Ram Gopal Varma: 'పోలీస్ కంపెనీ' రిలీజ్ డేట్ ఖరారు!
ABN, Publish Date - Oct 21 , 2026 | 12:59 PM
ముంబై ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ జీవితం ఆధారంగా రామ్ గోపాల్ వర్మ 'పోలీస్ కంపెనీ' తెరకెక్కిస్తున్నారు. హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ 4న విడుదల చేయనున్నట్లు వర్మ ప్రకటించారు.
దాదాపు 28 ఏళ్ళ తర్వాత రామ్ గోపాల్ వర్మ, మనోజ్ బాజ్ కలిసి చేసిన సినిమా 'పోలీస్ స్టేషన్ మే భూత్'. రమ్యకృష్ణ, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించిన ఈ హారర్ డ్రామా విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ లోగానే రాంగోపాల్ వర్మ హిందీలో మరో సినిమా మొదలు పెట్టేశారు. అదే 'పోలీస్ కంపెనీ'. ముంబైకి చెందిన ప్రముఖ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ లైఫ్ బేస్ చేసుకుని వర్మ 'పోలీస్ కంపెనీ' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దయా నాయక్ గా హర్షవర్థన్ రాణే నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే యేడాది జూన్ 4న విడుదల చేయబోతున్నట్టు రామ్ గోపాల్ వర్మ తాజాగా ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ జస్టిఫికేషన్ గురించి వర్మ చెబుతూ, 'పోలీస్ యంత్రాంగం అనేది ఒక వ్యవస్థ. కంపెనీ అనేది డబ్బులు సంపాదించే కొందరు ముఠా నాయకులకు చెందింది. అయితే ఒక వ్యవస్థ తన అధికారాలను హద్దులు దాటి వినియోగిస్తే... అది 'కంపెనీ'గా మారుతుంది. అదే 'పోలీస్ కంపెనీ' అని అన్నారు.
‘హింసాత్మకంగా ఉండటమే వారి అర్హత. భయమే వారి విధానం. నేరస్థులను వేటాడటమే వారి పని. వారు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయరు. కేసును ముగించడానికి నేరస్థులను చంపేస్తారు. ‘పోలీస్ కంపెనీ’ లోని ఉద్యోగులు డీ కంపెనీ లోని సభ్యుల కంటే ప్రమాదకరమైనవారు' అని వర్మ పేర్కొన్నారు. ఈ సినిమాను టీ-సీరిస్ సంస్థ నిర్మిస్తోంది.
ఈ సినిమా తీయడానికి వర్మ కారణం చెబుతూ, '1997 నుంచి 2004 మధ్య పోలీస్ కంపెనీ 319 మంది గ్యాంగ్‌స్టర్లను చంపింది. అందుకే అది డీ కంపెనీ కంటే ప్రమాదకరమైనది. వారంతా ఇప్పుడు అందరినీ చంపడానికి వస్తున్నారు. ముంబై అండర్‌వరల్డ్‌లో అత్యంత హింసాత్మకమైన అధ్యాయంగా నిలిచిన కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. నేర ప్రపంచానికి మరోవైపు ఉన్న పోలీసుల ప్రపంచాన్ని ఈ సినిమా ఆవిష్కరించబోతున్నాం. ఇది అసలు ‘కంపెనీ’కి మరో కోణం' అని తెలిపారు. ఇప్పటికే అండర్ వరల్డ్ నేపథ్యంలో పలు చిత్రాలను రూపొందించిన వర్మ 'పోలీస్ కంపెనీ'ని ఎలా తీస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
మరో స్టార్ హీరోని పట్టిన బుచ్చిబాబు.. ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి
స్పిరిట్ పోయింది.. ఎల్లమ్మ వచ్చింది
దేవుళ్లనే నమ్ముకున్న ఆది.. మొన్న శంబాల.. నేడు రుద్ర