క్లాస్‌రూమ్‌లో బిగ్ బాస్ ఓటింగ్ ప్రచారం.. కేతిరెడ్డి ఫిర్యాదుతో NCPCR కీలక ఆదేశాలు

ABN , Publish Date - Oct 14 , 2026 | 09:15 PM

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థల తరగతి గదులను వాణిజ్య రియాలిటీ షోల ఓటింగ్ ప్రచారాలకు వేదికగా మార్చడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

Kethireddy on Bigg Boss

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థల తరగతి గదులను వాణిజ్య రియాలిటీ షోల ఓటింగ్ ప్రచారాలకు వేదికగా మార్చడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. తెలంగాణలోని నల్గొండ పట్టణంలో గల నాగార్జున ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బిగ్ బాస్ తెలుగు సీజన్-10 కంటెస్టెంట్ అమన్ మసూద్ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ఓటింగ్ ప్రచారం చేయించిన వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అంశంపై తమిళనాడు తెలుగు యువశక్తి చేసిన ఫిర్యాదుపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) వేగంగా స్పందించి, తక్షణ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌ను అధికారికంగా ఆదేశించింది.

అసలేం జరిగింది?

నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ జూనియర్ కళాశాల తరగతి గదిలో బిగ్ బాస్ తెలుగు సీజన్-10 కంటెస్టెంట్ అమన్ మసూద్ విద్యార్థులతో సంభాషిస్తూ.. ‘జియోహాట్‌స్టార్ (JioHotstar)లోకి లాగిన్ అయ్యి అమన్ మసూద్‌కు ఓటు వేయండి’ అంటూ ప్రచారం చేసిన దృశ్యాలు, ఫొటోలు ఒక తెలుగు వెబ్‌సైట్‌తో పాటు నెట్టింట వైరల్ అయ్యాయి. పాఠాలు వినాల్సిన క్లాస్‌రూమ్‌లలో ఇలాంటి వాణిజ్య వినోద ప్రచారాలు జరగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.


పీఎంవో, కేంద్ర మంత్రులకు కేతిరెడ్డి ఫిర్యాదు!

ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ, కేంద్ర మహిళా-శిశు సంక్షేమ శాఖ (WCD), జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR)కు లిఖితపూర్వకంగా అధికారిక ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘విద్యాసంస్థలను వాణిజ్య వినోద కార్యక్రమాల ఓటింగ్ ప్రచారానికి ఉపయోగించడం, పాఠశాలలు-కళాశాలల్లో చదువుతున్న మైనర్ విద్యార్థులను ఇలాంటి ప్రచారాల్లో భాగస్వాములను చేయడం బాలల హక్కులను కాలరాయడమే. బాలల హక్కుల పరిరక్షణ చట్టం (CPCR Act, 2005), జువెనైల్ జస్టిస్ చట్టం (JJ Act, 2015) నిబంధనలను ఇది పూర్తిగా ఉల్లంఘించడమే అవుతుంది. కళాశాల ప్రాంగణంలోకి వెళ్లి వాణిజ్య ఓటింగ్ అడగడానికి అసలు ఎవరు అనుమతి ఇచ్చారు? మైనర్ విద్యార్థుల తల్లిదండ్రులకు దీనిపై సమాచారం ఉందా? చట్టబద్ధమైన విద్యా ప్రాంగణాన్ని ప్రచార వేదికగా ఎలా మారుస్తారు?’’ అని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

నల్గొండ కలెక్టర్‌కు NCPCR కీలక ఆదేశాలు!

కేతిరెడ్డి చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) రిజిస్ట్రార్ డాక్టర్ సుధా చౌదరి.. నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌కు అధికారికంగా ఉత్తర్వులు (File No.: TL-EBN 105730/2026-27/NCPCR/EDU) జారీ చేశారు.


ఈ ఉత్తర్వుల్లో కమిషన్ ప్రధానంగా పేర్కొన్న అంశాలు:

ప్రభుత్వ విద్యాసంస్థలో బిగ్ బాస్ తెలుగు సీజన్-10 కంటెస్టెంట్ తరఫున జియోహాట్‌స్టార్ ద్వారా ఓట్లు వేయాలని విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రచారం జరిగిందన్న ఫిర్యాదును కమిషన్ సుమోటోగా స్వీకరించింది.

పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులను, ముఖ్యంగా మైనర్లను ఇలాంటి ప్రచారాల్లోకి దింపడం, దీనికి తల్లిదండ్రుల లేదా యాజమాన్య అనుమతులు ఉన్నాయా అన్న అంశాలను నిశితంగా పరిశీలించాలి.

విద్యాసంస్థల యాజమాన్యాలు ఇలాంటి అనుచిత సంఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.

కమిషన్ జారీ చేసిన ‘‘స్కూళ్లలో బాలల భద్రత, రక్షణ నియమావళి’’ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి.

ఈ ఫిర్యాదుపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, బాధ్యులపై తీసుకున్న చట్టపరమైన చర్యల వివరాలను కమిషన్‌తో పాటు ఫిర్యాదుదారుడికి తక్షణమే నివేదించాలి.

నిష్పక్షపాత విచారణ జరపాలి: కేతిరెడ్డి డిమాండ్

ఈ ఆదేశాలపై కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం, NCPCR తక్షణమే స్పందించి ఆదేశాలు జారీ చేయడం బాలల హక్కుల పరిరక్షణ దిశగా వచ్చిన గొప్ప ఫలితమని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలలు విద్యార్థుల జ్ఞానార్జనకు, వ్యక్తిత్వ వికాసానికి వేదికలుగా ఉండాలి తప్ప, టీవీ షోల రేటింగులు, రియాలిటీ షోల ఓటింగ్ ప్రచార కేంద్రాలుగా మారకూడదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు కళాశాల రికార్డులు, సీసీటీవీ దృశ్యాలు, ఇచ్చిన అనుమతులపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం విద్యాశాఖతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి:

ఒకే వేదికపై రణ్‌బీర్ - రాకింగ్ స్టార్ యశ్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

చార్ట్‌బస్టర్‌గా.. ‘రాయవలస’లోని ‘రింగుడు రింగుడు పిల్ల’

Jailer 2: సంతానం సీన్లన్నీ ఔట్.. విజయ్ సేతుపతి పాత్ర ‘జైలర్ 3’కి లీడ్..

Updated Date - Oct 14 , 2026 | 09:16 PM

మరో లక్కీ ఛాన్స్ పట్టేసిన రుక్మిణీ వసంత్..

DC Movie: ఓటీటీలోకి ‘DC’.. స్ట్రీమింగ్‌ .. ఎప్పుడు.. ఎక్కడంటే..

నిషా నూర్ జీవితం ఆధారంగా... ‘ది డర్టీ పిక్చర్ 2’

అగ్నిసాక్షి హీరోయిన్ ఐశ్వర్య విడాకులు..

శ్రీవారి సేవలో విజయ్- రష్మిక..