‘రామాయణ’ డిజైన్ దుస్తుల కాంట్రవర్సీపై డిజైనర్స్ ఫైర్
ABN, Publish Date - Aug 04 , 2026 | 11:50 PM
భారతీయ చలనచిత్ర రంగాన రామాయణం అంటే కేవలం ఒక పౌరాణిక చిత్రం మాత్రమే కాదు, కోట్లమంది భక్తుల భావోద్వేగమనే విషయం తెలియంది కాదు. అలాంటిది గత కొంతకాలంగా ‘రామాయణం’ నేపథ్యంలో వచ్చే చిత్రాలు నవ్వులపాలయ్యేలా చేస్తున్నాయంటే అతిశయోక్తి కానే కాదు.
భారతీయ చలనచిత్ర రంగాన రామాయణం (Ramayana) అంటే కేవలం ఒక పౌరాణిక చిత్రం మాత్రమే కాదు, కోట్లమంది భక్తుల భావోద్వేగమనే విషయం తెలియంది కాదు. అలాంటిది గత కొంతకాలంగా ‘రామాయణం’ నేపథ్యంలో వచ్చే చిత్రాలు నవ్వులపాలయ్యేలా చేస్తున్నాయంటే అతిశయోక్తి కానే కాదు. ఇటీవల ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ఆదిపురుష్’ ఎలా ట్రోల్ మెటీరియల్‌గా మారిందో తెలియంది కాదు. ఇప్పుడు రణబీర్ కపూర్ హీరోగా రూపుదిద్దుకుంటోన్న ‘రామయణ’ విషయంలో కూడా అదే స్థాయిలో ట్రోలింగ్ నడుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తోన్న ఈ రామాయణ ట్రైలర్ చూశాక, మోడ్రనైజేషన్ బాగా పెరిగిపోయిందనేలా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సీతాదేవిగా నటిస్తున్న సాయిపల్లవి, కైకేయి పాత్రలో కనిపిస్తున్న లారా దత్తా కాస్ట్యూమ్స్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సీతాదేవి బ్లౌజ్ డిజైన్, కైకేయి ధరించిన దుస్తుల రంగులపై పలువురు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
ఈ విమర్శలపై ‘రామాయణ’ మూవీ కాస్ట్యూమ్ డిజైనర్లు రింపుల్, హర్‌ప్రీత్ నరులా ఫైర్ అవడమే కాకుండా.. ఇలాంటి విమర్శలు ముందుగానే ఊహించామని చెప్పడం విశేషం. సీతాదేవి కాస్ట్యూమ్‌పై వచ్చిన వ్యాఖ్యలకు డిజైనర్ రింపుల్ వివరణ ఇస్తూ.. ‘‘రామాయణ కళ్ల ముందు ఊహించుకుని సీతా దేవిని తలచుకున్నప్పుడు నాకు ఆర్కియోలాజికల్ ప్రామాణికత గురించి ఆలోచించలేదు. మా ఇంట్లో ఉన్న పూజ గదిలో అమ్మవారి రూపమే నా మనసులో ఆవిష్కరించింది. నేను ఆ రూపాన్నే డిజైన్ చేశాను. అది మేమంతా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే. ఇలాంటి విమర్శలు, పోలికలు వస్తాయని ముందే ఊహించాం. కళాత్మకంగా మాత్రమే ఆవిష్కరించాలని అనుకున్నాం. పూర్వకాలం నాటి దుస్తుల ఆధారాలు ఇప్పుడు లభించవు కాబట్టి.. చిన్నప్పటి నుంచి చూసిన క్యాలెండర్ ఆర్ట్, రాజా రవివర్మ వర్ణచిత్రాలు, ఆలయ శిల్పాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేయడం జరిగింది’’ అని తెలిపారు.
ఇక కైకేయి పాత్రకు కాస్ట్యూమ్ డిజైన్ చేసిన హర్‌ప్రీత్ నరులా స్పందిస్తూ.. కైకేయి కాస్ట్యూమ్‌లోని ఆకుపచ్చ రంగు మాతృత్వానికి ప్రతీక. అలాగే ముదురు మెరూన్ రంగు ఆమె తీసుకోవాల్సిన కఠిన నిర్ణయాన్ని, ఆమె మానసిక సంఘర్షణను తెలియజేస్తుంది. సొంత కుమారుడు, శ్రీరాముడి మధ్య నలిగిపోయే పాత్రని ఎలా చూపించాలో అలా చూపించాం. ప్రతి పాత్రకు ఎంతో వర్క్ చేశాం. ఆషామాషీగా ఏం చేయలేదు. ట్రైలర్ చూసి ఓ నిర్ణయానికి రావద్దు.. పూర్తి సినిమా చూసిన తర్వాత అప్పుడు కామెంట్స్ చేయండని ఆమె వివరణ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
‘పెద్ది’లోకి స్పైడర్ మ్యాన్.. ఇదెక్కడి వాడకం రా అయ్యా!
‘ఓజీ-2’ కన్నా ముందే ‘బ్లడీ రోమియో’.. సుజిత్ మెగా ట్విస్ట్
‘చింటూ’ వెనుక కథేంటని అడిగిన యాంకర్‌కు నాగవంశీ క్రేజీ ఆన్సర్!