Yandamuri: సంబంధంలేని విషయాల్లో చిరంజీవి వేలు పెట్టరు...

ABN , Publish Date - Aug 23 , 2025 | 09:30 AM

చిరంజీవిపై చక్కర్లు కొడుతున్న ఓ విమర్శపై ప్రముఖ రచయిత యండమూరి వివరణ ఇచ్చారు. చిరంజీవి అలాంటి వారు కాదంటూ కితాబిచ్చారు.

Chiranjeevi - Yandamuri

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ (Yandamuri Veerendranath) మధ్య చక్కని అనుబంధం ఉంది. యండమూరి రాసిన 'అభిలాష (Abhilasha), రాక్షసుడు (Rakshasudu), డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు, నల్లంచు తెల్లచీర' వంటివి నవలలు చిరంజీవి హీరోగా సినిమాలుగా వచ్చాయి. చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని శనివారం కళారవిందం సంస్థ యండమూరి వీరేంద్రనాథ్‌ ను జీవన సాఫల్య పురస్కారంతో హైదరాబాద్ లో సత్కరించింది. ఈ సందర్భంగా చిరంజీవితో తనకున్న సాన్నిహిత్యాన్ని యండమూరి వివరించారు.


సినిమా నిర్మాణంలో చిరంజీవి కల్పించుకుని సూచనలు చేస్తారని చాలామంది అనుకుంటారని, అది వాస్తవం కాదని యండమూరి స్పష్టం చేశారు. చిరంజీవితో తాను పదిహేను సినిమాలు చేశానని, ఆయన ఏనాడు తనకు సంబంధం లేని విషయాలలో వేలు పెట్టలేదని యండమూరి చెప్పారు. సినిమా నిర్మాణంలో నటులు కల్పించుకుంటారనే అసత్యాలను ప్రచారం చేయవద్దని యండమూరి కోరారు. చిరంజీవి చిత్రాలకు రచన చేయడమే కాకుండా యండమూరి.. చిరంజీవి హీరోగా 'స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్' మూవీని డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. అయినా చిరంజీవి, యండమూరి మధ్య అనుబంధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. యండమూరి రాసిన పుస్తకాల ఆవిష్కరణ సభలకు చిరంజీవి గతంలో హాజరయయారు. తాజాగా చిరంజీవి జీవిత చరిత్రను తాను పుస్తకంగా రాస్తున్నానని యండమూరి ప్రకటించారు.

Also Read: Saturday Tv Movies: శ‌నివారం, ఆగ‌స్టు 23.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాల జాబితా

Also Read: Tamanna as Ragini: రాగిణిగా తమన్నా

Updated Date - Aug 23 , 2025 | 09:31 AM