సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘ఆకాశంలో ఒక తార’ మూవీ రివ్యూ.. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి సినిమా ఎలా ఉందంటే?

ABN, Publish Date - Nov 20 , 2026 | 07:12 AM

దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమా ప్రేక్షకులకు స్ఫూర్తిదాయకమైన అనుభూతిని అందిస్తుంది. కల్పనా చావ్లా జీవితం నుంచి ప్రేరణ పొందిన ఈ చిత్రానికి పవన్ సాదినేని దర్శకత్వం వహించారు. సినిమా కథ, నటీనటుల ప్రదర్శన, సాంకేతిక అంశాలు ఎలా ఉన్నాయంటే?

Aakasamlo oka tara movie

సహజంగా సినిమా లక్ష్యం ఏమై ఉండాలి? రెండున్నర గంటల పాటు సమయాన్ని, డబ్బుని వెచ్చించి థియేటర్‌కు వెళ్ళిన ప్రేక్షకుడు తన బాధలను మర్చిపోయి హాయిగా ఆ సినిమాను ఆస్వాదించాలి లేదా తెర మీద కనిపించే పాత్రలతో మమేకమై, ఓ గొప్ప అనుభూతికి లోనై, జీవితం పట్ల సానుకూల భావనను మనసులో నింపుకుని థియేటర్ నుంచి బయటకు రావాలి. ఆ రకంగా చూసినప్పుడు శుక్రవారం జనం ముందుకు వచ్చిన 'ఆకాశంలో ఒక తార' అలాంటి గొప్ప అనుభూతిని, మానసిక సంతృప్తిని కలిగించే సినిమా.

బస్సు వెళ్ళడానికి సరైన రోడ్డు కూడా లేని ఓ చిన్న గ్రామంలో పుట్టిన అమ్ములు/ కల్పన (సాత్విక వీరవల్లి) తన స్కూల్‌లో జరిగిన ఓ ఎగ్జిబిషన్‌లో అంతరిక్షం గురించి తెలుసుకుంటుంది. తానూ ఎప్పటికైనా అంతరిక్షానికి చేరుకోవాలని కలలు కంటుంది. ఆ సమయంలో ఆమె చేతిలోకి వచ్చిన కల్పనా చావ్లా ఫోటోను గుండెల్లో దాచుకుంటుంది. కుటుంబం పట్ల బాధ్యతలేని ఆమె తండ్రి (కోట జయరాం) పదహారేళ్ళ వయసులోనే అమ్ములును డ్రైవర్‌ అయిన కృష్ణ (దుల్కర్ సల్మాన్‌)కు ఇచ్చి పెళ్ళి చేస్తాడు. అయితే తొలిరాత్రి భార్య మనసులోని మాట తెలుసుకున్న కృష్ణ... ఆమె చిరకాల కోరికను తీర్చడం కోసం ఏం చేశాడు? ఆమెను వ్యోమగామిని చేయడం కోసం ఎలాంటి త్యాగాలకు సిద్థపడ్డాడు? భర్త ఇచ్చిన సహకారంతో అమ్ములు తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంది? అన్నదే 'ఆకాశంలో ఒక తార' సినిమా.


భారతదేశానికి చెందిన వ్యోమగామి కల్పనా చావ్లా జీవితం ఎంత స్ఫూర్తిదాయకమో అంత విషాదాంతం. ఆమె జీవిత కథను చదివి పవన్ సాదినేని ఈ సినిమా కథను రాసుకున్నారు. దానిని అద్భుతంగా తెర మీద ప్రజెంట్‌ చేశారు. ఒక డాక్యుమెంటరీలా కాకుండా భావోద్వేగాలను చక్కగా దీనికి అద్దారు. సినిమా ప్రారంభమే గుజరాత్‌లో మొదలౌతుంది. అక్కడి మైనింగ్‌లో పనిచేసే కృష్ణకు మెస్‌లో వంట చేసే బిజిలి (రుహానీ శర్మ) భాష నేర్పే విషయంలో సాయం చేస్తుంది. తన పట్ల ఇష్టాన్ని పెంచుకున్న బిజిలీకి తనకు అప్పటికే పెళ్ళైందని, ఆమె కేరళలో చదువుకుంటోందని అమ్ములు కథను చెబుతాడు కృష్ణ. జీవితంలో ఎప్పుడూ విజయాలే కాదు పరాజయాలు ఉంటాయని చూపుతూ కల్పన టీమ్‌ చేసిన మెషిన్‌ ఫెయిల్‌ కావడంతో విశ్రాంతి పడుతుంది. చేజారిన అవకాశానికి కృంగి పోకుండా ఆమెను కృష్ణ తిరిగి లక్ష్యం వైపు మళ్ళించిన తీరు, అందుకోసం రోహిణి (శ్రుతీహాసన్‌) సాయం తీసుకోవడం ఇదంతా మిగతా కథ. పరాజయాలు పరిహసించినా... పథాన్ని వీడకుండా పట్టుదలతో ముందుకు సాగాలన్నదే ఈ సినిమా చెప్పే పాఠం. ఎక్కడా బోర్‌ అనేది కొట్టకుండా సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ప్రేక్షకులను ఎంగేజ్‌ చేసేలా స్క్రిప్ట్ ను పకడ్బందీగా రాసుకున్నాడు పవన్ సాదినేని. అంతేకాదు... సినిమా ముగింపులోనూ కృష్ణ మాయను చూపాడు. .

నటీనటుల విషయానికి వస్తే... దుల్కర్ సల్మాన్‌కు తెలుగు సినిమా రంగం బాగా కలిసొచ్చింది. ఇక్కడ అతను ఏ సినిమా చేసినా అది చక్కని గుర్తింపును, విజయాన్ని అందిస్తున్నాయి. ఇదీ అదే తరహా సినిమా. భార్య లక్ష్యం కోసం జీవితాన్ని పణంగా పెట్టిన భర్తగా చక్కగా నటించాడు. నిజానికి ఇలాంటి పాత్రలను గతంలో వెంకటేశ్‌, జగపతిబాబు, శ్రీకాంత్‌ వంటి వాళ్ళు చేశారు. కానీ ఈ జనరేషన్‌లో ఇలాంటి పాత్రలు తెర మీద కనిపించడం చాలా రేర్‌ అయిపోయింది. దుల్కర్ లాంటి నటుడు చేయడంతో ఆ పాత్ర బరువూ పెరిగింది. దుల్కర్ అక్కగా స్వాసిక తనదైన శైలిలో అద్భుతంగా నటించి, మెప్పించింది. ప్రథమార్థంలో కథను దర్శకుడు రుహానీశర్మ సాయంతో నడిపిస్తే, ద్వితీయార్థంలో ఆ బాధ్యతను శ్రుతీహాసన్‌ కు అప్పగించారు. రుహానీ శర్మకు ఇది ఇంతవరకూ చేయని కొత్త పాత్ర. బిజిలీ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. శ్రుతీహాసన్‌ కు ఇలాంటివి చేయడం కొట్టిన పిండి. బాగా చేసింది. ఆమెకు సాయం చేసే పాత్రలో చైతన్య జొన్నలగడ్డ చక్కగా సెట్‌ అయ్యారు. ఇతర ప్రధాన పాత్రలను నాజర్‌, గౌతమ్‌ వాసుదేవ మీనన్, మురళీశర్మ, కోట జయరాం, మానసీ సుధీర్‌ పోషించారు. ప్రవీణ్‌, ఆర్జే కాజల్, మహేశ్‌ ఆచంట, కశిరెడ్డి రాజ్ కుమార్‌, వాసు ఇంటూరి ఒకటి రెండు సీన్స్ లో మెరిశారు. వీరంతా ఒక ఎత్తు అయితే...ఈ సినిమాకు తన నటనతో ప్రాణం పోసింది సాత్విక వీరవల్లి. నటిగా ఆమెకు ఇదే మొదటి సినిమా. తెలుగు మూలాలు ఉన్నా... అమెరికాలో స్థిరపడిన ఆమె ఈ సినిమాకు వెన్నెముకగా నిలిచింది. అత్యంత కఠినమైన పాత్రను చాలా అలవోకగా చేసేసింది. ఆ పాత్రలోని భావోద్వేగాలను అద్భుతంగా పండించింది. ఈ సినిమా తర్వాత సాత్విక వీరవల్లి భారతీయ చిత్రాలలో బిజీ కావడం ఖాయం.


సాంకేతిక నిపుణుల్లో అగ్రతాంబూలం సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ కుమార్ కు ఇవ్వాలి. నటుడిగా బిజీగా ఉంటూనే తన క్రాఫ్ట్ కు సంపూర్ణ న్యాయం చేకూర్చాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ మాటలు లేని సమయంలో సన్నివేశాలను ముందుకు తీసుకెళ్ళేవి పాటలే. వాటిని శ్రీమణి చక్కగా రాశాడు. ఇక ప్రముఖ దర్శక నిర్మాత గుణ్ణం గంగరాజు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఆయన సీనియారిటీ ఈ స్క్రీన్ ప్లే రైటింగ్‌లో కనిపించింది. దర్శకుడు ప్రదీప్ సాదినేని రాసిన సంభాషణలు షార్ట్ అండ్ సింపుల్‌గా ఉన్నా... కొన్ని గుండెలోతుల్లోకి వెళ్ళేలా ఉన్నాయి. ప్రదీప్ సాదినేని కథను, కలను వెండితెర మీద ఆవిష్కరించడానికి నిర్మాతలు సందీప్‌ గుణ్ణం, రమ్య గుణ్ణం బాసటగా నిలిచిన తీరుకు అభినందించాలి, వారికి సపోర్ట్ గా నిలిచిన గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ ను కూడా! కుటుంబమంతా కలసి,హాయిగా చూసే సినిమాలు చాలా రేర్‌గా వస్తుంటాయి. అందులో ఇది ఒకటి. రెండున్నర గంటల పాటు వినోదాన్ని పొందాలని కాకుండా స్ఫూర్తిని పొందాలనుకునే ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా 'ఆకాశంలో ఒక తార'.

రేటింగ్‌: 3/5

ట్యాగ్‌ లైన్: అరుదైన తార!

ఇవి కూడా చదవండి:

బోయపాటికి బన్నీ గ్రీన్ సిగ్నల్.. ఈసారి ఊహించని ట్విస్ట్

‘ఆదర్శ కుటుంబం’ టీమ్ పై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు

మిస్కిన్ టచ్‌పై నెటిజన్ కామెంట్.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన కీర్తి సురేష్

Updated Date - Nov 20 , 2026 | 07:20 AM