సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: అడ్వాన్సులతో.. కొడుతున్నారు

ABN, Publish Date - Sep 18 , 2025 | 12:35 PM

ఇటీవల కాలంలో హిట్ అయిన తెలుగు చిత్రాలలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కొత్త అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు నిర్మాతలు అడ్వాన్సులు చెల్లించి వారితో సినిమాలు నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Tollwood Hit movies

చిన్న సినిమాల విజయం పెద్ద వెలుగునిస్తుందంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో అలాంటి కాంతి ప్రసరిస్తోంది. దాంతో సక్సెస్ చూసిన వారి చుట్టూ సినీజనం ప్రదక్షిణలు చేస్తున్నారు. అడ్వాన్సులతో ఆకర్షిస్తున్నారు.

తేజ సజ్జా హీరోగా రూపొందిన 'మిరాయ్' సినిమా ఆల్ ఇండియాలో అదరహో అనిపిస్తోంది. గతంలో తేజ నటించిన 'హను-మ్యాన్' కన్నా మిన్నగా ఈ సినిమా విజయం సాధించిందని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. 'మిరాయ్' హిందీ అనువాదం దెబ్బకు స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీస్ సైతం చిత్తయ్యాయని అంటున్నారు. వాస్తవానికి వందల కోట్ల రూపాయలు వెచ్చించకుండానే 'మిరాయ్'లో వీఎఫ్ఎక్స్ ఆకట్టుకొనేలా రూపొందాయట. భారీ బడ్జెట్ మూవీస్ తీసేవారు 'మిరాయ్'ను చూసి నేర్చుకోవాలని సుభాష్ కె. ఝా, తరణ్ ఆదర్శ్ వంటి బాలీవుడ్ క్రిటిక్స్ సైతం కితాబు నిచ్చారు. దాంతో 'మిరాయ్' డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని వైపు పలువురి చూపు సాగుతోంది. ఆయనకు అడిగినంత అడ్వాన్స్ ఇవ్వడానికి పలువురు నిర్మాతలు సిద్ధమైనట్టు సమాచారం. ఇక 'మిరాయ్' హీరో తేజతో సినిమాలు నిర్మించడానికి కూడా అనేకమంది తహతహలాడుతున్నట్టు తెలుస్తోంది. 'మిరాయ్'తో పాటే విడుదలైన 'కిష్కింధపురి' యావరేజ్ గానే నిలచినా, ఆ చిత్ర దర్శకుడు కౌశిక్ కు మరో ఛాన్స్ దక్కినట్టు వినికిడి. ఆ సినిమా విలన్ శాండీ మాస్టర్ కూడా బిజీ అవ్వనున్నట్టు తెలుస్తోంది.


'లిటిల్ హార్ట్స్' వెలుగులు...

'మిరాయ్' కంటేముందుగానే వచ్చిన 'లిటిల్ హార్ట్స్' విజయం టాలీవుడ్ కు మరింత వెలుగును తెచ్చిందని చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఓ చిన్న సినిమా ఎంతో పెద్ద విజయాన్ని సాధించడం 'లిటిల్ హార్ట్స్'తోనే సాధ్యమయింది. ఈ మూవీ హీరో మౌళి, డైరెక్టర్ సాయి మార్తాండ్ ఇద్దరికీ పలువురు అడ్వాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నటుడు జగపతిబాబు కూడా సాయి మార్తాండ్ కు అడ్వాన్స్ ఇచ్చినట్టు సమాచారం. కనీసం ఐదుమంది నిర్మాతలు సాయిమార్తాండ్ కు అడ్వాన్సులు ఇచ్చారని టాలీవుడ్ టాక్. 'లిటిల్ హార్ట్స్' మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ కూడా నిర్మాతల దృష్టిలో పడ్డాడని అంటున్నారు.


ఈ యేడాది డీసెంట్ హిట్స్ గా నిలచిన సినిమాల్లోని నటీనటులకు, టెక్నీషియన్స్ కూ నిర్మాతల నుండి అడ్వాన్సులు అందాయని తెలుస్తోంది. 'కోర్టు' సినిమా డైరెక్టర్ రామ్ జగదీశ్ కూడా నాని హీరోగా ఓ మూవీకి కమిట్ అయ్యారు. 'కోర్టు' హీరోహీరోయిన్లు హర్ష రోషన్, శ్రీదేవి కూడా మంచి అవకాశాలు దక్కించుకున్నట్టు సమాచారం. రోషన్, శ్రీదేవి జంటగా రచయిత కోన వెంకట్ 'బ్యాండ్ మేళం' అనే సినిమా రూపొందించారు. దీంతో పాటు రోషన్ చేతిలో నాలుగు సినిమాలున్నట్టు సమాచారం. ఇలా పలువురు చిన్న సినిమాలతోనే టాలీవుడ్ లో అడ్వాన్సుల జాతరకు కారణమయ్యారు. అందరినీ మించి 'మిరాయ్' హీరో తేజ సజ్జా వైపే పలువురు చూస్తున్నారు. ప్రస్తుతం తేజ 'జాంబి రెడ్డి-2'లో నటించబోతున్నాడు. బాలీవుడ్ నుండి కూడా తేజకు మంచి ఆఫర్ వచ్చినట్టు సమాచారం. తెలుగు అగ్రనిర్మాతలు కొందరు తేజతో సినిమా తీసేందుకు భారీ అడ్వాన్సులు పట్టుకుని తిరుగుతున్నారనీ వినికిడి. 'మిరాయ్'తో విలన్ గా మారిన మంచు మనోజ్ కూడా బిజీ కానున్నారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని విజయాలు అడ్వాన్సుల 'కళ'ను పెంచుతాయో చూడాలి.

Also Read: Kalki 2898 AD: క‌ల్కి నుంచి.. దీపికా పదుకొణే ఔట్‌

Also Read: Bollywood: షారుఖ్ కోసం.. దిగొచ్చిన తారాలోకం

Updated Date - Sep 18 , 2025 | 01:31 PM