సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ముంబైలో సంచలనం.. హీరో టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. ఆ గ్యాంగ్ పనేనా?

ABN, Publish Date - Oct 18 , 2026 | 08:46 PM

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఆదివారం సాయంత్రం తీవ్ర కలకలం రేగింది. బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న లగ్జరీ బీఎమ్‌డబ్ల్యూ కారును లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని దుండగులు తుపాకీలతో కాల్పులకు తెగబడ్డారు

Tiger Shroff News

దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) నగరంలో ఆదివారం సాయంత్రం తీవ్ర కలకలం రేగింది. బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) ప్రయాణిస్తున్న లగ్జరీ బీఎమ్‌డబ్ల్యూ కారును లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని దుండగులు తుపాకీలతో కాల్పులకు తెగబడ్డారు. జుహు ప్రాంతంలో జరిగిన ఈ మెరుపు దాడిలో టైగర్ ష్రాఫ్ తృటిలో ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడగా, ఆయన కారు డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. ఈ కాల్పులకు తామే బాధ్యులమంటూ లారెన్స్ బిష్ణోయ్ ముఠా పేరిట సోషల్ మీడియాలో పోస్టులు రావడం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.


పోలీసు వర్గాల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆదివారం సాయంత్రం జుహు పోలీస్ స్టేషన్ పరిధిలోని పుష్ప పార్క్ సమీపంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన అనంతరం టైగర్ ష్రాఫ్ తన బీఎమ్‌డబ్ల్యూ కారులో ఇంటికి బయలుదేరారు. ఆయన కారు బయటకు వస్తున్న సమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా కారును చుట్టుముట్టి దాదాపు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన టైగర్ ష్రాఫ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో టైగర్ ష్రాఫ్ డ్రైవర్‌తో పాటు అక్కడున్న మరో వ్యక్తికి బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను సమీపంలోని నానావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నటుడు టైగర్ ష్రాఫ్‌కు ఎలాంటి గాయాలు కాలేదని, ఆయన పూర్తి క్షేమంగా ఉన్నారని వెస్ట్రన్ రీజియన్ జోన్-1 డీసీపీ మోహిత్ గార్గ్ అధికారికంగా ధ్రువీకరించారు. టైగర్ తండ్రి, సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ బృందం సైతం టైగర్ క్షేమంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఆశిష్ శెలార్ బాధితుడి కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.


ఇదిలా ఉంటే.. ఈ దాడి జరిగిన కొద్దిసేపటికే విదేశాల్లో ఉంటున్న గ్యాంగ్‌స్టర్లు అనిల్ పండిట్, హర్మాన్ సంధు పేరిట సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi Gang) పేరిట టైగర్ ష్రాఫ్‌పై జరిగిన ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. అయితే, ఈ సోషల్ మీడియా పోస్ట్ ఎంతవరకు నిజం? ఇందులో బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం వాస్తవంగా ఉందా? లేదా అనే అంశాలను ముంబై పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. అసలు ఈ దాడి వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటనే దానిపై క్రైమ్ బ్రాంచ్ దృష్టి సారించింది. ఘటనా స్థలాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు జుహు పరిసర ప్రాంతాలను పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ దుండగులను పట్టుకునేందుకు ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో మొత్తం 12 ప్రత్యేక దర్యాప్తు బృందాలను రంగంలోకి దించారు. బాలీవుడ్ స్టార్లను వరుసగా టార్గెట్ చేస్తూ కాల్పులకు తెగబడుతుండటంతో ముంబై చిత్రసీమలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

‘కల్ట్’ ట్రైలర్ రివ్యూ: నెత్తురోడే యాక్షన్.. ఒళ్లు గగుర్పొడిచే వయొలెన్స్

తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్.. ఆ లిస్ట్‌లోకి చేరిన దర్శకుడు

అల్లు అర్జున్, ఎన్టీఆర్ కాంబోలో మల్టీస్టారర్.. దర్శకుడెవరంటే?

Updated Date - Oct 18 , 2026 | 08:46 PM