గజబ్ రాత్.. ది ఫ్యామిలీ మ్యాన్ హీరో సినిమా ఎలా ఉందంటే

ABN , Publish Date - Oct 25 , 2026 | 05:07 PM

ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో ఒక్కసారిగా స్టార్ గా మారిపోయాడు మనోజ్ భాజ్ పాయ్ (Manoj Bajpayee). ఆ తరువాత ఆయన నటించిన ప్రతి సినిమా, సిరీస్ పై బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు తెలుగువారు కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు.

Gajab Rat

ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో ఒక్కసారిగా స్టార్ గా మారిపోయాడు మనోజ్ భాజ్ పాయ్ (Manoj Bajpayee). ఆ తరువాత ఆయన నటించిన ప్రతి సినిమా, సిరీస్ పై బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు తెలుగువారు కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం 'గజబ్ రాత్' (Gajab Rat). రితేష్ షా దర్శకత్వం వహించిన ఈ సినిమాని నీరజ్ పాండే నిర్మించాడు. ఇక ఈ చిత్రంలో చాలామంది స్టార్స్ ఉన్నారు. దివ్య దత్తా, అక్షయ్ ఒబెరాయ్, నుష్రత్ భరూచా, సాకిబ్ సలీమ్, శ్రద్ధా దాస్, కికూ శార్దా, రాజీవ్ గుప్తా తదితరులు కనిపించారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా అక్టోబర్ 23 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందో లేదో చూద్దాం.


ఇక కథ విషయానికి వస్తే.. అజయ్ నిర్విత్ (మనోజ్ బాజ్ పాయ్) ఒక లంచగొండి, అమ్మాయిల పిచ్చి ఉన్న పోలీస్ ఆఫీసర్. ప్రతి కేసును కూడా లాభం లేకపోతే క్లోజ్ చేయడు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి. అయితే ఒక రాత్రి తీవ్ర గాయాలతో కారు నుంచి పడిపోయిన ఒక యువతి కేసు అతనికి దక్కుతుంది. ఆ అమ్మాయి ఎవరు అని కనుక్కొనే క్రమంలో అతనికి చాలా షాకింగ్ విషయాలు బయటపడతాయి. దీని వెనుక పెద్ద రాజకీయ, వ్యాపార శక్తులు ఉన్నట్లు సాక్ష్యాలతో సహా బయటపడుతుంది. దీంతో ఈ కేసును అడ్డం పెట్టుకుని బాగా డబ్బు సంపాదించాలనుకుంటాడు. ఆ తరువాత ఏమైంది.. ? ఆ అమ్మాయిని అజయ్ చంపాడా.. ? ఎవరు ఆ ఆమ్మాయిని చంపాలనుకున్నారు..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


ఒక హీరో మొదట తప్పులు చేస్తూ ఉండడం, ఆ తరువాత ఒక సంఘటన ద్వారా మంచివాడిగా మారడం అనేది చాలా సినిమాలలో చూశాం. తెలుగులో టెంపర్ కూడా ఆ కోవలోకే వస్తుంది. ఈ సినిమా లైన్ కూడా ఇంచుమించు అలానే ఉంటుంది. కథలో ఏమైనా కొత్తదనం ఉంటుందా అంటే ఏమి ఉండదు. ముందుగానే కథ మొత్తం తెలిసిపోతూ ఉంటుంది. కథ నార్మల్ గా ఉన్నా కూడా ఎంగేజింగ్ గా కూర్చోపెట్టే స్క్రీన్ ప్లే వేరుగా ఉంటుంది. కానీ, ఈ సినిమాలో అది కూడా లేదు. ఒక్క రాత్రిలో జరిగే కథ. ఒక అమ్మాయి కిందపడిపోవడం, దెబ్బలు తగిలాయి అనగానే ఆమె కోసం.. సిబిఐ, పోలీసులు నా కేసు అంటే నా కేసు అని కొట్టుకోవడం సిల్లీగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో విమెన్ ప్రొటెక్షన్ హెడ్ అంటూ శ్రద్దా దాస్ వచ్చి వెళ్తూ ఉంటుంది. అసలు ఇంతమంది ఎందుకు వస్తున్నారో తెలియక అయోమయం అవుతున్న పరిస్థితిలో నిజం తెలుస్తుంది. అది కూడా అంతా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది లేదు. సడెన్ గా అజయ్ మంచివాడిగా ఎలా మారాడో సరిగ్గా చూపించలేదు.


ఈ సినిమా కథను ఎక్కువగా ఒకే హాస్పిటల్, పరిమితమైన అవుట్‌డోర్ లొకేషన్లలో తెరకెక్కించారు. ఎక్కువ ఖర్చు కూడా పెట్టనవసరం లేదు. రాజకీయ నాయకుల కింద ఉండే ఆఫీసర్లు నిజాన్ని దాచడానికి ఎంతకైనా తెగిస్తారు అని చూపించారు.అయితే సినిమా చూశాక ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి. ట్విస్టులు సాధారణంగా సాగడం, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ రొటీన్‌గా అనిపించడం, క్లైమాక్స్ చప్పగా ముగియడం ప్రేక్షకులను నిరాశపరిచింది. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసే రితేష్ షా ఈసారి తన స్థాయికి తగ్గట్టుగా అవుట్‌పుట్ ఇవ్వలేకపోయాడని చెప్పొచ్చు. ఇక నటీనటుల విషయానికొస్తే ఒక పక్క కేసు చూస్తూనే.. ఇంకోపక్క అమ్మాయిల పిచ్చితో ఉండే ఆఫీసర్ గా మనోజ్ చాలా చక్కగా నటించాడు. నుష్రత్ భరూచా కనిపించింది కొద్దిసేపు అయినా వేశ్యగా ఆమె అందం చూపు తిప్పుకోనివ్వదు. ఇక విమెన్ ప్రొటెక్షన్ హెడ్ గా శ్రద్దా దాస్, సిబిఐ ఆఫీసర్ గా అక్షయ్ ఒబెరాయ్, మినిస్టర్ గా దివ్య దత్తా తమ పాత్రలకు న్యాయం చేశారు. వీలు కుదరినప్పుడు వీకెండ్ లో ఒకసారి చూడొచ్చు.

Updated Date - Oct 25 , 2026 | 05:13 PM