Ramayana: ముందే కూయడం పొరపాటైంది...
ABN, Publish Date - Jul 20 , 2026 | 12:44 PM
ఇటీవల దేశంలో ఎంపిక చేసిన కొందరు మీడియా ప్రతినిధులు, విద్యార్థులకు న్యూఢిల్లీలో రామాయణ ట్రైలర్‌ను ముందుగానే ప్రదర్శించారు. అయితే ఇదే మేకర్స్ చేసిన అతి పెద్ద తప్పిదమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత గొప్ప సాంస్కృతిక వారసత్వాల్లో రామాయణం ఒకటి. తరతరాలుగా ఇది కేవలం ఒక ఇతిహాసంగా మాత్రమే కాకుండా, భారతీయుల పండుగలు, విలువలు, జీవన విధానం, సంస్కృతిలో విడదీయరాని భాగంగా కొనసాగుతోంది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజంలోనూ రామాయణం తన ప్రభావాన్ని నిలబెట్టుకుంది. ఇప్పుడు ఆ శాశ్వత గాథ 'రామాయణ' పేరుతో వెండితెరపై మరోసారి ఆవిష్కృతం కాబోతోంది. ఈ యేడాది దీపావళి కానుకగా ఈ సినిమాలోని ప్రథమ భాగం విడుదల కాబోతోంది. అందులో భాగంగా మూవీ ట్రైలర్ ను ఈ నెల 24న విడుదల చేయబోతున్నారు.
రణబీర్ కపూర్, సాయి పల్లవి, సన్నీ డియోల్, యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ వ్యూహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ట్రైలర్ అధికారిక విడుదలకు దాదాపు వారం రోజుల ముందే చిత్రబృందం మీడియా ప్రతినిధుల కోసం ట్రైలర్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించింది. ఈ నిర్ణయం ఇప్పుడు వారికి ప్రతికూలంగా మారినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌కు సంబంధించిన తక్కువ నాణ్యత కలిగిన వీడియో క్లిప్స్, స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
'రామాయణ స్కూల్స్ ప్రోగ్రామ్' ద్వారా దేశవ్యాప్తంగా 500కు పైగా పాఠశాలల్లో లక్షలాది మంది విద్యార్థులు రామాయణం బోధించే శాశ్వత విలువలను సృజనాత్మక కార్యక్రమాల ద్వారా తెలుసుకునే అవకాశం పొందారు. అందులో విజేతలుగా నిలిచిన కొందరు చిన్నారులను 'ప్రథమ్ సంకల్ప్' కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. ఆ రకంగా దేశంలోని 20 నగరాల్లో వందలాది మంది చిన్నారులు, కంటెంట్ క్రియేటర్లు, అభిమానులు ప్రపంచవ్యాప్త విడుదలకు ముందే ట్రైలర్‌ను ప్రత్యేకంగా వీక్షించే అవకాశం పొందనున్నారు. అదే ఇప్పుడు సినిమాకు చేటు తెస్తోందని తెలుస్తోంది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. అలానే ఎ.ఐ. టెక్నాలజీ సైతం అందుబాటులోకి వచ్చేసింది. దాంతో తాము చూసిన ట్రైలర్ ను అత్యుత్సాహంతో చాలామంది స్మార్ట్ ఫోన్ లో షూట్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలు పెట్టారు. దాంతో 24న రాబోతున్న ట్రైలర్ కు సంబంధించి, తక్కువ క్వాలిటీ కలిగిన చిన్న చిన్న క్లిప్స్ వైరల్ అయిపోయి, మూవీ మీద ఆసక్తి సన్నగిల్లేలా చేశాయి. 'రామాయణ' నిర్మాతల అత్యుత్సాహం... బూమరాంగ్ అయ్యిందని, సినిమాకు విశేషమైన ప్రచారం జరిగడం అటుంచి, అదే పెద్ద మైనస్ గా మారిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా ట్రైలర్ ను కూడా అదే రోజున సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి ఉంటే... ఈ సమస్య ఉత్పన్నం అయి ఉండేది కాదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే... సెల్యులాయిడ్ దృశ్య కావ్యం 'రామాయణ' ట్రైలర్ ను వెండితెరపై వీక్షించిన తర్వాత ఈ ట్రోలింగ్ కు చెక్ పెట్టినట్టే అవుతుందని, చేతిలోని స్మార్ట్ ఫోన్ లో చూసే దానికి, సిల్వర్ స్క్రీన్ మీద చూసే దానికి ఎంతో వ్యత్యాసం ఉంటుందని మరికొందరు చెబుతున్నారు.
రామానంద్ సాగర్ 'రామాయణం' లో శ్రీరాముడి పాత్రతో కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన అరుణ్ గోవిల్, 'రామయణ' చిత్రంలో దశరథ మహారాజు పాత్రలో కనిపించనున్నారు. అలాగే శోభన కైకేయి పాత్రలో, అజింక్య దేవ్ విశ్వామిత్ర మహర్షిగా, కునాల్ కపూర్ ఇంద్రుడిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా, రవీ దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. 'దంగల్' ఫేమ్ నితేశ్ తివారి దర్శకత్వంలో నిర్మాత, క్రియేటివ్ ఆర్కిటెక్ట్ నమిత్ మల్హోత్రా దీనిని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేతలైన హాన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
చిరు, బాలయ్య చొరవతో ముగిసిన డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం
సీతమ్మ పాత్రను నేను ఎంచుకోలేదు, ఆ దేవుడే: సాయి పల్లవి
బ్రదర్స్ బాండింగ్ అంటే ఇది.. ‘లెనిన్’ హిట్‌పై చైతూ!