ఐదు వారాలు... మూడు సినిమాలు!
ABN , Publish Date - Oct 17 , 2026 | 05:05 PM
‘ఫంకీ’ డిజాస్టర్ తర్వాత విశ్వక్ సేన్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అక్టోబర్ 30న ‘కల్ట్’, నవంబర్ 19న ‘ఈఎన్ఈ రిపీట్’, డిసెంబర్ 4న ‘లెగసీ’ విడుదల కానున్నాయి. ఐదు వారాల్లో మూడు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద విశ్వక్ సేన్ సందడి చేయనున్నారు.
ఈ యేడాది ఫిబ్రవరి 13న ప్రేమికుల రోజు కానుకగా విడుదలైన విశ్వక్ సేన్, అనుదీప్ మూవీ 'ఫంకీ' డిజాస్టర్ అయ్యింది. దాంతో అంతా విశ్వక్ సేన్ పనైపోయిందని అనుకున్నారు. ఎందుకంటే... దీనికి ముందు కూడా విశ్వక్ సేన్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇటువంటి టైమ్‌లోనే విశ్వక్ సేన్ ఈసారి గట్టిగా కొట్టాలని అనుకున్నారు. అదీ ఇదే యేడాది కొట్టాలనుకున్నారు. ఒకటి కాదు మూడు సినిమాలతో. రిలీజ్ కాబోతున్న విశ్వక్ సేన్ మూవీస్ లైన్ ఆర్డర్ చూస్తే ఎవరికైనా మతిపోతుంది. ఇందులో ఏదో ఒక సినిమా వెనక్కి వెళుతుందేమో అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నా, మేకర్స్ మాత్రం పిచ్చ క్లారిటితో ఉన్నట్టు అర్థమౌతుంది.
అక్టోబర్ 30న కల్ట్
భారతదేశంలోనే మొట్ట మొదటి స్లాషర్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతోంది 'కల్ట్'. విశ్వక్ సేన్, గాయత్రి భరద్వాజ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, తారక్ పొన్నప్ప, ప్రజ్ఞ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను సందీప్ కాకరాల ప్రొడ్యూస్ చేస్తున్నారు. 'ఫలక్‌నుమా దాస్, దాస్ దా ధమ్కీ' చిత్రాల తర్వాత విశ్వక్ సేన్ దర్శకత్వం వహిస్తున్న మూడో సినిమా ఇది. ఈ సినిమా టీజర్ చూసిన వాళ్ళ బుర్ర హిటెక్కిపోయింది. తెలుగులో ఇంతవరకూ ఏ సినిమాలోనూ చూడనంత హింసను ఇందులో చూపిస్తారేమో అనే భయం పట్టుకుంది. ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బసూర్ సంగీతం అందిస్తున్నారు. జన్ జీ లో స్పెషల్ ఫాలోయింగ్ ఉన్న తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు మాటలు రాశారు. అలానే 'యానిమల్' సినిమాకు సౌండ్ డిజైన్ చేసిన సచిన్ దీనికి వర్క్ చేస్తున్నారు. విశ్వక్ డైరెక్ట్ చేస్తున్న 'కల్ట్' ఈనెల 30న జనం ముందుకు రాబోతోంది.
నవంబర్ 19న 'ఈఎన్ఈ రిపీట్'
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న కల్ట్ క్లాసిక్ సీక్వెల్ 'ఈఎన్ఈ రిపీట్'. 2018లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది'కి ఇది కొనసాగింపుగా రాబోతున్న సినిమా. విశ్వక్ సేన్‌తో పాటు ఈ సీక్వెల్లో అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, వివేక్ సాగర్ స్వరాలు సమకూర్చుతున్నాడు. ఈ సినిమా వచ్చే నెల 19న విడుదల కాబోతోంది.
డిసెంబర్ 4న 'లెగసీ'
విశ్వక్ సేన్ నటిస్తున్న ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామా 'లెగసీ'. సాయికిరణ్ రెడ్డి దైదా రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కలాహి మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజయ్ సాంబ్రాణి, వి.వి.ఎన్. ప్రసాద్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఏక్తా రాథోడ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 4న రిలీజ్ కాబోతోంది. 'పిండం' మూవీ తర్వాత సాయికిరణ్ రెడ్డి దైదా తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఈ విధంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో విశ్వక్ సేన్ మూవీస్ వరుసగా మూడు వస్తున్నాయి. సరిగ్గా చెప్పాలంటే... కేవలం ఐదు వారాలలో విశ్వక్ సేన్ నటిస్తున్న మూడు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయన్న మాట!
ఇవి కూడా చదవండి:
‘కల్కి 2’ షూటింగ్‌పై అప్డేట్.. సాయిపల్లవి ఎంట్రీపై టాక్
దీపావళి రేసులో సూర్య, నయనతార.. విజేత ఎవరు?
‘బాషా’, ‘మాస్టర్’, ‘తొలిప్రేమ’ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత