Maya Lady Movie Review: మాయ లేడి ఎలా ఉందంటే...
ABN, Publish Date - Nov 13 , 2026 | 04:08 PM
రాకేశ్ వర్రే హీరోగా నటించి నిర్మించిన ‘మాయలేడి’ సినిమా ఎలా ఉంది? స్ప్లిట్ పర్సనాలిటీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్‌లో మధుమిత సర్కార్, సత్య నటన ఎలా ఉంది? సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? రివ్యూలో తెలుసుకోండి.
'జితేందర్‌రెడ్డి' బయోపిక్ లో నటించిన రాకేశ్ వర్రే... దానికి ముందు 'ఎవరికీ చెప్పొద్దు' సినిమాలో హీరోగా నటించి, నిర్మించాడు. అలానే 'పేకమేడలు' చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. ఇప్పుడు కాస్తంత గ్యాప్ తీసుకునే తనే హీరోగా ప్రశంకర్ దర్శకత్వంలో 'మాయలేడి' మూవీని ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమాతో మధుమిత సర్కార్ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మరి 'మాయలేడి' ప్రేక్షకులను మాయ చేసిందో లేదో తెలుసుకుందాం.
క్రిష్ (రాకేశ్ వర్రే) తన తల్లి ఇందిర (మధురిమ) పేరుతో వైజాగ్‌లో సెల్ఫ్ డిఫెన్స్ సెంటర్ నిర్వహిస్తుంటాడు. వినయ్ (సత్య) అతని భార్య ఇద్దరూ అందులో ఇన్ స్ట్రక్టర్స్ గా వర్క్ చేస్తుంటారు. ఒక కేసులో దోషులను పట్టించేందుకు అవసరమైన వీడియోను కోర్టులో ప్రెజెంట్ చేసిన ఆశ (మధుమిత సర్కార్)ను చూసి తొలిచూపు ప్రేమలో పడిపోతాడు క్రిష్. ఆ తర్వాత ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి ఇంప్రస్ అవుతాడు. ఆమెను క్రిష్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న సమయంలో ఓ రోజు ఆశ పబ్‌లో కనిపిస్తుంది. అయితే ఆమె ఆశ చెల్లెలు రూప అని, వీరిద్దరూ ట్విన్ సిస్టర్స్ అని తెలుస్తుంది. క్రిష్ ఆశను ప్రేమిస్తున్నాడని తెలిసి రూప వైలెంట్‌గా ప్రవర్తిస్తుంది. తనను కాకుండా వేరెవరిని ప్రేమించినా ఊరుకునేది లేదని క్రిష్‌కు వార్నింగ్ ఇస్తుంది. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్ళలో ఎవరి వైపు మొగ్గు చూపాలో తెలియక క్రిష్ తికమక పడతాడు. అసలు రూప, ఆశ ట్విన్ సిస్టర్సేనా? మరి అలాంటప్పుడు వారి ఆలోచనల తీరులో అంత వ్యతాసం ఎందుకు ఉంది? వీరి కారణంగా క్రిష్ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? అనేది మిగతా కథ.
రాకేశ్ వర్రే సోలో హీరోగా మారకముందే కొన్ని సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఆ తర్వాత హీరోగా చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కావడం లేదు. రొటీన్ కు భిన్నమైన కథాంశాలను ఎంపిక చేసుకుని నిర్మాతగానూ రాకేశ్ వర్రే సినిమాలు తీస్తున్నాడు కానీ అవీ అతనికి చేదు అనుభవాలనే మిగుల్చుతున్నాయి. ఇది కూడా ఆ కోవకు చెందిన సినిమానే. స్ప్లిట్ పర్సనాలిటీని బేస్ చేసుకుని తెరకెక్కిన సినిమా ఇది. ఇంటర్వెల్ లో వచ్చిన ట్విస్ట్ తర్వాత ప్రతి ఒక్కరికీ 'అపరిచితుడు, చంద్రముఖి' చిత్రాలు గుర్తొస్తాయి. దర్శకుడు కూడా దాన్ని గెస్ చేసే ఇంటర్వెల్ తర్వాత సత్య నోటితో ఆ రెండు సినిమాలను ఉదహరించారు. తమ మీద తాము ప్రాక్టికల్ జోక్ వేసుకోవడం బాగానే ఉంది కానీ... ఆశ - రూప పాత్రలను హీరోయిన్‌తో ప్రెజెంట్ చేయించిన తీరు ప్రేక్షకుల సహనాన్ని పరీక్ష పెడుతుంది. తెర మీద కనిపించేది ఎవరో తెలియక ఏర్పడే తికమక కారణంగా కథ లోతుల్లోకి కూడా ప్రేక్షకుడు వెళ్ళలేకపోతాడు. సినిమా ఇంకా పూర్తి కాదేమిటిరా బాబూ! అని అనిపించేలా చేశారు. అదృష్టం ఏమంటే... ఈ మధ్య ఇలాంటి ప్రతి థ్రిల్లర్ సినిమాకూ సీక్వెల్ ఉందంటూ హింట్ ఇస్తున్నారు. కానీ ఆ పని మేకర్స్ చేయకపోవడం పెద్ద రిలీఫ్!
నటీనటుల విషయానికి వస్తే రాకేశ్ వర్రే సెల్ఫ్ డిఫెన్స్ ఇన్ స్ట్రక్టర్ గా బాగానే నటించాడు. కానీ నటనలో ఇంకా పరిణితి చెందాలి. అతని పక్కన హీరోయిన్గా మధుమిత సర్కార్ తేలిపోయింది. ఇటు అమాయకత్వం, అటు ఆవేశం ప్రదర్శించడంలో మెప్పించలేకపోయింది. ఆ పాత్రకు ఆమె సెట్ కాలేదు. హీరో తల్లిదండ్రులుగా సురేశ్, మధురిమ నటించారు. సైకియాట్రిస్ట్ పాత్రను ఇంద్రజ హుందాగా పోషించింది. హీరో స్నేహితుడిగా సత్య, అతని భార్యగా లావణ్యరెడ్డి నటించారు. సత్య లేకుండా సినిమాను ఊహించుకోలేం. అతను పండించిన వినోదమే సినిమాకు పెద్ద రిలీఫ్. 'పేకమేడలు' సినిమాలో హీరోగా నటించిన వినోద్ కిషన్ హీరోయిన్ తండ్రిగా కీలక పాత్రను పోషించాడు. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం ఓకే. రెండు మెలోడీ సాంగ్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలోనే కాకుండా, పబ్లిసిటీ చేయడంలోనూ రాకేశ్ వర్రే రాజీ పడలేదు. కానీ దర్శకుడు ప్రశంకర్ మాత్రం థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఈ సినిమాను థియేటర్లో కంటే ఓటీటీలో వచ్చినప్పుడు చూడటం బెటర్!
రేటింగ్: 2/5
ట్యాగ్ లైన్: అంతా మాయే!
ఇవి కూడా చదవండి:
Goat Movie Review: సుడిగాలి సుధీర్ గోట్ మూవీ రివ్యూ
Itlu Arjuna Review: 'ఇట్లు అర్జున' ఎలా ఉందంటే
DNK Review: మౌళి తనూజ్.. డీఎన్‌కే సినిమా రివ్యూ!