భాగ్యశ్రీ బోర్సే సీక్రెట్ టాలెంట్.. నెట్టింట వైరల్
ABN, Publish Date - Nov 05 , 2026 | 03:55 PM
భాగ్యశ్రీ బోర్సే.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ యంగ్ సెన్సేషన్.. ఇప్పుడు వరుస క్రేజీ ప్రాజెక్టులతో టాలీవుడ్లో దూసుకుపోతోంది.
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse).. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ యంగ్ సెన్సేషన్.. ఇప్పుడు వరుస క్రేజీ ప్రాజెక్టులతో టాలీవుడ్లో దూసుకుపోతోంది. ఇటీవల వచ్చిన ‘లెనిన్’ చిత్రం సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఒక ఆసక్తికరమైన రహస్యాన్ని పంచుకున్నారు. ఇప్పటివరకు తెరపై గ్లామరస్ హీరోయిన్‌గానే కనిపించిన భాగ్యశ్రీ.. తనలో దాగివున్న ఓ సరికొత్త కళాత్మక కోణాన్ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. తనలో ఉన్న సీక్రెట్ టాలెంట్‌ని పంచుకుంటూ.. ఎక్స్ వేదికగా ఆమె ఓ ఎమోషనల్ నోట్‌ను షేర్ చేశారు. తనకు కవిత్వం రాయడం అంటే ఎంతో ఇష్టమని, తాను ఒక పోయెట్ అనే విషయాన్ని ఈ పోస్ట్‌లో ఆమె వెల్లడించారు.
‘‘ఇన్నాళ్లూ మీ అందరి నుంచి దాచిన ఆ సీక్రెట్‌ను ఇప్పుడు బయటపెట్టే సమయం వచ్చింది. నా జీవితంలో నాకోసమే ప్రత్యేకంగా దాచుకున్న ఓ చిన్న భాగమే.. నా కవిత్వం. అవును, నేను కవితలు రాస్తాను.. నా స్నేహితుల దగ్గర నన్ను నేను గర్వంగా ఓ కవయిత్రిగా చెప్పుకుంటాను. జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితుల్లోనే ఈ ప్రతిభను నేను సహజంగా కనుగొన్నాను. రాయడం వల్ల నా మనసు ప్రశాంతంగా మారింది, ఆలోచనల్లో స్పష్టత వచ్చింది, జీవితంలోని అసలైన అందాన్ని చూడగలిగాను’’ అని భాగ్యశ్రీ పేర్కొన్నారు.
అయితే తను రాసిన కవితలను పంచుకోవడానికి సంకోచిస్తున్నానని తెలుపుతూ, అందుకు కారణం కూడా వివరించారు. ‘‘మరి ఆ కవితలను మాతో ఎందుకు షేర్ చేయకూడదు? అని మీరు అడగొచ్చు. బహుశా ఎప్పుడైనా షేర్ చేయొచ్చు, లేదా చేయకపోవచ్చు. ఎందుకంటే, నా జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని బయటి ప్రపంచం ప్రశంసించడమో, విమర్శించడమో చేస్తుంది.. అది నేను ఎదుగుతున్నాననే భావన కలిగిస్తుంది. కానీ కవిత్వం అనేది నా హృదయ స్పందన. నేను కవితలు రాసేటప్పుడు ఈ ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయి, నా మనసు చెప్పే మాటే వినాలనుకుంటాను. నేను నిజంగా ఎవరిని అనేది నాకు గుర్తుచేసేది అదే. ఎప్పటికైనా బయటకు చెప్పలేని ఆ భావాలను కవితల రూపంలో మీ ముందుకు తీసుకొస్తానేమో.. అంతవరకు మీ పట్ల, ఇతరుల పట్ల దయతో, ప్రేమతో ఉండండి’’ అంటూ భాగ్యశ్రీ చెప్పుకొచ్చారు.
భాగ్యశ్రీ బోర్సే చేసిన ఈ పోస్ట్‌కు.. గ్లామరస్ హీరోయిన్లో ఇంతటి సున్నితమైన రచయిత్రి, లోతైన ఆలోచనలు ఉన్నాయా? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. భాగ్యశ్రీ ఆలోచనా విధానాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు ఆమె పోస్ట్‌పై లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె రాసిన ఈ భావోద్వేగ లేఖ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
ఇంతింతై వటుడింతై.. నెల్సన్ గ్రాఫ్ చూశారా
అది ధైర్యం కాదు.. నార్త్ భామలకు పాయల్ రాజ్‌పుత్ కౌంటర్
Last Man in Tower: ఒక్కడే అందరినీ ఎదుర్కొంటే.. ఓటీటీకి అదిరిపోయే ఎమోషనల్ డ్రామా