నిషా నూర్ జీవితం ఆధారంగా... ‘ది డర్టీ పిక్చర్ 2’
ABN , Publish Date - Oct 13 , 2026 | 12:50 PM
ఏక్తా కపూర్ ‘ది డర్టీ పిక్చర్ 2’ సీక్వెల్‌ను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా, తృప్తి డిమ్రీ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే నటీనటుల వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
దాదాపు ఒకటిన్నర దశాబ్దం క్రితం విడుదలైన 'ది డర్టీ పిక్చర్'ను ఎవరూ అంత తేలికగా మర్చిపోరు. ఎందుకంటే అది సెక్సీ క్వీన్ సిల్క్ స్మిత బయోపిక్. ఏక్తాకపూర్ నిర్మించిన ఈ సినిమాలో సిల్క్ స్మిత పాత్రను విద్యాబాలన్ పోషించింది. ఆ పాత్రకు గానూ ఆమెకు ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు దక్కింది. ఇమ్రాన్ హష్మీ, నసీరుద్దీన్ షా, తుషార్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను మిలన్ లుధ్రియా తెరకెక్కించారు.
విశేషం ఏమంటే ఈ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నట్టుగా ఓ ఇంటర్వ్యూలో ఏక్తా కపూర్ తెలిపింది. తాను ప్రొడ్యూస్ చేయబోతున్న అతి పెద్ద ప్రాజెక్ట్ 'ది డర్టీ పిక్చర్ 2' అని, ఈసారి ప్రేక్షకులకు చెప్పడానికి తన దగ్గర సరైన కథ ఉంద'ని ప్రకటించింది. అయితే ఇప్పుడీ సీక్వెల్ లో సిల్మ్ స్మితపై ఉండదని అంటున్నారు. చిత్రసీమలో మహిళల పట్ల ఉన్న వివక్ష, వారిపై జరుగుతున్న లైంగిక వేధింపుల నేపథ్యంలో ఈ సీక్వెల్ సాగుతుందని తెలుస్తోంది. ఏక్తా కపూర్ 'ది డర్టీ పిక్చర్' సీక్వెల్ నిర్మిస్తానని చెప్పిన దగ్గర నుంచి ఇందులో హీరోయిన్ గా ఎవరు నటించే ఆస్కారం ఉందనే ఆలోచన చాలామంది చేస్తున్నారు.
అందులో ప్రధానంగా మిల్కీ బ్యూటీ తమన్నా పేరు గట్టిగా వినిపిస్తోంది. ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ తమన్నాకు స్టార్ హీరోయిన్ గుర్తింపు ఉంది. ఆమెను ఈ సినిమాలో తీసుకుంటే ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో దానిని రిలీజ్ చేయొచ్చు. పైగా తమన్నా ఇప్పుడు సినిమాల్లో చేస్తున్న ఐటమ్ సాంగ్స్ కారణంగా ఆమెకు ఓ సరికొత్త ఇమేజ్ క్రియేట్ అయ్యింది. ఆ ఇమేజ్‌ను క్యారీ చేస్తూ 'ది డర్టీ పిక్చర్ 2' ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో 'యానిమల్' ఫేమ్ తృప్తి డిమ్రీ పేరు కూడా వినిపిస్తోంది. 'ది డర్టీ పిక్చర్'కు సీక్వెల్ తీయబోతున్నానని ఏక్తా కపూర్ తెలిపింది కానీ అందులో నటించే నటీనటుల వివరాలు, దర్శకుడు, ఇతర టెక్నీషియన్స్ పేర్లను ఆమె ప్రకటించలేదు.
గ్లామర్ క్వీన్ నిషా నూర్ జీవిత ఆధారంగా...
ఇదిలా ఉంటే... ఏక్తా కపూర్ ఈసారి తెరకెక్కించబోతోంది ఒకప్పటి గ్లామర్ క్వీన్ నిషా నూర్ జీవిత కథ అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎనభైవ దశకంలో మలయాళ, తమిళ సినిమాల్లో నిషా నూర్ ఒక వెలుగు వెలిగింది. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్స్ సినిమాల్లో ఆమె కీలక పాత్రలు పోషించింది. అయితే ఒకానొక సమయంలో సినిమాలు అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె ఓ నిర్మాత ఒత్తిడి మేరకు వ్యభిచార కూపంలోకి దిగిపోయింది.

వ్యక్తిగత సమస్యలతో పాటు, ఆర్థిక అవసరాలు ఆమెను ఆ నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ఎయిడ్స్ వ్యాధి సోకిందని, ఆ కారణంగా 2007లో అత్యంత దయనీయ పరిస్థితిలో కన్నుమూసిందని సినిమా వర్గాలు చెబుతుంటాయి. ఆమె జీవిత కథనే ఏక్తా కపూర్ సినిమా తీయబోతోందని కొందరంటున్నారు. కానీ గ్లామర్ హంగులకు ప్రాధాన్యమిచ్చే ఏక్తా కపూర్ ఇలాంటి దయనీయ గాథను అదే తరహాలో తెర మీదకు తీసుకొస్తుందా? లేక నిషా నూర్ జీవితంలోని కొన్ని అంశాలనే ఉపయోగించుకుంటుందా అనేది కూడా వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
OTT This Week: ఈ వారం కొత్తగా ఓటీటీకి వచ్చిన, రాబోతున్న సినిమాల జాబితా
సీఎం విజయ్ ని కలిసిన రౌడీ విజయ్..
బన్నీ-లోకేష్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజం ఇదే