Maa Inti Bangaaram: సమంత దూకుడు.. తగ్గేదే లే అంటున్న 'బంగారం'
ABN , Publish Date - Jan 07 , 2026 | 10:28 AM
సమంత తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' షూటింగ్ శరవేగంతో సాగుతోంది. సంక్రాంతి సీజన్ లోనే ఈ సినిమా ప్రమోషన్స్ కూ మేకర్స్ శ్రీకారం చుట్టేస్తున్నారు.
కాస్తంత ఆలస్యం కావచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అన్నట్టుగా ఉంది స్టార్ హీరోయిన్ సమంత (Samantha) వ్యవహారం. రాజ్ నిడిమోరు (Raj Nidimoru) ను వివాహం చేసుకుని మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చిన సమంత గతంలో ప్రారంభించిన 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) ను ఇటీవల పట్టాలెక్కించేసింది. నందినీ రెడ్డి (Nandini Reddy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్స్ కు వెళ్ళడమే కాదు.. షూటింగ్ ను సైతం శరవేగంతో పూర్తి చేసుకుంటోంది. ఎందుకంటే సంక్రాంతి సీజన్ లోనే 'మా ఇంటి బంగారం' ప్రచారానికి మేకర్స్ శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ సినిమాలోని సమంత లుక్ ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ ను వదిలి... టీజర్ ట్రైలర్ ను జనవరి 9వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. 'మీరు చూస్తా ఉండండి... మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది' అని ఆ పోస్టర్ పై పేర్కొన్నారు.
వ్యక్తిగత, ఆరోగ్యపరమైన ఇబ్బందుల కారణంగా నటిగా కాస్తంత వెనకబడ్డ సమంత నిర్మాతగా తన దూకుడు ప్రదర్శించడం మొదలెట్టింది. 2025లో 'శుభం' (Subham) పేరుతో ఓ చిన్న సినిమాను సొంత బ్యానర్ లో నిర్మించి, మంచి హిట్ కొట్టింది. అందులో అతిథి పాత్రలో మెరిసిన సమంత ఇప్పుడు తన హోమ్ ప్రొడక్షన్ లోని రెండో సినిమా 'మా ఇంటి బంగారం'లో టైటిల్ రోల్ ను ప్లే చేస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఓంప్రకాశ్ సినిమాటోగ్రాఫర్. సమంతతో పాటు దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుల ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సమంత, రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'జబర్ధస్త్, ఓ బేబీ' తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది.