Kannappa: హార్డ్ డ్రైవ్ చోరీపై మంచు విష్ణు వివరణ
ABN, Publish Date - May 27 , 2025 | 04:44 PM
'కన్నప్ప' సినిమాకు సంబంధించిన వి.ఎఫ్.ఎక్స్. ఉన్న హార్డ్ డ్రైవ్స్ చోరీపై మంచు విష్ణు వివరణ ఇచ్చారు. ఇది కేవలం చోరి కాదని వెన్నపోటు అని విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం ఉదయం నుండి మీడియాలో హల్చల్ చేస్తున్న 'కన్నప్ప' (Kannappa) సినిమా హార్డ్ డ్రైవ్ చోరీపై ఎట్టకేలకు మంచు విష్ణు (Manchu Vishnu) వివరణ ఇచ్చారు. ఈ సంఘటన జరిగి నాలుగు వారాలు అయ్యిందని తెలిపారు. ఇప్పటికే పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ అధికారులు దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. కావాలని కొందరు ఈ కుట్రకు తెర తీశారని, వారందరి గురించి సమాచారం తమకు తెలిసిందని అన్నారు. ఈ విషయమై విష్ణు స్పందిస్తూ, 'ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుండి హైదరాబాద్ లోని మా కార్యాలయానికి హార్డ్ డ్రైవ్ వచ్చింది. అయితే దానిని మా సంస్థతో ఏ మాత్రం సంబంధం లేని చరిత అనే మహిళ రఘు అనే వ్యక్తి ద్వారా అందుకుని చోరికి పాల్పడింది. అప్పుడే ఈ విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాం. నిజానికి ఇది దుందుడుకు చర్యనో, తమాషా కోసం చేసిందో కాదు ఖచ్చితమైన వెన్నుపోటు. మా సినిమా విడుదల సమయంలో 90 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను లీక్ చేయడానికి చేసిన కుట్ర. ఈ హార్డ్ డ్రైవ్ లో కన్నప్ప లోని రెండు ప్రధాన పాత్రలకు మధ్య కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ తో పాటు కీలకమైన వి.ఎఫ్.ఎక్స్. వర్క్ కు సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి' అని తెలిపారు.
ఈ దొంగతనం వెనుక ఉన్న అసలైన కారణాల గురించి చెబుతూ, 'మా 'కన్నప్ప' సినిమా విడుదలను అడ్డుకోవడానికి, ఈ సన్నివేశాలను లీక్ చేయడానికే ఈ రకమైన పనిచేసినట్టుగా మాకు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. దాంతో మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సైబర్ క్రైమ్ వారికి ఫిర్యాదు చేశారు. దయచేసి ఈ సినిమాకు సంబంధించిన పైరేటెడ్ కంటెంట్ బయటపడితే దానిని వినోదం కోసం ప్రసారం చేయవద్దని మనవి చేస్తున్నాను. ఓ నిబద్ధతతో మా బృందం 'కన్నప్ప' చిత్రాన్ని ఓ ల్యాండ్ మార్క్ గా మార్చడానికి కృషి చేసింది. ఇలాంటి పనులు చేయడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న తెలుగు సినిమా ఖ్యాతిని దిగజార్చడం, అవమానించడమే అవుతుంది' అని అన్నారు. ఇలాంటి చర్యలు తమ సినిమాను ఏమాత్రం అడుకోవలేవని చెప్పారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాకు సంబంధించిన 'శ్రీ కాళ హస్తి' గీతం బుధవారం విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను మంగళవారం విడుదల చేశారు. ఈ పాటలో మంచు విష్ణు ఇద్దరు కుమార్తెలు నటించడం విశేషం.
Also Read: Housefull 5: అక్షయ్ కుమార్ హౌస్ ఫుల్ 5.. ఆ వెంకీ మూవీని మొత్తం కాపీ కొట్టారుగా!
Also Read: Sunny Leon: హాలీవుడ్ చిత్రంలో పోర్న్ స్టార్...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి