Young Tiger: వెట్రిమారన్ వైపు యన్టీఆర్ చూపు
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:34 PM
యంగ్ టైగర్ యన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మూవీలో నటిస్తున్నారు. వాట్ నెక్ట్స్ - అంటే 'దేవర-2' అనే వినిపించింది. కానీ, హఠాత్తుగా యన్టీఆర్ వేరే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏమిటది !?
స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తో యన్టీఆర్ (NTR) చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ యేడాది వచ్చిన యన్టీఆర్ 'వార్ 2' (War 2) అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. దాంతో వారిని ఆనందింప చేసే దిశగా అడుగులు వేయాలని యంగ్ టైగర్ ఆశిస్తున్నారట. అందులో భాగంగానే ముందుగా అనుకున్న ప్రకారం 'దేవర-2' (Devara 2) ను కాకుండా మరో ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టాలని ఆశిస్తున్నట్టు సమాచారం. తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaaran) దర్శకత్వంలో ఓ సినిమాలో నటించడానికి యన్టీఆర్ ఉత్సాహం ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో 'దేవర' సినిమా ప్రమోషన్స్ లోనే తనకు వెట్రిమారన్ దర్శకత్వంలో నటించాలని ఉందని చెన్నైలో ప్రకటించారు యన్టీఆర్. అప్పట్లో అందరిలోనూ యన్టీఆర్ మాటలు ఆసక్తి కలిగించాయి. తరువాత 'వార్ 2' హిందీ మూవీ పనిలో పడడం- ఆ సినిమా తరువాత యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించే మరో యాక్షన్ థ్రిల్లర్ లో యన్టీఆర్ నటిస్తారని వినిపించడం జరిగింది. 'వార్ 2' పరాజయంతో యన్టీఆర్ వైపు యశ్ రాజ్ ఫిలిమ్స్ చూడడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 'దేవర-2' కంటే ముందు ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టాలని యన్టీఆర్ యోచిస్తున్నారని సమాచారం.
'వార్-2'లో యన్టీఆర్ నటించకుండా ఉంటే ఎంతో బాగుండేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందులో నటించినా విలన్ పాత్ర చేయకుండా ఉండాల్సిందనీ అంటున్నారు. పైగా యన్టీఆర్ కు హీరోయిన్ కూడా లేకపోవడంతో ఎంతో నిరాశ చెందారు ఫ్యాన్స్. 'వార్ 2'తో యన్టీఆర్ ఏకంగా హిందీ చిత్రసీమలో ఓ టాప్ స్టార్ అయిపోతారనీ బాలీవుడ్ బాబులు టముకు వేశారు. అవేమీ జరగకపోగా, యన్టీఆర్ కు కూడా ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఈ నేపథ్యంలోనే యన్టీఆర్ తమిళ స్టార్ హీరో ధనుష్ బాటలో పయనించాలని ఆశిస్తున్నట్టు సమాచారం. ధనుష్ కూడా ఒకప్పుడు నిరాశకు గురైన సమయంలో వెట్రిమారన్ డైరెక్షన్ తో సాగారు. వెట్రిమారన్ తెరకెక్కించిన 'ఆడుకాలమ్'తోనూ, 'అసురన్'తోనూ రెండుసార్లు ధనుష్ నేషనల్ అవార్డు అందుకున్నారు. అదే తీరున తనలోని నటుణ్ణి సంతృప్తి పరిచే కేరెక్టర్ ను వెట్రిమారన్ డైరెక్షన్ లో చేయాలని యంగ్ టైగర్ ఆశిస్తున్నారని వినికిడి.
Also Read: Coolie OTT: రజనీకాంత్‌కూ తప్పలేదు.. నెల తిరక్కుండానే ఓటీటీకి
Also Read: Atharvaa Murali: 'టన్నెల్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది...