సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తెలుగువారితో నాలుగు దశాబ్దాల అనుబంధం!

ABN, Publish Date - Oct 26 , 2026 | 02:31 PM

చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమాలో అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వంశవృక్షం నుంచి కాకా వరకు అనిల్ కపూర్‌కు తెలుగు సినిమాలతో ఉన్న అనుబంధం ఆసక్తికరం.

Anil Kapoor

మెగాస్టార్ చిరంజీవి 'కాకా'లో కీలక పాత్ర పోషించబోతున్న అనిల్‌ కపూర్‌ కు తెలుగు సినిమాతో బలమైన అనుబంధమే ఉంది. అదేమిటో తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న 'కాకా' సినిమా జనవరి 13వ తేదీన వెలుగు చూడనుంది. చిరంజీవి- బాబీ కాంబోలో ఇంతకు ముందు రూపొందిన 'వాల్తేరు వీరయ్య' నాలుగేళ్ళ క్రితం జనవరి 13వ తేదీనే విడుదలై విజయఢంకా మోగించింది. అందువల్ల వారిద్దరి కాంబోలో తెరకెక్కుతోన్న 'కాకా'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలోనే అనిల్ కపూర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారట. అనిల్ కపూర్ పాత్ర కథను మలుపు తిప్పేలా ఉంటుందని తెలుస్తోంది. అనిల్ కపూర్ కు తెలుగువారితో అనుబంధం ఈ నాటిది కాదు. అనిల్ నటించిన రెండో సినిమానే తెలుగు చిత్రం 'వంశవృక్షం' కావడం విశేషం. 1980లో 'వంశవృక్షం' విడుదలయింది. ప్రస్తుతం యన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న 'డ్రాగన్' సినిమాలోనూ అనిల్ కపూర్ కీ రోల్ పోషిస్తున్నారు. అంటే చిరంజీవి 'కాకా' అనిల్ కపూర్ నటిస్తోన్న మూడో తెలుగు చిత్రమవుతుంది. అయితే 'డ్రాగన్' కంటే ముందుగానే 'కాకా' జనం ముందుకు రానుంది.


అనిల్ కపూర్ తండ్రి సురీందర్ కపూర్ బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత. అనిల్ అన్న బోనీ కపూర్ సైతం తండ్రి బాటలో పయనిస్తూ నిర్మాతగా మారి పలు చిత్రాలు నిర్మించారు. అనిల్ మనసు మాత్రం నటనపై కేంద్రీకృతమై ఉండేది. దాంతో చిత్రసీమలో ప్రయత్నాలు మొదలెట్టారు. టీనేజ్ లోనే 'తూ పాయల్ - మై గీత్' సినిమాలో నటించారు అనిల్- ఆ సినిమా రిలీజ్ కాలేదు. తరువాత 'హమారే తుమ్హారే'లో చిన్న పాత్ర పోషించారు. ఆ పై బాపు తెరకెక్కించిన తెలుగు చిత్రం 'వంశవృక్షం'లో లెక్చరర్ శేష్ పాత్రలో నటించారు. నటునిగా మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తరువాత బాపు హిందీ చిత్రం 'హమ్ పాంచ్'తో మరింత పేరు తెచ్చుకున్నారు. అలా తెలుగు వారితో అనుబంధం మొదలైంది అనిల్ కు. అనిల్ కపూర్ నటించిన 'సాహెబ్' ఆధారంగానే తెలుగులో చిరంజీవి హీరోగా 'విజేత' చిత్రం తెరకెక్కింది. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. అలా అనిల్ పాత్రను తెలుగులో చిరంజీవి పోషించి మెప్పించారు. అప్పటి నుంచే చిరంజీవి, అనిల్ కపూర్ మధ్య అనుబంధం నెలకొంది.


'విజేత' చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించారు. చిరంజీవి హీరోగా అరవింద్ నిర్మించిన 'అత్తకు యముడు- అమ్మాయికి మొగుడు' చిత్రం 1989 సంక్రాంతి బంపర్ హిట్ గా నిలచింది. ఆ సినిమాను హిందీలో 'జమై రాజా'గా అనిల్ కపూర్ తో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి కూడా తెలుగు సినిమాకు దర్శకత్వం వహించిన ఎ. కోదండరామిరెడ్డి డైరెక్షన్ చేశారు. 'జమై రాజా'ను తెలుగు నిర్మాత టి. త్రివిక్రమరావు నిర్మించారు. ఇక 'స్వాతిముత్యం' హిందీ రీమేక్ 'ఈశ్వర్', 'శుభలగ్నం' రీమేక్ 'జుదాయి', 'పవిత్రబంధం' రీమేక్ 'హమ్ ఆప్కే దిల్ మే రెహతే హై' వంటి చిత్రాల్లో అనిల్ కపూర్ హీరోగా నటించారు. ఇలా తెలుగు సినిమావారితో మొదటి నుంచీ అనుబంధం ఉన్న అనిల్ కపూర్, కొన్ని దశాబ్దాల తరువాత తెలుగు చిత్రంలో నటించడం, అందునా చిరంజీవి 'కాకా'లోనే ముందుగా కనిపిస్తూ ఉండడం విశేషంగా మారింది. చిరంజీవి, అనిల్ కపూర్ కలసి తెరపై కనిపిస్తే ఎలా ఉంటుందో 'కాకా' వచ్చాక తేలనుంది. మరి వారి కాంబో జనవరి 13న ఏ తీరున మురిపిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

సౌందర్య అంత అందంగా ఉండేది కాబట్టే.. దేవుడు తీసుకెళ్లిపోయాడు: ఆమని

రజనీతో రజనీకే పోటీ.. టాప్‌-3లో ఒకడే కింగ్‌

సూర్యకు ఈ ఏడాది త్రిపుల్‌ ధమాకా.. అదే జరిగితే హిస్టరీనే

Updated Date - Oct 26 , 2026 | 03:07 PM