చిరు, బాలయ్య చొరవతో ముగిసిన డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం
ABN , Publish Date - Jul 19 , 2026 | 09:06 PM
తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం నేపథ్యంలో ఫిలిం ఫెడరేషన్ కార్యాలయంలో ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించారు.
తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం నేపథ్యంలో ఫిలిం ఫెడరేషన్ కార్యాలయంలో ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్, సాయి రాజేష్ సమక్షంలో ఈ కీలక భేటీ జరిగింది. ఈ సమావేశానికి డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతతో పాటు జానీ మాస్టర్ కూడా హాజరయ్యారు. కొన్ని రోజులుగా డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్‌లో ఎలాంటి వివాదం నడుస్తోందో తెలియంది కాదు. ఈ వివాదం నేపథ్యంలో జానీ మాస్టర్, సుమలతలకు ఫిలిం ఫెడరేషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జానీ మాస్టర్ అసలేం జరుగుతుందో వివరిస్తూ నిర్మాతలతో భేటీ అయ్యారు. నిర్మాతలతో పాటు, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కూడా ఈ వివాదానికి వెంటనే ఫుల్‌స్టాప్ పెట్టాలని సూచించడంతో.. ప్రస్తుతం ఈ వివాదం ముగిసినట్లుగా ఇటు ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్, అటు జానీ మాస్టర్ ప్రకటించారు.
తాజాగా జరిగిన సమావేశంలో ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. జానీ మాస్టర్ విషయం అందరికీ తెలిసిందే. ఆయన వచ్చి నిన్న చాంబర్‌లో కూర్చోవడం జరిగింది. చాంబర్ ప్రెసిడెంట్ అలాగే సెక్రటరీ, కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఆయనతో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. మాస్టర్ నిన్న ఇక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కి వచ్చి వారి వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వివరణకి మేము పూర్తిగా సంతృప్తి చెందడం జరిగింది. వారు ఎందుకు అనవలసి వచ్చింది.. ఎందుకు అనేది వారు వివరణ పూర్తిగా ఇచ్చారు. ఏదైనా ఫెడరేషన్ కార్మికుల పక్షాన, డ్యాన్సర్స్ పక్షాన ఉంటుంది కాబట్టి.. మాస్టర్ కూడా డాన్సర్స్ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారు కూడా వచ్చి పూర్తి వివరణ ఇచ్చారు. దానికి మేము సంతృప్తి చెందడం జరిగింది కాబట్టి ఏదైతే జానీ మాస్టర్ మీద మేము నాన్ కోఆపరేషన్ విధించామో దాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. రేపటి నుంచి యథావిధిగా జానీ మాస్టర్ వారి విధులకు హాజరు కావచ్చు అని తెలియజేస్తున్నాము. అలాగే డాన్సర్స్ యూనియన్ గురించి కార్యవర్గంలో జరుగుతున్న అవకతవకల గురించి కానీ, లేకపోతే సస్పెన్షన్ విషయాలు కానీ వాటిని కూడా సభ్యులు చాలా ఇబ్బంది పడుతున్నారని వారు చెప్పారు. అధ్యక్షులవారు వచ్చి వారి వివరణ వారు ఇవ్వడం.. అన్నీ కూడా జరిగిన తర్వాత ఫెడరేషన్ రాబోయే ఆదివారం 26వ తేదీన వారి యూనియన్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అక్కడ సభ్యులందరి సమక్షంలో మంచి నిర్ణయంతో యూనియన్ కార్యవర్గం యథావిధిగా కొనసాగే విధంగా.. ఎవరైతే తప్పు చేశారో, ఆ తప్పు చేసిన వ్యక్తి మీద సభ్యుల సమక్షంలో చర్చించి, ఒక నిర్ణయం తీసుకోవాలని మేము నిర్ణయించడం జరిగింది. కాబట్టి 26వ తేదీ యూనియన్ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని.. ఇక నెక్స్ట్ ఎలా ఉండాలి, ఏంటి అనే దానిపై తదుపరి చర్యలు తీసుకోనున్నాం. అప్పటి వరకు యూనియన్ కార్యకలాపాలు కూడా యథావిధిగా కొనసాగుతాయి. ఎటువంటి ఇబ్బందులు లేవు. డాన్సర్స్, ఎవరి డాన్స్ వాళ్ళు చేసుకోవచ్చు. కార్యవర్గం కూడా సుమలతా దేవి ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది.
ఎవరైతే తప్పు చేశారని చెప్పేసి అభియోగం మోపబడిందో సెక్రటరీ.. ఆ సెక్రటరీ మీద అయితే ఇక్కడ సభ్యుల సమక్షంలో మేము చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధపడ్డాము. కాబట్టి 26వ తేదీ యూనియన్ యొక్క జనరల్ బాడీ మీటింగ్ నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాము. ఈ రోజుతో ఈ డ్యాన్సర్స్ అసోసియేషన్ యొక్క గొడవలు ఏమీ లేవు. అంతా ప్రశాంత వాతావరణంలో మేము ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే ఫెడరేషన్ అంటే 24 క్రాఫ్ట్స్ కార్మిక సంఘాలు. అందరూ కూడా కలిసికట్టుగా ఉండే విధంగా మేము నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాని ఇక్కడ హెచ్చుతగ్గులు, ఒకళ్ళ ఇగోలు అటువంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే మేము షూటింగ్‌లు చేసుకునేవాళ్ళం. మాస్టర్ ఉంటేనే డాన్సర్లు ఉంటారు. చిన్న చిన్న తప్పుల్ని, మా ఇంటి తప్పులుగా భావించుకొని అందరం కూడా సరిచేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు సహకరించిన మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా సినీ కార్మికుల పక్షాన మీడియా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ సమస్యపై వారం రోజుల నుంచి ప్రతి పరిశ్రమలోని పెద్దలందరూ చొరవ తీసుకోవడం జరిగింది. పరిశ్రమ నుంచి చలసాని శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్‌లతో పాటు చిరంజీవి, బాలకృష్ణ అందరూ కూడా పలు విధాలుగా దీన్ని, ఈ యొక్క సమస్యను సర్దుమణిగించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. వారికి మా ఫెడరేషన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము’’ అని అన్నారు.
జానీ మాస్టర్ మాట్లాడుతూ.. ఇప్పుడే యూనియన్ తో కూర్చొని మాట్లాడటం జరిగింది. డెఫినెట్లీ 24 క్రాఫ్ట్స్‌కి ఫెడరేషన్ అనేది కావాలి. అది కూడా నేను దృష్టిలో పెట్టుకొని.. నేను నాకున్న పరిధిలో నేను వివరణ ఇవ్వడం జరిగింది. సో ఆ వివరణకి అందరూ సంతృప్తి చెందటం జరిగింది. సో ఈ సమస్య ఇక్కడితో క్లోజ్ అయిపోయిందని నేను భావిస్తున్నాను. శ్రీనివాస్ సర్, ప్రసన్న సర్, సాయి రాజేష్ అందరికీ ధన్యవాదాలు. వీరందరూ.. ఈ సమస్య ఎటో వెళ్తుందని చెప్పి వచ్చి ఇమ్మీడియట్‌గా రియాక్ట్ అయ్యారు. చాలా చాలా థాంక్యూ సో మచ్ సర్. హ్యాపీ. అలాగే ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ మంచి ఉన్నా ఫస్ట్ చిరంజీవి సార్ ఉంటారు. నన్ను, శేఖర్ మాస్టర్‌ని ఫస్ట్ ఆయనే పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడారు. చాలా చక్కగా మమ్మల్ని ముందుకు వెళ్లేలా చేశారు. బాల సార్ కూడా వెంటనే రియాక్ట్ అయి.. వివాదం పెద్దది కాకుండా చూశారు. వారు యూనియన్‌తో మాట్లాడి ఈ సమస్యని క్లియర్ చేయమని పెద్దలకు సూచించారు. సో.. యూనియన్ సమస్య కూడా ఇప్పుడు క్లియర్ అయ్యింది. థాంక్యూ సో మచ్ టు ఆల్’’ అని చెప్పుకొచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో డ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్, సాయి రాజేష్ వంటి వారంతా మాట్లాడారు.
ఇవి కూడా చదవండి:
సీతమ్మ పాత్రను నేను ఎంచుకోలేదు, ఆ దేవుడే: సాయి పల్లవి
బ్రదర్స్ బాండింగ్ అంటే ఇది.. ‘లెనిన్’ హిట్‌పై చైతూ!
ప్రథమ్ సంకల్ప్.. ‘రామాయణ’ మహా ప్రయాణానికి శ్రీకారం