సీతమ్మ పాత్రను నేను ఎంచుకోలేదు, ఆ దేవుడే: సాయి పల్లవి
ABN , Publish Date - Jul 19 , 2026 | 07:33 PM
సహజ నటి సాయి పల్లవి బాలీవుడ్‌లో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘రామాయణ’. ఇందులో సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారు.
సహజ నటి సాయి పల్లవి (Sai Pallavi) బాలీవుడ్‌లో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘రామాయణ’ (Ramayana). నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), యష్ (Yash) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేక ఈవెంట్ ‘ప్రథమ్ సంకల్ప్’ పేరుతో తాజాగా ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయి పల్లవి, తన సినీ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సీతమ్మ పాత్రను పోషించడంపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సౌత్ ఇండియా నుంచి హిందీ చిత్ర పరిశ్రమ యొక్క గడ్డపై అడుగుపెట్టిన సాయి పల్లవి, మొదట తన హిందీ కాస్త సరిగ్గా లేకపోతే క్షమించాలని వినమ్రంగా కోరుతూ మాట్లాడటం ప్రారంభించారు.
ఈ మహాకావ్యంలో సీతాదేవి పాత్రను పోషించే అవకాశం రావడంపై సాయి పల్లవి ఎంతో ఎమోషనల్ అయ్యారు. ‘‘ఒక నటిగా ఇలాంటి అద్భుతమైన పాత్రలు రావడం అంత సులభం కాదు. ఒక భగవంతుడిని, ఒక దేవతను తెరపై ఆవిష్కరించడం అనేది చాలా బాధ్యతతో కూడుకున్న పని. ఈ సినిమాను ప్రపంచానికి ఒక బెస్ట్ వెర్షన్‌గా అందించడానికి చిత్ర బృందం మొత్తం తమ హృదయాన్ని, ఆత్మను పెట్టి పని చేస్తోంది. ఎందుకంటే ఇది కేవలం సినిమా కాదు, రాబోయే తరాలకు నిలిచిపోయే ఒక చరిత్ర. ఇంతటి భారీ ప్రాజెక్టులో నన్ను భాగం చేసినందుకు దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. నిజం చెప్పాలంటే, సీతమ్మ పాత్రను నేనేమీ వెతుక్కుంటూ వెళ్ళలేదు లేదా నేనేమీ దాన్ని ఎంచుకోలేదు.. ఆ సీతామాత ఆశీస్సులు, దైవ దీవెనల వల్లే ఈ పాత్ర నన్ను వెతుక్కుంటూ వచ్చిందని నేను బలంగా నమ్ముతున్నాను’’ అని సాయి పల్లవి పేర్కొన్నారు.
సీతమ్మ పాత్రలో ఒదిగిపోవడానికి తను పడిన ఆరాటాన్ని, చేసిన ప్రయత్నాన్ని సాయి పల్లవి ఈ సందర్భంగా పంచుకున్నారు. ‘‘ఈ పాత్రను ఎలా పోషించాలో ఒక కాగితం మీద రాసుకుని ప్రిపేర్ అవ్వడం అసాధ్యం. షూటింగ్ సమయంలో నేను ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసుకునేదాన్ని. ‘సీతమ్మా.. నా ద్వారా నువ్వే నటించు, నా నుంచి ఎలాంటి హావభావాలు వస్తాయో అవన్నీ ఈ సినిమాకు నువ్వు అనుకున్నవే కావాలి’ అని మనస్ఫూర్తిగా ప్రార్థించేదాన్ని. నా ఆలోచనల్లో ఎటువంటి కల్మషం లేకుండా, వీలైనంత పవిత్రంగా ఉంచుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాను. ఆ నిష్కల్మషమైన ప్రయత్నంలోనే నేను ఈ పాత్ర ద్వారా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను నేర్చుకున్నాను’’ అని ఆమె వివరించారు. ఈ ప్రాజెక్ట్ కోసం తాను గత మూడేళ్లుగా పనిచేస్తుంటే, మేకర్స్ మాత్రం దాదాపు 10 సంవత్సరాలుగా దీనిపైనే శ్రమిస్తున్నారని, ఈ రోజు తమ అందరికీ ఎంతో ముఖ్యమైన రోజని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
బ్రదర్స్ బాండింగ్ అంటే ఇది.. ‘లెనిన్’ హిట్‌పై చైతూ!
ప్రథమ్ సంకల్ప్.. ‘రామాయణ’ మహా ప్రయాణానికి శ్రీకారం
72th National Awards: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలు వీరే..