Kalki 2898 AD: కల్కి నుంచి.. దీపికా పదుకొణే ఔట్
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:11 PM
కల్కి 2898 ఎ.డి. సీక్వెల్ లో దీపికా పదుకొణే ఉండదని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ స్పష్టం చేసింది. తొలి భాగంలో జరిగిన సుదీర్ఘ ప్రయాణం తర్వాత తాము కలిసి ముందుకు సాగలేమనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే (Deepika Padukone) కు టాలీవుడ్ లో మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ప్రభాస్ 'స్పిరిట్' (Spirit) మూవీ నుండి దీపికా పదుకొణే తప్పుకోవాల్సి వచ్చింది. ఆ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)... దీపికా పదుకొణేలోని అన్ ప్రొఫెషనలిజమ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసి, ఆమె స్థానంలో తృప్తీ డిమ్రీని హీరోయిన్ గా తీసుకున్నట్టు ప్రకటించాడు. ఆ తర్వాత దీపికా పదుకొణే టీమ్ ఏ కారణంగా ఆమె ఆ ప్రాజెక్ట్ నుండి బయటకు వెళ్ళిపోయిందో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ... ఎవ్వరూ దానికి అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. కొంతమంది హీరోయిన్లు మాత్రం దీపికా పదుకొణే కోణంలో ఆలోచించినప్పుడు ఆమె డిమాండ్లలో తప్పులేదనే మాట చెప్పారు. అయితే... చిత్రంగా ఆ తర్వాత కొద్ది రోజులకే అల్లు అర్జున్ (Allu Arjun) - అట్లీ (Atlee) మూవీలో అవకాశాన్ని చేజిక్కించుకుని దీపికా పదుకొనే అందరిని సంభ్రమకు గురిచేసింది. నిజంగానే దీపికా పదుకొణే అంత అన్ ప్రొఫెషనల్ అయి ఉంటే బన్నీ - అట్లీకి సంబంధించిన భారీ పాన్ ఇండియా మూవీకి వారు తీసుకునేవారు కాదు కదా! అనే మాట వినిపించింది. అయితే... ఇప్పుడు దీపికా పదుకొణే కెరీర్ కు మరో మచ్చ 'కల్కి' సీక్వెల్ విషయంలో పడింది.
వైజయంతీ మూవీస్ సంస్థ 'కల్కి 2898 ఎ.డి' (Kalki 2898 A.D) సీక్వెల్ లో దీపికా పదుకొణే నటించడం లేదనే విషయాన్ని స్పష్టం చేసింది. మొదటి సినిమా సమయంలో జరిగిన సుదీర్ఘ ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మేకర్స్ తెలిపారు. పరస్పర అంగీకారంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలియచేశారు. ఇక మీదట కలిసి ప్రయాణం చేయడం సాధ్యమయ్యే పని కాదనే నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు. 'కల్కి' వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ కు కేవలం నిబద్థత ఒక్కటే సరిపోదని, దానిని మించి ఉండాలని మేకర్స్ అభిప్రాయపడ్డారు. దీపికా పదుకొణే అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కు వారు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: Bollywood: షారుఖ్ కోసం.. దిగొచ్చిన తారాలోకం
Also Read: Kamal Haasan And Rajinikanth: కమల్‌తో తలైవా ఓకే.. దర్శకుడే కొలిక్కి రాలేదు..