయి కదూ. కొందరు స్టార్స్ ఇంటర్నేషనల్ గార్డ్స్‌ను స్పెషల్ ప్రొటెక్షన్‌గా ఏర్పాటు చేసుకుంటున్నారు. అలా ఆఫ్రికన్స్ ఎక్కువగా బాడీగార్డ్ జాబ్స్ చేస్తున్నారు. ఈ ఇంటర్నేషనల్ బాడీగార్డ్స్‌లో ఒక్కొక్కరికి రోజుకు రెండు లక్షలు ఇవ్వాల్సి ఉంటుందట. వారికి సంవత్సరంలో సగం రోజులు పని దొరికినా రెండున్నర కోట్ల రూపాయలు దక్కినట్టే!


సెలబ్రిటీస్ లైఫ్‌ను కాపాడటానికి నియమితులయ్యే బాడీగార్డ్స్ కొన్నిసార్లు జనాలదాడులూ ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రాణభయం ఉన్నవారే ఇంటర్నేషనల్ గార్డ్స్‌ను నియమించుకుంటున్నారు. ఈ అంతర్జాతీయ రక్షణ కవచంలోని సభ్యులు ప్రాణాలకు తెగించి పోరాడే విద్యలూ అభ్యసించి ఉంటారట. అందువల్లే వారికి అంత డిమాండ్ అని తెలుస్తోంది. తెలుగునాట అల్లు అర్జున్ (Allu Arjun), రామ్ చరణ్ (Ram Charan) లాంటి స్టార్స్ కూడా బాడీగార్డ్స్‌ను పోషిస్తున్నారు. స్టార్‌డమ్ పెరిగే కొద్దీ తారలకు జనాల నుంచి తాకిడి ఎక్కువగా ఉంటుంది.. అలాంటప్పుడు వారి నుంచి తమను కాపాడుకోవడానికి ఈ సెక్యూరిటీ హంగామా తప్పదు. తమ ప్రైవసీ కోసం సెక్యూరిటీ గార్డ్స్‌ను నియమించుకుంటున్నా, దానివల్ల ఫ్రీడమ్ పోతోందనీ కొందరు వాపోతున్నారు. భవిష్యత్‌లో ఇంకెంతమంది ఇండియన్ స్టార్స్ రక్షణవలయాల్లో సాగుతారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

పరభాషా నాయకులు.. ప్రతిభకు పట్టం కట్టడంలో తెలుగువారే టాప్

‘ఆకాశంలో ఒక తార’ టీమ్‌కు చిరు, చరణ్ అభినందనలు

నటుడిగా సుధాకర్ తనయుడు బన్నీ ఎంట్రీ.. చిరు ఇచ్చిన సలహా ఇదే

Updated Date - Nov 29 , 2026 | 09:04 PM