Nani - Shiva Karthikeyan: ఒకే తరహాలో ఆ ఇద్దరూ...
ABN , Publish Date - Aug 12 , 2025 | 01:10 PM
మొన్నటి వరకూవారిద్దరూ ఫ్యామిలీ హీరోస్ గా రంజింప చేశారు. ఇప్పుడు మాస్ మసాలా మూవీస్ లో మొరటుగా కనిపిస్తున్నారు. కెరీర్ బిగినింగ్ నుంచి ఈ ఇద్దరి జర్నీ ఒకే బాటలో సాగుతోంది. దీంతో ఆ ఇద్దరు హీరోలను కంపేర్ చేస్తున్నారు సినీజనం.
నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) కి తెలుగునాట ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు ఉంది. అలాగే తమిళనాట శివ కార్తికేయన్ (Shiva Karthikeyan) సైతం అదే తీరున సాగుతున్నారు. ఇద్దరూ స్వశక్తితో చిత్రసీమలో రాణిస్తున్నవారే. రేడియో జాకీగా కెరీర్ ఆరంభించారు నాని. ఇక యాంకర్ గా రాణించి, సినిమారంగంలో అడుగు పెట్టారు శివ కార్తికేయన్. తరువాత కుటుంబకథా చిత్రాలతో ఇద్దరూ ఫ్యామిలీస్ ను ఆకట్టుకొనే హీరోలుగా మారారు. ఇటు తెలుగునాట నాని, అటు తమిళంలో శివ కార్తికేయన్ బ్యాంకబుల్ హీరోస్ గా పేరు సంపాదించారు. తమ అభిరుచికి తగ్గట్టుగా సినిమాలనూ నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరూ మాస్ ను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది - అదే ఇక్కడి విశేషం. ఉన్నట్టుండి నాని 'దసరా' (Dasara) తో మాస్ హీరోగా జనం ముందు నిలచినా, అందులోనూ ఫ్యామిలీ సెంటిమెంట్ భలేగా పండించారు. ఇక శివకార్తికేయన్ కూడా 'అమరన్' (Amaran)తో మాస్ లుక్ తో మురిపించారు. ఇప్పుడు ఇద్దరూ మరింత డోసు పెంచి వస్తున్నారు. శివ కార్తికేయన్ 'మదరాసి' (Madarasi) గా రగ్డ్ లుక్ తో అలరించే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే నాని 'ద ప్యారడైజ్' (The Paradise) లో రెండు జడలు వేసుకొని మరీ విలక్షణంగా కనిపిస్తున్నారు. ఈ రెండు చిత్రాలలో హీరోలు వరైటీ గెటప్స్ లో కనిపించడం ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లో ఓ స్పెషల్ ఎట్రాక్షన్ క్రియేట్ చేశాయి. ఈ రెండు చిత్రాల్లో కామన్ ఏమిటంటే అనిరుధ్ రవిచందర్ సంగీతం అని చెప్పాలి.
భారీ అంచనాలతో 'మదరాసీ'...
నిజానికి నాని 'ప్యారడైజ్' వచ్చే సంవత్సరం విడుదల కానుంది. శివకార్తికేయన్ 'మదరాసీ' మాత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి ఎ.ఆర్.మురుగదాస్ దర్శకుడు. ఈ మధ్యే హిందీ చిత్రం 'సికందర్'తో అట్టర్ ఫ్లాప్ చూసిన మురుగదాస్ ఆశలన్నీ 'మదరాసీ'పైనే ఉన్నాయి. ఎలాగైనా 'మదరాసీ'తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కే ప్రయత్నంలో ఉన్నారు మురుగదాస్. ఇక శివకార్తికేయన్ మాత్రం 'అమరన్' లాంటి బిగ్ హిట్ చూసి 'మదరాసీ'గా అలరించబోతున్నారు. అందువల్ల 'మదరాసీ' పై తమిళనాట భారీ అంచనాలే నెలకొన్నాయి. రుక్మిణీ వసంత్ నాయికగా 'మదరాసీ' రూపొందుతోంది.
'ద ప్యారడైజ్' షెడ్యూల్ పూర్తి
ఇంతకు ముందు గెడ్డంతోనూ, జులపాల జుట్టుతోనూ కొన్ని చిత్రాల్లో కనిపించిన నాని ఈ సారి జడలు కూడా పెంచేసి 'ద ప్యారడైజ్'లో పలకరించబోతున్నారు. వాస్తవానికి ఈ సినిమా 2026 మార్చి 26వ తేదీన విడుదల కానుంది. అందువల్ల నాని 'ద ప్యారడైజ్'కు, శివకార్తికేయన్ 'మదరాసీ'కి పోలికేలేదు. పోటీ అసలే లేదు. కేవలం వారి విలక్షణమైన గెటప్స్ వల్లే ఈ రెండు సినిమాల గురించి చర్చించుకుంటున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతోన్న 'ద ప్యారడైజ్' భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. దాంతో ఈ సినిమాకు సంబంధించిన మరో గ్లింప్స్ ను సోమవారం సాయంత్రం రిలీజ్ చేశారు. ముందుగా వచ్చే శివకార్తికేయన్ 'మదరాసీ' ఏ తీరున అలరిస్తుందో? తరువాత మార్చిలో దర్శనమిచ్చే 'ద ప్యారడైజ్' ఏ రీతిన ఆకట్టుకుంటుందో చూద్దాం.
Also Read: Jolly LLB 3: కోర్టులో.. ఇద్దరు జాలీల రచ్చ! ఈ సారి అంతకుమించి
Also Read: OTT MOVIES : ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లివే! అవి మాత్రం వదలొద్దు