Pawan - Prabhas: 'ఓజీ -2'లో వాళ్ళిద్దరూ....
ABN, Publish Date - Sep 25 , 2025 | 03:01 PM
'ఓజీ' సినిమాను 'సాహో'తో లింక్ చేశాడు దర్శకుడు సుజీత్. 'ఓజీ'లోని ప్రకాశ్ రాజ్, 'సాహో'లోని జాకీష్రాఫ్ ఇద్దరూ అన్నదమ్ములు అన్నట్టుగా చూపించాడు. అంటే... ఒకవేళ రేపు సుజీత్ 'ఓజీ 2' తీయాల్సి వస్తే... అటు పవన్ కళ్యాణ్, ఇటు ప్రభాస్ కలిసి నటించే ఆస్కారం లేకపోలేదు.
కొంతకాలంగా బయట జరుగుతున్న ప్రచారాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) నిజం చేశాడు! యూనివర్స్ కాన్సెప్ట్ తో మూవీస్ చేస్తున్న యువ దర్శకుల జాబితాలో అతను కూడా చేరాడు. తమిళంలో లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) ఈ కాన్సెప్ట్ ను ప్రారంభించి, సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నాడు. తన ఒక చిత్రంలోని పాత్రలను మరో చిత్రంలో పెడుతూ, యూనివర్స్ అనే పేరు పెట్టినా... క్రాస్ ఓవర్ మూవీస్ చేస్తున్నాడు. తెలుగులో అదే కాన్సెప్ట్ తో ముందు వెళ్ళబోతున్నట్టు ప్రశాంత్ వర్మ 'హను-మాన్' మూవీ తర్వాత తెలిపాడు. అయితే ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ ఏ మేరకు ఆచరణలో పెడతాడో 'జైహనుమాన్' మూవీ చూస్తే కానీ అర్థం కాదు. కాకపోతే అతను నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాలను కూడా ఈ యూనివర్స్ కు లింక్ చేయస్తానని చెబుతున్నాడు.
ఇదిలా ఉంటే... సుజీత్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'ఓజీ' (OG) ని కూడా 'సాహో' (Sahoo) యూనివర్స్ లో భాగం చేశాడని తెలుస్తోంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవమేనని అర్థమైంది. 'ఓజీ' విడుదలకు ముందు ఈ విషయమై సుజీత్ ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. కానీ గురువారం విడుదలైన సినిమా చూసినప్పుడు చాలా తెలివిగా సుజీత్ 'ఓజీ'తో 'సాహో' సీన్ ను మిక్స్ చేశాడు. ఫిక్షనల్ మెట్రోపాలిటన్ సిటీ 'వాజీ' మీద ఆధిపత్యం సంపాదించడం కోసం ఓమీ గతంలో సత్య దాదా తమ్ముడు నరంతక్ రాయ్ (జాకీష్రాఫ్)ను అంతం చేశాడన్నట్టుగా 'ఓజీ'లో ఓ సీన్ పెట్టారు. అందులో 'సాహో నా కొడుకు అనేది ప్రపంచానికి తెలియకుండా పెంచు' అంటూ జాకీష్రాఫ్... లాల్ కు 'సాహో'ను అప్పటించే సీన్ మెరుపులా వచ్చి వెళ్ళింది. అంటే... 'ఓజీ'లోని సత్యా దాదా, 'సాహో'లోని నరంతక్ రాయ్ అన్నదమ్ములనే విషయాన్ని కొత్తగా సుజీత్ తెలిపాడు. రేపు సుజీత్ తాను అనుకుంటున్నట్టుగా 'ఓజీ' సీక్వెల్ తీస్తే.... అందులో ప్రకాశ్ రాజ్ పెంపుడు కొడుకు ఓజీ, జాకీ ష్రాఫ్ కొడుకు సాహో చేతులు కలిపే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే 'ఓజీ' మీద పగ తీర్చుకోవడానికి ఇప్పటికే విదేశాలలో భారీ కుట్ర జరుగుతున్నట్టు తెలిపారు. సో... 'ఓజీ'కి లభించే సక్సెస్ ను బట్టి... సుజీత్ 'ఓజీ 2'లో ఇద్దరు క్రేజీ స్టార్స్ ను ఒకే చోటకు తీసుకొచ్చే ఛాన్స్ లేకపోలేదు.
Also Read: Manchu Lakshmi: బాడీ షేమింగ్ ప్రశ్నలు.. క్షమాపణ చెప్పిన జర్నలిస్ట్
Also Read: Pawan Kalyan: 'ఓజీ' సీక్వెల్ కు సిద్థంకండి...