Tollywood: మిడ్ రేంజ్ హీరోల పరిస్థితి ఏంటి...
ABN, Publish Date - Aug 12 , 2025 | 01:27 PM
సినిమా పరిశ్రమ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా మూవీ ఫీల్డ్ పలు సమస్యలు ఎదుర్కొంటోంది. టాలీవుడ్ లో వరుస పరాజయాలు ఓ వైపు. మరోవైపు వేతనాల పెంపుకోసం సినీ వర్కర్స్ ఆందోళన. ఈ నేపథ్యంలో మిడ్ రేంజ్ హీరోల పరిస్థితి అయోమయంగా మారిందని తెలుస్తోంది. మరి వారు ఏం చేయాలి?
హాలీవుడ్ (Hollywood), కొరియన్, జపాన్, రష్యన్ - ఇలా అన్ని సినిమారంగాల్లోనూ ఏదో ఒక సమస్య చిందులేస్తోంది. మన దేశంలోనూ అన్ని ఫిలిమ్ ఫీల్డ్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్నిటికీ ఒకటే కారణం - సినిమాలు విజయం సాధించడం లేదు. వరుస ఫ్లాపులు పలకరిస్తున్నాయి. ఓటీటీని ఎదుర్కొని ప్రపంచ వ్యాప్తంగా సినిమా నిలదొక్కుకొనే ప్రయత్నం చేస్తోంది. టాలీవుడ్ లోనూ వరుస పరాజయాలు వస్తున్నాయి. దాంతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కంపెనీస్ కూడా పలు షరతులు విధిస్తున్నాయి. క్రేజ్ ఉన్న హీరోల సినిమాలు తప్ప మిగిలినవారి చిత్రాలేవీ బిజినెస్ జరగడం లేదు. ఈ కారణంగా మిడ్ రేంజ్ హీరోల పరిస్థితి అయోమయంలో పడినట్టయింది. మొన్నటి దాకా ఓ మోస్తరు హిట్ చూసిన హీరో సైతం నిర్మాతలను శాసిస్తూ తమకు నచ్చిన కథను, నచ్చిన డైరెక్టర్ ఎంచుకోవాలని హుకుమ్ జారీ చేసేవారు. కానీ, వరుస ఫ్లాపులు చూస్తోన్న హీరోలవైపు నిర్మాతలు సైతం కన్నెత్తి చూడని పరిస్థితి తలెత్తింది.
మార్కెట్ తెలిసి మసలాలి...
ఏ సినిమాకైనా కథే హీరో అంటూ ఉంటారు. నిజానికి నిర్మాత లేకపోతే ఎంత మంచి కథ ఉన్నా లాభమేంటి?. సినిమా అనే మహావృక్షానికి అసలైన బీజం నిర్మాత. ఆ విత్తనాన్ని నాటడంతో సరిపోదు, తగినంత నీరుపోయాలి - ఎండ తగిలేలా చూడాలి - చుట్టూ చెత్తాచెదారం పడకుండా జాగ్రత్త వహించాలి.అప్పుడే ఏ చెట్టయినా విస్తృతంగా పెరుగుతుంది. ఎందరికో నీడనిస్తుంది. ఆ నీడలో పదిమంది సేదతీరవచ్చు. అలాంటి నిర్మాతను కాపాడుకోవడం సినిమారంగాన్ని ఆశ్రయించిన ప్రతి ఒక్కరి విధి. ఒకప్పుడు యన్టీఆర్ (NTR), ఏయన్నార్ (ANR), కృష్ణ (Krishna), శోభన్ బాబు (Sobhanbabu), కృష్ణంరాజు (Krishnam Raju) తమ నిర్మాతలు బాగుంటే తాము బాగుంటామని భావించి, వారికి తగినరీతిన సాయం చేస్తూ ముందుకు సాగారు. ఓ వేళ తమతో చిత్రాలు తీసి నష్టపోయిన నిర్మాతలు ఉంటే వారికి ఏదో విధంగా సాయం అందించేవారు. అలాంటి పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. భారీ పారితోషికాలు పుచ్చుకొనే హీరోలు తమ చిత్రాలు నిర్మాతలకు లాభాలు చేకూర్చకపోతే ఏదో విధంగా నష్టపరిహారం జరిగేలా చూస్తారు. తమ స్టార్ డమ్ కు ఉన్న బడ్జెట్ తోనే సాగే హీరోలు మాత్రం మంచి లాభాలు చూస్తున్నారు. ఒకవేళ వారి సినిమాలు ఫ్లాపయినా, నిర్మాతలకు పెద్దగా నష్టాలు రావడం లేదు. కానీ, ఈ మధ్య ఓ హిట్ వస్తే చాలు - వెంటనే భారీగా పారితోషికాలు పెంచేసి, తాము చెప్పినట్టే నిర్మాతలు వినాలి అంటూ కొందరు సాగారు. అలాంటి మిడ్ రేంజ్ హీరోల వైపు నిర్మాతలు చూడడం తగ్గించారు.
ప్రాఫిట్స్ లో షేర్...
నిర్మాత బాగుకోరే కొందరు హీరోలు సినిమాకు ప్రాఫిట్స్ వస్తేనే షేర్ ఇవ్వమనే విధానంతో సాగుతున్నారు. ముందుగా నిర్మాతల నుండి కొంత అడ్వాన్స్ తీసుకుంటారు. సినిమా రిలీజై విజయం సాధించాకనే లాభాలకు తగ్గట్టుగా తమకు వాటా ఇవ్వమని ఈ హీరోలు కోరుతున్నారు. ఒకవేళ నష్టం వస్తే - పుచ్చుకున్న అడ్వాన్స్ తోనే సరిపుచ్చుకొనే పంథాలోకి వచ్చారు. అలాంటి హీరోల్లో రామ్, వరుణ్ తేజ్, నితిన్, నిఖిల్... ఉన్నారని తెలుస్తోంది. ఇక గోపీచంద్ తన పారితోషికంలో యాభై శాతం తగ్గించుకున్నట్టు సమాచారం. ఇది ఆరోగ్యకరమైన పరిస్థితి అని ట్రేడ్ పండిట్స్ సైతం అంగీకరిస్తున్నారు. ఈ పంథాలో అడుగు పెట్టకుండా, ఇంకా తమకు స్టార్ డమ్ ఉంది కాబట్టి, తాము డిమాండ్ చేసినంత పారితోషికాలు ఇవ్వాలి - అంటూ బీరాలు పోతే మొదటికే మోసం వస్తుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా హీరోలు రెమ్యూనరేషన్స్ తగ్గించుకుంటే నిర్మాతలకు భారీ ఊరట లభిస్తుంది. దాంతో ఏడాదికి రెండు, మూడు సినిమాలు తీసే ఛాన్స్ దక్కుతుంది. ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. మరి ఈ విషయం ఎంతమంది అర్థం చేసుకుంటారో చూడాలి.
Also Read: Nani - Shiva Karthikeyan: ఒకే తరహాలో ఆ ఇద్దరూ...
Also Read: Rao Bahadur Satya Dev: ఇదెక్కడి షాక్‌రా మామ.. ఇది అసలు ఊహించలే! రావుబహదూర్‌గా సత్యదేవ్