Maa Inti Bangaram Movie Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ

ABN , Publish Date - Jun 19 , 2026 | 01:32 PM

సమంత టైటిల్‌ రోల్ ప్లే చేసి ప్రొడ్యూస్ చేసిన సినిమా 'మా ఇంటి బంగారం'. బి.వి. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ శుక్రవారం జనం ముందుకు వచ్చింది.

Maa Inti Bangaram

సమంత (Samantha) హీరోయిన్‌గా నటించిన 'ఖుషీ' (Khushi) సినిమా విడుదలై దాదాపు మూడేళ్ళు గడిచిపోయింది. ఈ మధ్య కాలంలో ఆమె జీవితం ఊహకందని మలుపులు తిరిగింది. సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలను ప్రారంభించి, గత యేడాది 'శుభం' (Subham) సినిమా నిర్మించింది సమంత. ఇప్పుడు తన భర్త రాజ్ నిడుమోరు (Raj Nidumoru) తో కలిసి 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) మూవీని ప్రొడ్యూస్ చేసి, తనే టైటిల్‌ రోల్ ప్లే చేసింది. ఇప్పటికే సమంతతో 'జబర్దస్త్, 'ఓ బేబీ' (Oh Baby) చిత్రాలు రూపొందించిన నందినీ రెడ్డి (Nandini Reddy) తెరకెక్కించిన 'మా ఇంటి బంగారం' ఎలా ఉందో తెలుసుకుందాం.


అనాథ అయిన సువర్ణ (సమంత) డాక్టర్ అనిరుథ్‌ (దిగంత్‌ Diganth Manchale)ను పెళ్ళి చేసుకుంటుంది. పెద్దవాళ్ళ అనుమతి లేకుండా సువర్ణను వివాహం చేసుకున్న అనిరుథ్‌ తన చెల్లెలి పెళ్ళి కోసం తమ్ముడి కోరిక మేరకు మూడేళ్ళ తర్వాత భార్యతో కలిసి సొంతూరు వస్తాడు. పెళ్ళి పూర్తయ్యే లోపు అత్తవారింటి నుంచి మంచి మార్కులు పొంది ఆ కుటుంబానికి చేరువ కావాలన్నది సువర్ణ కోరిక. ఇటువంటి సమయంలో సువర్ణ గతం తెలిసిన ఓ వ్యక్తి ఆమెను గుర్తుపట్టి జైలులో ఉన్న తీవ్రవాది కరుణ (గుల్షన్ దేవయ్య Gulshan Devaiah )కు సమాచారం చేరవేస్తాడు. తనది అనుకున్న సువర్ణ చేజారిపోతోందని తెలిసిన కరుణ జైలు నుండి తప్పించుకుని ఆమె అత్తగారింటికి వచ్చి ఏం చేశాడు? తన గతాన్ని దాచిపెట్టిన సువర్ణ ఎలా ఈ సమస్య నుంచి బయటకు వచ్చింది? రాజకీయ నేపథ్యం కలిగిన అనిరుథ్‌ తండ్రి రామయ్య రాజు (ఆనంద్‌)కి స్థానిక రాజకీయ నాయకుడు మధుసూదనరావు (వడ్లమాని సాయి శ్రీనివాస్‌)తో ఏర్పడిన వైరం ఎటువంటి స్పర్థలకు దారితీసింది? అసలు సువర్ణ గతం ఏమిటీ? అనేది మిగతా కథ.

ఊహకందని గతాన్ని కలిగిన ఓ అమ్మాయి, కోడలుగా అత్తవారింటిలోకి అడుగుపెట్టి 'మా ఇంటి బంగారం' అని ఎలా అనిపించుకుందన్నది ఇందులోని ప్రధానాంశం. అమాయకురాలిగా సువర్ణ పాత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన దర్శకురాలు నందినీ రెడ్డి ఆమెలోని మరో యాంగిల్‌ను సందర్భానుసారంగా పరిచయం చేస్తూ ప్రేక్షకులను సంభ్రమకు గురిచేయాలని భావించారు. గతాన్ని సాకుగా చూపి తన దారిలోకి తెచ్చుకోవాలనుకున్న విలన్‌ నుంచి ఆమె తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుందనేది నందినీ రెడ్డి ఆసక్తికరంగా తెరకెక్కించ లేకపోయారు. ప్రధానాంశానికి స్థానిక రాజకీయాల రొచ్చును కలపాలని చూశారు కానీ అది అతకలేదు. ఇన్నింటి మధ్య సమంత పాత్రను ఎలివేట్ చేయాలనుకున్న మేకర్స్... ఆ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారు.


నటీనటుల విషయానికి వస్తే... గత యేడాది 'శుభం'లో అతిథిపాత్రలో చాలా పీలగా అనిపించిన సమంత... ఇందులో ఎనర్జిటిక్‌గా కనిపించింది. యాక్షన్ సన్నివేశాలనూ బాగా చేసింది. ఇది సమంత వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఇతర ప్రధాన పాత్రల్లో కాస్తంత అతిగా ఉన్నా గుల్షన్ దేవయ్య మెప్పించాడు. సమంత భర్తగా దిగంత్‌ అంతగా ఆనలేదు. ఆమె తోడికోడలుగా శ్రీముఖి, మరిదిగా చైతన్య కృష్ణ చక్కగా నటించారు. సమంత అత్తమామలుగా గౌతమి (Gowthami), ఆనంద్‌ సరిగ్గా సరిపోయారు. ఇతర ప్రధాన పాత్రలను శ్రీలక్ష్మీ, గవిరెడ్డి శ్రీనివాస్‌, వడ్లమాని సాయి శ్రీనివాస్‌, నిశాంతి తదితరులు పోషించారు. సూర్యకాంతం, ఛాయాదేవి, నిర్మలమ్మ మేనరిజంను రీల్స్ చేసి వ్యూవర్స్ ను ఆకట్టుకుంటున్న మంజూష (Manjusha Mukkavilli) ఇందులో సమంత స్నేహితురాలిగా నటించి, మెప్పించింది. సంతోష్‌ నారాయణన్ (Santhosh Narayanan) సమకూర్చిన స్వరాలు, నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. బాపు 'ముత్యాలముగ్గు'లోని టైటిల్‌సాంగ్‌ను సందర్భానుసారం వాడుకోవడం హైలైట్‌గా నిలిచింది. 'ఓ బేబీ' తర్వాత సమంత, నందినీరెడ్డి కాంబోతో తెరకెక్కిన మూవీ కావడం, రిలీజ్ కు ముందు వచ్చిన ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉండడంతో 'మా ఇంటి బంగారం'పై అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఆ స్థాయిలో సినిమా లేకపోవడం కొంత నిరాశకు గురిచేస్తుంది. అయితే థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు మాత్రం 'ఓకే బంగారం' అని సర్దుకు పోవచ్చు.

ట్యాగ్‌ లైన్: ఓకే బంగారం!

రేటింగ్‌: 2.75/5

ఇవి కూడా చదవండి

Vanda Devullu Movie Review: వంద దేవుళ్ళు మూవీ రివ్యూ

Tamannaah Bhatia: తమన్నా.. నో అంటే నో అంతే..

Updated Date - Jun 19 , 2026 | 02:37 PM

Maa Inti Bangaaram: స‌మంత దూకుడు.. తగ్గేదే లే అంటున్న 'బంగారం'

Maa Inti Bangaram: వెనక్కి తగ్గిన సమంత!

Maa Inti Bangaram Trailer: కొత్త కోడలి విశ్వరూపం.. అదిరిపోయింది బంగారం

Maa Inti Bangaram: వామ్మో.. వామ్మో.. స‌మంత‌ ఈ కొత్త యాంగిల్ ఏంటి! ఇద‌స‌లు.. ఊహించ‌లా!

Maa Inti Bangaram: ఫైనల్‌గా నందినీరెడ్డితోనే షూరు అయింది..