మంచు మనోజ్ కంపెనీ భారీ ప్లాన్.. రూ.40 కోట్లతో రెండు బొమ్మల తయారీ యూనిట్లు!
ABN , Publish Date - Nov 13 , 2026 | 08:33 AM
సినీనటుడు మంచు మనోజ్‌కు చెందిన నమస్తే వరల్డ్ సంస్థ రూ.40 కోట్లతో విశాఖపట్నం, ఎమ్మిగనూరులో బొమ్మల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనుంది.
సినీనటుడు మంచు మనోజ్ (Manchu Manoj) కు చెందిన సంస్థ బొమ్మల (Kondapalli Toys) తయారీ రంగంలో మరింత విస్తరణకు సిద్ధమైంది. సంప్రదాయ బొమ్మల తయారీకి ప్రసిద్ధి చెందిన కొండపల్లి, ఏటికొప్పాక (Etikoppaka Toys) తరహాలో ఆధునిక యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం (Andhra Pradesh Investments) కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో బొమ్మల తయారీ రంగానికి మరింత ప్రోత్సాహం లభించడంతో పాటు వందలాది మందికి ఉపాధి అవకాశాలు అందనున్నాయి.
'నమస్తే వరల్డ్ (Namaste World) పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తయారవుతున్న బొమ్మలను దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ఈ వ్యాపారాన్ని మరింత ఆధునీకరించి, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో కొత్త యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా విశాఖపట్నం, కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో రెండు తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.
ఈ రెండు యూనిట్ల కోసం మొత్తం రూ.40 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. నిర్మాణాలు పూర్తయి ఉత్పత్తి ప్రారంభమైతే సుమారు 950 మందికి ఉపాధి లభించనుంది. స్థానికంగా బొమ్మల తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడనుంది. ఈ ఒప్పంద కార్యక్రమానికి సినీనటుడు మంచు మనోజ్‌తో పాటు ఆయన భార్య మౌనిక కూడా హాజరయ్యారు. సంప్రదాయ కళలకు ఆధునిక సాంకేతికతను జోడించి బొమ్మల తయారీని మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఈ సంస్థ ముందుకు సాగుతోంది.